జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన నియోజకవర్గాన్ని సుందరంగా మార్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా కేబినెట్ సమావేశంలో పిఠాపురం డెలవప్మెంట్ అధారిటీకి ఆమోదముద్ర వేయించుకున్నారు. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పులివెందుల డెలవప్మెంట్ అధారిటీ అని వేయించుకుని ఇష్టం వచ్చినట్లుగా వందల కోట్లు కేటాయించుకున్నారు. పనులు చేయించుకున్నారు. అయితే ఆ అభివృద్ధి ఉపయోగపడేలా లేదు. కేబుల్ బ్రిడ్జిని తాళ్లతో నిర్మించిన అభివృద్ధి అది.
కానీ పవన్ కల్యాణ్ పిఠాపురంను మాత్రం ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అధికారుల బృందాలను పిఠాపురం పంపారు. సమగ్ర సర్వే జరిపారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు. ఎలాంటి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు… ప్రజా సమస్యలు ఏమిటి ఉన్నవన్నీ గుర్తించారు. మండలాల వారీగా ఈ సమస్యలను లిస్టవుట్ చేశారు. వీటిని పరిష్కరించడంతో పాటు కొత్త ప్రాజెక్టుల్ని చేపట్టనున్నారు. ఇందు కోసం ప్రత్యేక బడ్జెట్ ను కూడా కేటాయించే అవకాశం ఉంది.
పిఠాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గాల్లో ఒకటిగా మార్చాలని పవన్ కల్యాణ్ పట్టుదలగా ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా తీరిక లేకుండా బాధ్యతలు నిర్వహిస్తున్నా పిఠాపురం విషయంలో మాత్రం తన టీమ్‌ను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచుతున్నారు. కుదిరితే నెలకోసారి అయినా పర్యటించాలని అనుకుంటున్నారు.