బ్యాంకులకి రూ.9,000 కోట్లు ఎగవేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా ఒక ఆర్ధిక నేరస్తుడని దేశ ప్రజలు అందరూ భావిస్తున్నారు. ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈడి నోటీసులు అందుకొన్నప్పటికీ ఆయన భారత్ వచ్చేందుకు నిరాకరిస్తున్నందున అతను ఉద్దేశ్యపూర్వకంగానే, బ్యాంకులను మోసం చేసినట్లు భావిస్తున్నామని కనుక క్రిమినల్ ప్రొసీజర్ ప్రొఫెసర్ కోడ్ లోని సెక్షన్ 82 ప్రకారం విజయ్ మాల్యా నేరస్తుడేనని ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు ఆధారంగా విజయ్ మాల్యాని అరెస్ట్ చేసేందుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయవలసిందిగా ఇంటర్ పోల్ ని మళ్ళీ కోరవచ్చు. అలాగే భారత్ లోని విజయ్ మాల్యా ఆస్తులను ఈడి స్వాధీనం చేసుకొనేందుకు వీలవుతుంది.
భారత్ లోని ఈడి, న్యాయ తదితర వ్యవస్థలు విజయ్ మాల్యాని దోషిగా నిర్దారిస్తునప్పటికీ, ఆయన లండన్ పారిపోయి వాటి నియంత్రణ పరిధి నుంచి తప్పించుకోగలుగుతున్నారు. దేశంలోని సర్వోన్నత న్యాయవ్యవస్థ సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించే సాహసం చేస్తున్నారు. బ్రిటన్ చట్టాల ప్రకారం ఆయనని అరెస్ట్ చేసి భారత్ త్రిప్పి పంపడం సాధ్యం కాదని బ్రిటన్ ప్రభుత్వం ఇదివరకే తేల్చి చెప్పింది. అలాగే అయన అరెస్ట్ కోసం రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం సాధ్యం కాదని కూడా తేల్చి చెప్పింది. కనుక ముంబై ప్రత్యేక న్యాయస్థానం ఆయనని నేరస్తుడిగా ప్రకటించినప్పటికీ బ్రిటన్ ప్రభుత్వం అంగీకరిస్తే తప్ప ఆయనని అరెస్ట్ చేసి భారత్ రప్పించడం సాధ్యం కాకపోవచ్చు.