అనర్హతా వేటు వేసినా సరే తాను అసెంబ్లీకి రానని జగన్ రెడ్డి తీర్మానించేసుకున్నారు. అసెంబ్లీకి ఆయన వెళ్లకపోవడానికి తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం అంటున్నారు. అలా ఇవ్వాలని ఎక్కడా లేదు. ఆయన ఎమ్మెల్యే హోదాలో అయినా అసెంబ్లీకి పోవాల్సిందే. అసలు ప్రజలు ఎన్నుకున్నది.. ఎమ్మెల్యేగా ప్రధాన విధి అసెంబ్లీకి వెళ్లమని. వెళ్లకపోతే ఆయన పని చేయనట్లే లెక్క. అనర్హతా వేటు ఇప్పటి వరకూ ఈ కారణంతో ఎవరికీ వేయలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికయినా ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని కలలు కంటాడు. మాట్లాడాలని అనుకుంటాడు. తనను ఎన్నుకున్న వారి కోసం మాట్లాడుతారు.
కానీ జగన్ మాత్రం అసెంబ్లీకి వచ్చే మాట్లాడాలా అంటున్నారు. అలాంటప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండాల్సిన పని లేదు. అసెంబ్లీ పవిత్రత తెలియని వారికి ఆ సభ సభ్యుడిగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఆయనపై అనర్హతా వేటు వేయడమే ఉత్తమం. ఈ విషయంలో ఆయనకు కాని ..ఆయన పార్టీ సభ్యులకు కానీ సానుభూతి వచ్చే అవకాశం లేదు. అసెంబ్లీకి వెళ్లని జగన్ కు ఎమ్మెల్యే పదవి ఎందుకు అని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు.
నిబంధనల ప్రకారం మూడు సెషన్లు లేదా అరవై రోజులు సెలవు చీటీ పంపకుండా అసెంబ్లీకి గైర్హాజర్ అయితే నిబంధనల ప్రకారం ఆ స్థానం ఖాళీ అని నోటిపై చేయడానికి స్పీకర్ కు అధికారం ఉంటుంది. న్యాయపరమైన అంశాలు కూడా ఇందులో జోక్యం చేసుకోవడానికి ఉండవు. ఎందుకంటే ఎమ్మెల్యే ప్రధాన విధి అసెంబ్లీకి హాజరు కావడం అది లేనప్పుడు ఆయనపై అనర్హతా వేటు వేస్తే న్యాయస్థానాలు మాత్రం వ్యతిరేకించే అవకాశాలు ఉండవు. స్పీకర్ నిర్ణయంలో జోక్యం చేసుకోవు. అందుకే పులివెందులకు ఉపఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అది ఈ ఏడాదే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.