నందమూరి బాలకృష్ణకు మర్చిపోలేని హిట్స్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. సింహా, లెజెండ్, అఖండ.. ఒకదాన్ని మించి మరోటి విజయాన్ని అందుకొన్నాయి. దాంతో బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే… అంచనాలు ఆకాశానికి చేరుతున్నాయి. ఈ మూడు సినిమాలతో వీరిద్దరి అనుబంధం మరింత బలపడింది. బాలయ్య కోసం బోయపాటి, బోయపాటి కోసం బాలయ్య.. ఏమైనా చేస్తారని అభిమానులూ నమ్ముతున్నారు. ఈ కాంబోని మరోసారి తెరపై చూసే అవకాశం దక్కబోతోంది.
రామ్ – బోయపాటి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. బోయపాటి శైలిలోనే మాస్, యాక్షన్ అంశాలతో సాగే సినిమా ఇది. రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. ఈ సినిమాలో ఓ స్పెషలాఫ్ అట్రాక్షన్ కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమాలో బాలయ్య అతిథి పాత్రలో కనిపించబోతున్నార్ట. ఇందుకు సంబంధించి బాలయ్యతో బోయపాటి సంప్రదింపులు కూడా జరిపాడని, బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఓ కీలకమైన ఘట్టంలో… బాలయ్య ఎంట్రీ ఉంటుందని – ఈ సీన్ సినిమా మొత్తానికే హైలెట్ కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.