పాదయాత్ర ఓ నాయకుడిలో ఇంత మార్పు తెస్తుందా..? గతానికి భిన్నంగా మనిషిని పూర్తిగా మార్చేస్తుందా..? నాయకత్వ లక్షణాలను అబ్బేలా చేస్తుందా..? నారా లోకేష్ పాదయాత్ర జరిగిన తీరు.. ఆయనకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. ఎనిమిది నెలలుగా పాదయాత్ర చేస్తున్న లోకేష్ 2500 కిలోమీటర్ల మేర నడిచారు. మంగళగిరి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో పర్యటనలు.. గడప గడపకు కార్యక్రమాలు ముగించుకుని పాదయాత్రకు వెళ్లిన లోకేష్ మళ్లీ 185 రోజుల తర్వాత తన సొంత నియోజకవర్గమైన మంగళగిరికి చేరుకున్నారు. ఈ 185 రోజుల్లో 2500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన లోకేష్‌లో వచ్చిన మార్పులు.. భవిష్యత్ నాయకుడిగా లోకేష్ ఎదిగిన వైనం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు తర్వాత పార్టీని నడిపేదెవరు..? సరైన నాయకుడు టీడీపీ లేడనే వారికి లోకేష్ తన పాదయాత్రతో సమాధానం ఇచ్చారు. నో డౌట్.. ఎవ్వరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా ఇప్పుడు లోకేష్‌ను పార్టీలోని సీనియర్ నేతలు అంగీకరించారు. పార్టీ కేడర్ అంగీకరించింది. టీడీపీకి మూడో తరం నాయకుడు వచ్చేశాడని పార్టీ నేతలు.. కేడర్ ఫిక్స్ అయిపోయారు. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. పాదయాత్రకు వెళ్లే ముందు ఒకటి కాదు రెండు కాదు లోకేషుకు చాలా మైనస్సులే ఉన్నాయి. పార్టీలోనే లోకేష్‌కు పూర్తి స్థాయిలో యాక్సెప్టెన్సీ లేదు. లోకేష్‌కు మాస్ ఇమేజ్ లేదు. లోకేష్‌కు నాయకత్వ లక్షణాలు లేవు. అధికారంలో ఉండి.. మంత్రిగా ఉండి.. సీఎం తనయుడుగా ఉండి కూడా ఎన్నికల్లో గెలవలేకపోయాడు. అద్భుతమైన వక్త కాదు. అసలు పాదయాత్ర చేయగలరా..? మధ్యలోనే ఆపేస్తారా..? ఇదీ లోకేష్ విషయంలో ఉన్న మైనస్సులు. నిజం చెప్పాలంటే ఓ తండ్రి చాటు బిడ్డగా లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించారు.
అనేక మైనస్సులతో పాదయాత్ర ప్రారంభించిన లోకేష్
ఇన్ని మైనస్సులు అధిగమించి తన మీద.. తన నాయకత్వం మీద నమ్మకం కలిగించాలంటే మామూలు విషయం కాదు. కానీ లోకేష్ తన 185 రోజుల పాదయాత్రలో దాదాపు మైనస్సులన్నింటినీ అధిగమించినట్టుగానే కన్పిస్తోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లోకేష్ పాదయాత్రకు ఇవ్వాల్సినంత ప్రయార్టీ ఇవ్వడం లేదు.. లోకేష్‌కు రావాల్సినంత ఎలివేషన్ రావడం లేదు. కానీ క్షేత్ర స్థాయిలో లోకేష్‌కు ఓ రేంజ్లో ఇమేజ్ బిల్డప్ అవుతున్నాయని చెప్పక తప్పదు. ప్రస్తుతం పార్టీలో చంద్రబాబుకు ఓ రకమైన ఇమేజ్ ఉంటే.. లోకేష్‌కు మరో రకమైన ఇమేజ్ వచ్చింది. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు తమ బాగోగులు పట్టించుకున్నా.. పట్టించుకోకున్నా.. లోకేష్ ఉన్నాడుగా అనే భరోసా కేడర్‌కు వచ్చింది. ఎవరు పని చేశారు..? ఎవరు నాటకాలు ఆడారు అనే విషయాన్ని బేరీజు వేసుకుని నిజమైన.. నిఖార్సైన.. జెండా పట్టుకున్న కార్యకర్తలకు.. నేతలకు సముచిత స్థానం దక్కుతుందనే నమ్మకాన్ని లోకేష్ కేడర్‌కు ఇవ్వగలిగారని ఘంటా పధంగా చెప్పొచ్చు. ఈ పార్టీకి ఎంత చేసినా ఇంతే.. అనే పరిస్థితి నుంచి లోకేష్ ఉన్నాడుగా అని పార్టీ కేడర్ గట్టిగా చెప్పుకునే పరిస్థితులు ప్రస్తుతం పార్టీలో ఉన్నాయంటే లోకేష్ తన పాదయాత్ర ద్వారా కేడర్‌లో ఎంతటి నమ్మకాన్ని నింపారో అర్థమవుతోంది.
