” ఒక రాజకీయ నేతకు చెందిన పత్రికలో ఓ జర్నలిస్ట్ పని చేశారు. ఆయన నిబద్ధత, విశ్లేషణా సామర్థ్యం బాగా నచ్చింది. అందుకే.. తాను అధికారంలోకి రాగానే… ఆ జర్నలిస్టును తనతో పాటు ప్రభుత్వ పదవిలోకి తీసుకుని సేవల్ని వినియోగించుకోవాలనుకున్నారు ఆ సీఎం. కానీ ఆ జర్నలిస్ట్… ప్రభుత్వంలోకి మారితే.. తాను జర్నలిస్టుగా నిజం రాయలేనని సున్నితంగా తిరస్కరించి.. జర్నలిస్టుగానే కొనసాగారు…” ఈ రోజుల్లో ఇలాంటి నిబద్ధత.. దుర్భిణి పెట్టి వెదికినా కనిపించదు. తాము చెప్పేదే నిజమే జర్నలిజం విలువలు పడిపోయిన సమయంలో… అలాంటి జర్నలిస్టుల్ని వైతాళికులుగా గుర్తించాల్సిందే. అలాంటి వైతాళికుడు తుర్లపాటి కుటుంబరావు. 87 ఏళ్ల వయసులో ఆయన.. విజయవాడలో తుదిశ్వాస విడిచారు.
పధ్నాలుగేళ్ల వయసులోనే జర్నలిజంలోకి వచ్చిన తుర్లపాటి.. సుదీర్ఘంగా పని చేశారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు దగ్గర్నుంచి చంద్రబాబు వరకు పద్దెనిమిది మంది ముఖ్యమంత్రుల హయాంలో జర్నలిస్టుగా పని చేశారు. 70 ఏళ్ల పాటు జర్నలిస్టుగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభ అధ్యక్షుడిగా, అనువాద ప్రసంగికునిగా వ్యవహరించారు. పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులతో పని చేసిన అనుభవాలను పుస్తకరూపంలో కూడా ప్రచురించారు. ” 18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు” అనే పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2002లో పద్మశ్రీ అవార్డు పొందిన తొలి తెలుగు జర్నలిస్టు కూడా తుర్లపాటి కుటుంబరావే.
అనేక పుస్తకాలను రాశారు. దేశ, విదేశాల్లో దాదాపు 20 వేల సమావేశాల్లో వక్తగా ప్రసంగించారు. ఈ విషయంలో ఆయనకు గిన్నిస్ రికార్డ్ ఉంది. ఆయన ప్రతిభను మెచ్చి.. కేంద్ర, రాష్ట్రాలు అనేక కమిటీలతో పాటు పదవుల్లోనూ చోటు కల్పించాయి. తుర్లపాటి జర్నలిస్టుగా వెలిగిపోతున్నసమయంలో వచ్చిన వారు కూడా తర్వాత అనేక రాజకీయ పార్టీలకు అసోసియేట్ అయిపోయాయి.. జర్నలిజం లెక్కల్ని మార్చేశారు. కానీ తుర్లపాటి మాత్రం.. జర్నలిజం అంటే ఎలా ఉండాలో.. అలానే ఉన్నారు. అందుకే.. జర్నలిజం వైతాళికుడు అయ్యారు.