కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ వీడియోలతో విష ప్రచారం చేశారని తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ఇలాంటి ఫేక్ వీడియోలకు చెక్ పెట్టకపోతే సమాజానికి తీవ్ర హాని జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత రెడ్డి భావిస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఏఐ ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేసే వారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. ఇందు కోసం స్పెషల్ సైబర్ క్రైమ్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో అసలు కన్నా.. ఫేక్ వీడియోలే వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఇవి నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యాయి. హైదరాబాద్ గచ్చిబౌలి చుట్టుపక్కల ఉండేవారికి నిజం తెలుసు కానీ.. మిగిలిన వారికి తెలియదు. ఆ వీడియోలను నిజం అని అనేక మంది నమ్మారు. చివరికి బాలీవుడ్ నటులు కూడా ఈ ఫేక్ వీడియోలు, ఏఐ ఫోటోలను పోస్టు చేసి.. పర్యావరణ విధ్వంసం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అందుకే ఏఐ ఫేక్ వీడియోల విషయంలో ఏ మాత్రం సహించకూడదని భావిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వీడియోలు తయారు చేసిన వారిని .. గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పలు కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.