పార్టీ నేతలను సమర్థంగా డీల్ చేస్తున్న లోకేష్
ఇక లీడర్లను లోకేష్ టాకిల్ చేసిన విషయానికొస్తే.. కేడర్ నమ్మకంగా ఉంటారు కానీ.. కొందరు లీడర్లు మాత్రం వారి వారి స్వార్థం మేరకు వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే అధినాయకత్వం మెప్పు కోసం వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు లోకేష్ పాదయాత్రలో చాలానే జరిగినట్టున్నాయి. అంతకు ముందు తనకు పెద్ద పెద్ద లీడర్లుగా కన్పించిన వారి నిజస్వరూపాలన్నీ.. వారి వాస్తవ రూపాలను లోకేష్ పూర్తి స్థాయిలో అర్థమైంది. అలా కన్పించిన వారికి ఎక్కడికకక్కడే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నారట ఈ పాదయాత్రీకుడు. పార్టీ కంటే.. కేడర్ కంటే తనకెవరు ముఖ్యం కాదని స్పష్టంగా.. ఎలాంటి మొహమాటాలు.. శషభిషలు లేకుండా లోకేష్ చెప్పేస్తున్నారని పార్టీలో చాలా మంది చెప్పుకుంటున్నారు. అదే టైంలో పాదయాత్రతో సంబంధం లేకుండా పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. పార్టీలో పదవులు అనుభవించి.. ప్రతిపక్షంలోకి వచ్చాక సైలెంట్ అయి.. తోక జాడించిన.. జాడిస్తోన్నా కొందరు సీనియర్ లీడర్లకు లోకేష్ ముచ్చెమటలు పట్టించారు. తన కెరీర్లో ఎన్నడూ భయపడని విధంగా లోకేష్ వారిని భయంతో పరుగులు పెట్టించిన సందర్భాలు ఈ ఎనిమిది నెలల్లోనే చాలానే ఉన్నాయి. ఇది లోకేష్‌లోని నాయకత్వ పరిపక్వతకు అద్దం పడుతోంది. ఒకప్పుడు ఆ లోకేషేగా అంటూ లైట్‌గా తీసుకున్న పార్టీలోని కొందరి వృద్ధ జంబూకాలకు బాబోయ్ లోకేష్.. అతనితో జాగ్రత్తగా ఉండాలి.. తండ్రిలా కాదు.. అనే వాతావరణం ఏర్పడేలా చేసుకున్నదీ ఈ పాదయాత్రలోనే.
జనంతో మమేకం అవ్వడంలో లోకేష్ ప్రత్యేక శైలి !
