స్వీయలోపములెరుగుల పెద్ద విద్య అన్నారు!
అక్కినేనికి తన బలాల కంటే బలహీనతలు బాగా తెలుసు.
అందుకే ఆయన బలవంతుడు!
చిత్రసీమలో పేరొంత వేగంగా వస్తుందో,
పుకార్లూ అంతే బలంగా అంటుకుంటాయి.
దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో.. ఏనాడూ తనపై చిన్న గీత కూడా పడకుండా చూసుకొన్న గుణవంతుడాయన.
అవకాశాలు రాక కొందరు మంచివాళ్లుగా మిగిలిపోతుంటారు.
చుట్టూ రకరకాల ఆకర్షణలు ఉన్నా..
ఏ నాడూ గీత దాటని వాడు.. ఎప్పుడూ బుద్ధిమంతుడే.
ఆయనా అంతే.
ఆయనే.. ఏఎన్నార్!!!!
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో అక్కినేనికి బాగా తెలుసు. అందుకు ఎన్నో ఉదాహరణలు.
చిత్రసీమకు రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎఎన్నార్!
అప్పట్లో ఎన్టీఆర్‌కి ఏఎన్నార్‌తో… ఏఎన్నార్‌కి ఎన్టీఆర్తోనే పోటీ!
ఏఎన్నార్‌తో పోలిస్తే.. అందంలోనూ, ఆకర్షణలోనూ, ఇమేజ్‌లోనూ, ఆఖరికి ఎత్తులోనూ ఎన్టీఆర్కే ఎక్కువ మార్కులు పడతాయి. ఈ విషయం అక్కినేనికీ బాగా తెలుసు. అందుకే ఎన్టీఆర్ ఏం చేస్తే నేనూ అదే చేయాలని తాపత్రయపడలేదు. ఎన్టీఆర్ పౌరాణికంలో రారాజు. అందుకే ఏఎన్నార్ సాంఘికంపై దృష్టి పెట్టారు. సోషల్ సినిమాల్లో అక్కినేని రారాజుగా ఎదిగారు. అది తన బలం. ఓ పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడిగా, అక్కినేని అర్జునుడిగా నటించారు. ఆ తరవాత.. ఎన్టీఆర్‌తో పౌరాణిక సినిమాల్లో నటించడమే మానేశారు అక్కినేని. ఎందుకంటే.. పౌరాణిక గెటప్ లో ఎన్టీఆర్ పక్కన ఏఎన్నార్ మరుగుజ్జుగా కనిపించడమే. ఈ విషయాన్ని అక్కినేని కూడా ఒప్పుకొన్నారు. `ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు గొప్పగా చేస్తారు. ఆయన కోసమే ఆ పాత్రలు సృష్టించినట్టు ఉంటాయి. అలాంటప్పుడు ఆయన పక్కన ఎవరు చేసినా మరుగుజ్జులుగానే కనిపిస్తారు. అందుకే.. నేను ఆ సాహసం చేయలేదు` అని ఓ సందర్భంలో ఒప్పుకొన్నారు అక్కినేని. తన సమకాలికుడ్ని, పోటీ దారుడ్నిఈ స్థాయిలో మెచ్చుకోవడం అక్కినేనికే సాధ్యమైంది.
నికార్సయిన ఆరోగ్య సూత్రాల్ని పాటిస్తారు అక్కినేని. అందుకే 90 ఏళ్లయినా.. దృఢంగా నిలబడగలిగారు. మాయిదారి కాన్సర్ కబళించింది కానీ… వందేళ్లూ ఉండేవారే. కాన్సర్ వచ్చిన్పపుడు కూడా ఆయన కృంగిపోలేదు. ఆ విషయాన్ని మీడియా ముందే గ్రహించి, చివవలూ పలవలుగా కథనాలు రాకయముందే.. అక్కినేని మేల్కొన్నారు. ఆ విషయాన్నే తనే ప్రకటించింది అందరినీ ముందే సన్నద్ధం చేసిన తీరు… అపూర్వం. కాన్సర్ వస్తే, అదేదో అవార్డు వచ్చినట్టు, తన కుటుంబ సభ్యుల్ని పక్కన కూర్చోబెట్టుకొని మరీ.. ప్రెస్ మీట్ పెట్టేంత ధైర్యం అక్కినేనికే ఉందేమో..?
బైపాస్ ఆపరేషన్ తరవాత సుదీర్ఘ కాలం బతికిన రికార్డ్ కూడా అక్కినేనిదే. `రాత్రయితే రెండంటే రెండు పెగ్గులు.. అంతే. అది కూడా గుండెకు మంచిదని డాక్టర్లు చెప్పారు` అంటూ తన మద్యపాన రహస్యాన్ని సైతం ఆయనే బయటపెట్టారు. ఆహారం కూడా మితంగానే తీసుకొనేవారు. `ఇంకొంచెం తింటే బాగుంటుంది.. అనుకొన్నప్పుడే తినడం ఆపేయాలి` అనే మాట అక్కినేని తరచూ చెబుతుంటారు. అదే ఆయన ఆరోగ్య రహస్యం కూడా!
చిత్రసీమలో పుకార్లకు కొదవ ఉండదు. ఆ హీరో… ఆ హీరోయిన్‌తో చాలా చనువుగా ఉంటున్నాడట.. అంటూ రోజుకో వార్త వింటుంటాం. కానీ అక్కినేని పేరు ఎప్పుడూ ఎక్కడా ఇలాంటి వార్తల్లో వినిపించలేదు. కనిపించలేదు. దానికి కారణం.. అక్కినేని వ్యక్తిగత క్రమశిక్షణే. సెట్ నుంచి బయటకు వస్తే, ఆయన సినిమాల గురించి ఆలోచించరు. తన కుటుంబానికి తగిన సమయం కేటాయించేవారు. తనది కాని, తనకు సంబంధం లేని, తనకు తెలియని విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు సోదరభావంతో అక్కినేనికి ఆహ్వానించారు. అయితే.. అక్కినేని సున్నితంగా తిరస్కరించారు. `రాజకీయాలు నా ఒంటికి పడవు బ్రదర్` అంటూ తప్పుకొన్నారు. అందుకే మిగిలిన సమయం అంతా కుటుంబానికి కేటాయించగలిగారు. అక్కినేని అనే మహావృక్షం ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే కారణం.. అక్కినేని నమ్మిన సిద్ధాంతాలు, పాటించిన క్రమశిక్షణ మాత్రమే! ఈ విషయంలో ఆయన గుణవంతుడు.. బుద్దిమంతుడు.
నటుడిగా ఆయన ఎక్కని శిఖరం లేదు. అయితే క్రమశిక్షణ కలిగిన మనిషిగానూ అక్కినేని రాబోయే తరాలకూ ఆదర్శం!
ఏఎన్నార్ లివ్స్ ఆన్!!
(అక్కినేని శతజయంతి సందర్భంగా)