తెలంగాణా శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి తెదేపా నేతల ఒత్తిడికి తలొగ్గి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజినామాపై రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకొనేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ జి.హెచ్.యం.సి. ఎన్నికల ముందు తెరాస ప్రభుత్వం అటువంటి రిస్క్ తీసుకొంటుందని భావించలేము. తన సనత్ నగర్ నియోజక వర్గం నుండి తనను ఎవరూ కూడా ఓడించలేరని తలసాని బల్ల గుద్ది వాదిస్తున్నప్పటికీ ఒకవేళ ఆయన ప్రతిపక్షాల చేతిలో ఓడిపోయినట్లయితే ఆ ప్రభావం తప్పకుండా జి.హెచ్.యం.సి. ఎన్నికలపై పడవచ్చును. తమ పార్టీ నేతలను, ప్రజా ప్రతినిధులను తెరాసలోకి ఆకర్షిస్తూ తమను నానాటికీ బలహీనపరుస్తున్నందుకు, కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు తలసాని రాజీనామా కారణంగా జరుగబోయే ఈ ఉప ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయం కోసం హోరాహోరీగా పోరాడవచ్చును. తెరాసను ఓడించేందుకు అవసరమయితే ఆ మూడు పార్టీలు లోపాయికారిగా ఒకదానికొకటి సహకరించుకొన్నా ఆశ్చర్యం లేదు.
కనుక స్పీకర్ మధుసూదనాచారి తెదేపా నేతలకి మాట ఇచ్చినప్పటికీ దానిని ఇప్పుడప్పుడే అమలు చేస్తారని ఆశించలేము. కానీ జి.హెచ్.యం.సి. ఎన్నికలు కూడా ఇప్పుడప్పుడే నిర్వహించే సూచనలేవీ కనబడటం లేదు. ఈ ఏడాది డిశంబర్ 15 వరకు తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు గడువు ఇచ్చింది. అవసరమయితే మరికొన్ని నెలలు పొడిగించేందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచన కూడా ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇదివరకు ఒకసారి మీడియాతో అన్నట్లు వార్తలు వచ్చేయి. అంటే అంతవరకు తలసాని రాజీనామా సీరియల్ కూడా కొనసాగుతూనే ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి.