”ఆడా మగా ఇద్దరూ సమానమే. కానీ మగ కొంచెం ఎక్కువ సమానం”
– ఇదీ.. ముళ్లపూడి వారి సెటైర్.
సమాజంలో పరిస్థితి ఇలానే ఉంది. ఆడ, మగ ఇద్దరూ సమానమే అని గట్టిగా చెబుతున్నా, త్రాసు తూగేది మగవాడి వైపే.
సినిమాల్లోనూ అంతే! హీరో, హీరోయిన్లలో హీరోవైపే బరువు ఎక్కువ మొగ్గుతుంది. అది సహజం. హీరో తరవాతే హీరోయిన్. అది సినిమా ధర్మం. సినిమాల్లో ఎక్కువ తక్కువలెవరివి అనేది పక్కన పెడితే ఆడవాళ్లని చూపిస్తున్న విధానమే కాస్త ఇబ్బందికి గురి చేస్తోంది.
స్త్రీ పాత్రని తక్కువ చేయడం, వాళ్లను కేవలం అందాల ప్రదర్శనకే వాడుకోవడం, వాళ్లతో బూతులు మాట్లాడించడం, వాళ్లని బూతులు తిట్టడం, పెళ్లాం ఓ రాక్షసి అని, ప్రియురాలు ఓ కఠిన హృదయురాలని చెప్పడానికి ఎన్నో పాటలు.. మరెన్నో సందర్భాలు, ఎన్నెన్నో సన్నివేశాలు. ”నమ్మకు నమ్మకు ఆడాళ్లలోని ప్రేమలను.. నమ్మినవాళ్లకు చూపిస్తుంది నరకాన్ని” అంటూ ఏకంగా ఓ పాట పాడుకున్నారు. ”ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం” అంటూ నిందలు వేశారు. ఆడవాళ్లపై వేసినన్ని సెటైర్లు, భార్యలపై వేసినన్ని జోకులు మరెవ్వరిపైనా వేయరేమో. ‘అమ్మ’ పాత్ర తప్ప… అన్ని పాత్రల్నీ బీ గ్రేడ్ చేసే చూపించారు. ఇక సీరియళ్లు అంటారా… అందులో ఆడాళ్లంతా విలన్లే. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
కథానాయికల విషయానికొద్దాం. వాళ్లలో తొంభైశాతం ”మాకు ఈ రోల్స్ దొరకడమే ఎక్కువ” అన్నట్టు సంతృప్తి పడిపోతారు. ఏ నిత్యమీనన్ లాంటివాళ్లో ”నాకు నా పాత్ర నచ్చాలి” అని కండీషన్లు పెడతారు. అలాంటివాళ్లని సహజంగానే దూరంగా పెడుతుంటుంది పరిశ్రమ. అందుకే… అన్నింటినీ ఓర్చుకుంటూ, తట్టుకుంటూ, దిగమింగుకుంటూ ప్రయాణం చేస్తుంటారు. కథానాయికల మాట పక్కన పెడితే.. మిగిలిన రంగాల్లో ఆడవాళ్ల సంఖ్య చాలా తక్కువ. హీరోయిన్‌కి పాట పాడడానికి ఫిమేల్ సింగర్స్ కావాల్సివుంటుంది. అది మినహాయిస్తే… 24 విభాగాల్లో ఆడవాళ్ల ప్రాధాన్యం ఎక్కడుంది? మహిళా దర్శకులు చాలా తక్కువ మంది. ఉన్నా… వాళ్లకు విజయాల్లేవు. విరివిగా సినిమాలూ చేయరు. ఎం.ఎం.శ్రీలేఖ మినహాయిస్తే మహిళా స్వరకర్తలు ఎవరున్నారు? ఆవిడకీ ఇప్పుడు సినిమాల్లేవు. సాహిత్య కారుల్లోనూ వాళ్ల సంఖ్య వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. మాటలు రాసేవాళ్లు కరువయ్యారు. మేకప్, కాస్ట్యూమ్స్… ఈ రంగాల్లోనూ మగవాళ్లదే ఆధిపత్యం.
”సినిమా అనేది ఓ రొంపి. అందులో అమ్మాయిలు ఇమడలేరు” అనే మాట బలంగా నాటుకుపోయింది. సమాజం ఇంత మారుతున్నా, అమ్మాయిల్ని ఈ రంగంలోకి పంపడానికి తల్లితండ్రులు భయపడుతుంటారు. దానికి తగ్గట్టే చిత్రసీమా తయారవుతోంది. ముందు వాళ్ల వాళ్ల కథల్లో, జీవితాల్లో అమ్మాయిలకు విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే.. అమ్మాయిలకు కాస్త ధైర్యం కలుగుతుంది. ధీమాగా ఇటువైపు అడుగులు వేయగలిగే సాహసం చేస్తారు. అలాంటి రోజులు రావాలి. ఈరోజు మహిళా దినోత్సవం. ఈ రోజునుంచైనా అలాంటి మార్పుకు శ్రీకారం చుడితే బాగుంటుందేమో!