ఇక జనంతో మమేకం అయ్యే విషయంలో కూడా లోకేష్ గతం కంటే చాలా మెరుగయ్యారనే చెప్పాలి. ఓ అన్నలా.. ఓ కొడుకులా.. ఓ మనవడిలా.. ఓ స్నేహితుడిలా.. ఇలా అందరిలోనూ కలిసిపోతున్నారు లోకేష్. కొందరు వృద్ధులు లోకేష్‌కు నమస్కారం చేస్తుంటే.. మీరు నమస్కారం చేయడం కాదు.. ఆశీర్వదించండంటూ లోకేష్ తిరిగి అభివాదం చేస్తూ వారి ఆశీర్వాదం తీసుకోవడం వంటి సంఘటనలు చూస్తుంటే లోకేష్‌లో కలివిడితనం మస్తుగా ఉందనిపిస్తోంది. చంద్రబాబు టీడీపీలోకి వచ్చిన తొలినాళ్లల్లోనూ.. సీఎం అయ్యాక మొదటి టర్మ్‌లోనూ సరిగ్గా ఇలాగే ఉండేవారని పార్టీలోని కొందరు సీనియర్లు చెబుతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు కొంత గాంభీర్యాన్ని ప్రదర్శించడం వల్ల గ్యాప్ పెరిగిందని అంటున్నారు. 30 ఏళ్ల క్రితం చంద్రబాబులో ఎలాంటి హ్యూమన్ టచ్ ఉండేదో.. తనయుడు లోకేష్‌లో అంతకు మించిన హ్యూమన్ టచ్ కన్పిస్తోందని సీనియర్లు అంటున్నారు. ఇక లోకేష్ పాదయాత్రకు.. లోకేష్ బహిరంగసభలకు వచ్చే జనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాదయాత్రకు ముందు లోకేష్‌కు ఎలాంటి మాస్ ఇమేజ్ లేదు. కానీ జనం లోకేష్‌ను చూడడానికి ఎగబడుతున్నారు. ఇదంతా మేనేజ్ చేసి రప్పించుకుంటున్నారని అనే వాళ్లు అనవచ్చు గాక.. కానీ లోకేష్ పాదయాత్రకు వచ్చే వారిలో మహిళలు.. యువత లోకేష్‌ను కలవడానికి.. షేక్ హ్యండ్ ఇవ్వడానికి వారి చూపుతున్న ఉత్సాహం చూస్తుంటే.. వారు కిరాయి మనుషుల్లా కన్పించడం లేదు. లోకేష్ కోసం స్వచ్ఛంధంగా వచ్చిన వారేనని చెప్పొచ్చు.
పాత ఇమేజ్ ను మర్చిపోయేలా చేసిన లోకేష్
185 రోజుల పాదయాత్రలో లోకేష్ ఇంకా పూర్తి స్థాయిలో మాస్ లీడర్‌గా ఎదిగారని చెప్పకున్నా.. మాస్ ఇమేజ్ తెచ్చుకునే దారిలో చాలా వరకు సక్సెస్ అయినట్టే కన్పిస్తోంది. ఎన్టీఆర్ తర్వాత టీడీపీకి మాస్ ఇమేజ్ లేదు. రాలేదు. చంద్రబాబును వ్యూహకర్తగానో.. మంచి పరిపాలనాదక్షుడిగానో చూశారు తప్ప.. మాస్ ఇమేజ్.. ఛరిష్మా ఉన్న నేతగా చూడలేదు. కానీ లోకేష్‌కు మాస్ ఇమేజ్ ఏర్పడుతోంది. పార్టీకి ఈ సమయంలో ఏం కావాలో అది ఇప్పుడు లోకేష్ ద్వారా వస్తుందనే చెప్పాలి. గత ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీకి కేవలం 3 స్థానాలే దక్కాయి. కానీ రాయలసీమలో లోకేష్ పాదయాత్ర ఓ ఊపు ఊపేసింది. సీమలో కొన్ని సెగ్మెంట్లల్లో తప్ప.. మెజార్టీ సెగ్మెంట్లల్లో లోకేష్ పాదయాత్రకు అద్భుత స్పందన వచ్చిందనే చెప్పాలి. అలాగే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనూ రోజు రోజుకూ లోకేష్ పాదయాత్రకు ఆదరణ పెరుగుతూనే ఉంది.
సిక్కోలుకు చేరే సరికి ప్రజల ఎదుట సరికొత్త మాస్ లీడర్ !
ఇక ప్రత్యర్థి పార్టీలకు లోకేష్ ఇచ్చే కౌంటర్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. అదే సమయంలో ఆయా సెగ్మెంట్లల్లో స్థానికంగా ఉన్న నేతలు ఎలాంటి అవినీతి.. అవకతవకలకు పాల్పడుతున్నారనేది వివరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో లెక్కలేసి మరీ వివరిస్తున్నారు. ఇప్పటి వరకు స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు.. చేయని ఎన్నో పనులను.. కౌంటర్లను లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా ఇస్తున్నారు. దీంతో చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారంటే చాలు లోకేష్ చేసే కామెంట్లకు ఎలాంటి కౌంటర్లివ్వాలా..? అని ప్రిపేర్ అయిపోతున్నారట. ఇది చాలదు.. లోకేష్ ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నాడో చెప్పడానికి అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇలా చెప్పుకుంటూ పోతే లోకేష్ పాదయాత్ర గురించి చాలానే చెప్పొచ్చు.