కార్తికేయ 2 తో పాన్ ఇండియా విజయం అందుకున్నాడు నిఖిల్. సైన్స్‌కి.. ఇతిహాసాన్ని జత చేసిన విధానం ప్రేక్షకులకు తెగ నచ్చింది. అందుకే రూ.25కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాకి.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.120కోట్ల పైచిలుకు వసూళ్లు దక్కాయి. ఇప్పుడు మళ్ళీ ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ ’18 పేజేస్’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నిఖిల్. సుకుమార్ కథ అందించిన ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి . డిసెంబర్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా నిఖిల్ తో తెలుగు 360 చేసిన స్పెషల్ చిట్ చాట్ ఇది.
* 2022 ఎలా గడిచింది?
– ఈ యేడాది చాలా బావుంది. ఏడాది చివర క్రిస్మస్ కి మా సినిమా వస్తోంది. ఈ సినిమా కూడా హిట్టయితే ఇదే క్రిస్మస్ గిఫ్ట్ అనుకొంటా. ఈ క్రిస్మస్ నాకు కలిసొస్తుందని గట్టి నమ్మకం.
* ఈ యేడాది పాన్ ఇండియా హీరో అయిపోయారు కదా..?
– పాన్ ఇండియా హీరో అనేది మనసుకి, మెదడుకి ఎక్కించుకోవడానికి కొంత టైం పడుతుంది. వరుసగా అలాంటి మూడు, నాలుగు సినిమాలు చేస్తే ఆ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు నా దగ్గరకు పాన్ ఇండియా కథలు వస్తున్నాయి. లక్కీగా కార్తికేయ 2 రూ.120కోట్ల బిజినెస్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఇంతకు ముందు నేను ఎవరో బాలీవుడ్ లో తెలీదు. అందరికీ కనెక్ట్ అయ్యే కథతో వెళితే బాక్సాఫీసు వద్ద మ్యాజిక్ చేయొచ్చని కార్తికేయ 2 నిరూపించింది. ప్రేక్షకులు నా విజయాన్ని వారి విజయంగా ఫీలయ్యారు. అందుకే ఇది సాధ్యమైయింది. కార్తికేయ 2 ఫిగర్స్ చూస్తే అసలు ఆ సినిమా చేసింది నేనేనా అనే అనుమానం కూడా వస్తుంది. అంతా ఒక అద్భుతంలా జరిగింది.
* బడా బ్యానర్లలో సినిమా చేయడంలో సౌలభ్యం తెలిసొచ్చిందా?
– పెద్ద నిర్మాణ సంస్థలతో పని చేయడంలో ఒక లగ్జరీ వుంటుంది. పీపుల్స్ మీడియా, అభిషేక్ ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ ,.. ఈ సంస్థలన్నీ సినిమాకి ఏం కావాలో అది సమకూరుస్తాయి. ఎక్కడా ఎలాంటి చిక్కులు వుండవు. ఎక్కడ ఏ థియేటర్ పడుతుందో? అనే టెన్షన్ ఉండదు. అలాగని కొత్త నిర్మాతలతో చేయనని కాదు. మంచి కథ వుంటే ఎవరితోనైనా చేయడానికి ఇష్టపడతాను. కొత్త నిర్మాతలు ఎంత మంది పరిశ్రమకు వస్తే అంత మంచిది.
* కార్తికేయ ఇమేజ్ 18 పేజెస్కి ఎంత వరకూ హెల్ప్ అవుతుందనుకొంటున్నారు?
– కార్తికేయ కి ముందు చేసిన అర్జున్ సురవరం, స్వామి రారా సినిమాలు కూడా గుడ్ విల్ తీసుకొచ్చాయి. ఆ సినిమాల ఇమేజ్ కార్తికేయకు హెల్ప్ అయ్యింది. ఇప్పుడు కార్తికేయ ఇమేజ్ 18 పేజేస్ కి ఉపయోగపడుతుందని నమ్ముతున్నా. 18 పేజేస్ రెగ్యులర్ సినిమా కాదు. ఇది ఖచ్చితంగా మంచి పేరు తీసుకొస్తుందని భావిస్తున్నా. ఈ సినిమాకి అనుపమ సరైన ఎంపిక.
* యంగ్ హీరోల్లో అన్ని రకాల జోనర్లూ టచ్ చేసిన హీరో మీరే. కథల ఎంపికలో ఎలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు?
– ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, సూర్య వెస్ సూర్య .. దేనికవే ప్రత్యేకమైన సినిమాలు. ఒక సినిమా హిట్ అయితే మళ్ళీ అదే మూసలో కథలు వస్తాయి. కార్తికేయ తర్వాత ఇతిహాసాల నేపధ్యంలో చాలా కథలు వచ్చాయి. నేను చాలా వాటికి వద్దని చెప్పా. త్వరలో నా నుండి ఒక స్పై థ్రిల్లర్ రాబోతుంది. సుకుమార్ మార్క్ లవ్ స్టొరీ చేయాలని ఎప్పటి నుండో వుండేది. 18 పేజేస్ తో ఆయన వచ్చే నాకు ఆఫర్ చేయడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది.
* స్వామి రారా, సూర్య వెర్సస్ సూర్య.. ఇవన్నీ ఇప్పుడు రావాల్సిన సినిమాలంటారా?
– సినిమా సినిమాకి అడాప్ట్ అవుతూ వుండాలి. ఇప్పుడు స్వామి రారా చేస్తే ఆడకపోవచ్చు. కథ స్టయిల్ యేడాదికి ఒకలా మారిపోతుంటుంది. ఈ విషయంలో రాజమౌళి గారు నాకు స్ఫూర్తి. ఆయన ప్రతి సినిమాకి అడాప్ట్ అవుతూ.. కథ చెప్పే విధానం, టెక్నాలజీ అన్నీ మార్చేస్తుంటారు.
* ఈవారం చాలా సినిమాలొస్తున్నాయి. రిలీజ్ డేట్ విషయంలో మీరు సంతృప్తిగానే ఉన్నారా?
– డిసెంబర్ 23 బెస్ట్ డేట్. గీత ఆర్ట్స్ అన్నీ చూసుకునే డేట్ ఫిక్స్ చేసింది. క్రిస్మస్ కలిసొస్తుంది. రవితేజ గారి ధమాకాతో పాటు మా సినిమాని కూడా ప్రేక్షకులు చూస్తారు. రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ గా ఏదైనా చూడాలని అనుకుంటే 18 పేజేస్ బెస్ట్ ఆప్షన్.
* ఈ సినిమాకి సుకుమార్ కథ ఇచ్చారు కదా? ఆయనే దర్శకుడైతే బాగుండేది అనిపించిందా?
– సూర్యప్రతాప్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా ఆయన చేసినందుకు చాలా హ్యాపీగా వుంది. సుకుమార్ గారిని బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి సూర్యప్రతాప్. సెట్ లో సుకుమార్ గారు వున్నట్లుగానే వుంటుంది. ప్రస్తుతం ప్రేక్షకులు 18 పేజేస్ లాంటి డిఫరెంట్ సినిమాలని చూడటానికి ఆసక్తిగా వున్నారని భావిస్తాను. నిజానికి సూర్య ప్రతాప్ తో చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నాను. నేను కూడా ఆయనకు నాలుగైదు కథలు పంపా. లక్కీగా సుకుమార్ కథతో మా కాంబో కుదిరింది.
* భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేయాలనుకొంటున్నారు?
– చేయడానికి చాలా కథలు వున్నాయి. ఒక రోబాటిక్ మూవీ చేయాలి. అలాగే ఒక పిరియాడిక్ ఫిల్మ్, పర్యావరణం పై ఒక సినిమా చేసే ఆలోచన కూడా వుంది. కొత్త దర్శకులు చాలా మంచి కథలతో వస్తున్నారు. ప్రస్తుతం మంచి దశలో వున్నాను. ప్రేక్షకులని ఎక్సయిట్ చేసే సినిమాలు చేయాలన్నదే నా ప్రయత్నం.
* అనుపమ పరమేశ్వరన్ ప్రమోషన్లకు రాదని అప్పట్లో అలిగారు.. నిజంగానే ఆమె ప్రమోషన్లకు డుమ్మా కొడుతుందా?
– అయ్యో.. అదేం లేదండీ. కార్తికేయ ప్రమోషన్లకు రమ్మని ఫోన్ చేస్తే.. తనున్న బిజీ వల్ల రెస్పాండ్ అవ్వలేదు. అందుకే అప్పట్లో అలా అన్నా. కానీ కార్తికేయ 2 ప్రమోషన్లకు తను చాలా హెల్ప్ అయ్యింది. ఇప్పుడు 18 పేజెస్ ప్రమోషన్లలోనూ తను పాల్గొంటోంది. హీరోయిను కెమెరా ముందుకు రావాలంటే చాలా సరంజామా కావాలండీ. హీరోలైతే షర్టు మార్చుకొని వచ్చేయొచ్చు. కానీ హీరోయిన్లు అలా కాదు. పైగా అనుపమ బిగ్ స్టార్. తను చాలా బిజీగా ఉంటుంది. మరో సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ప్రమోషన్లకు రమ్మని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు.