ఏపీ కార్పొరేషన్ల అప్పుల లెక్క తేలుస్తామంటూ కేంద్రం నుంచి ఓ బృందం ఏపీకి వచ్చింది. ప్రత్యేకంగా ఆడిట్ చేస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులన్నీ క్లియర్గా ఉన్నాయి. దాచి పెట్టడానికి కూడా సాధ్యం కాదు. కానీ ఆ అప్పులన్నీ.. నాన్ గ్యారంటీ అప్పులని.. ఆ కార్పొరేషన్లకు ఆస్తులున్నాయని.. ఇలా రకరకాలుగా ప్రభుత్వం వాదిస్తోంది. ఇలాంటి వాదనను మొదట్లోనే తుంచేయాల్సిన కేంద్రం… వాటి పేరుతో కాలయాపన చేస్తూండటంతోనే అసలు వారి తీరుపై అనుమానాలు వ్యక్తం కావడానికి కారణం అవుతోంది.
ఏపీ ఆదాయానికి.. ఖర్చుకు పొంతన ఉండటం లేదు. ఆరు నెలల్లో వచ్చిన ఆదాయం కన్నా చేసిన ఖర్చు రూ. 70వేల కోట్లు ఎక్కువ. అంటే పెద్ద మొత్తంలో అప్పులు.. బిల్లుల బకాయిలు తయారయ్యాయన్నమాట. అంటే ఏడాదిలో ఎంత ఉండాలి ? ఇంత పెద్ద మొత్తంలో లోటు ఏర్పడటానికి కారణం. వస్తున్న ఆదాయం అతా అప్పులకు..వడ్డీలకు చెల్లించడం.. రోజు గడవడానికి మళ్లీ అప్పులు చేయడం. ఇటీవలి కాలంలో అప్పులకు.. వడ్డీలకు కూడా అప్పులు చేసేంతగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది.
నిజానికి ఈ లెక్కలు తెలుసుకోవాలంటే కేంద్రానికి చిటికెలో పని. బ్యాంకులకు ఒక్క ఆర్డర్ వేస్తే మొత్తం చిట్టా తెచ్చి ఇస్తారు. అక్కడి వరకూ వద్దంటే.. నిబంధనల ప్రకారం ఆడిట్ చేస్తే చాలు. ఏపీ ప్రభుత్వ అధికారులు చెప్పే కుబుర్లన్నీ వినకుండా రూల్స్ ప్రకారం వెళ్లిపోతే మొత్తం బయటపడిపోతుంది. ఇందు కోసం నెలల తరబడి ఆడిట్ లు.. లేఖలు రాయాల్సిన పని లేదు. కానీ కేంద్రం.. ఏపీ సర్కార్ నిర్వాకం బయటపడకుండా ఉండటం.. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఎప్పటికప్పుడు అప్పులివ్వడానికే ఇలాంటి డ్రామాలాడుతోందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.