కడప వైసీపీ నేతల అక్రమాలపై పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. సంక్రాంతి పండుగ తర్వాత కడప, అన్నమయ్య జిల్లాలలో అటవీ భూములు ఎంత వరకూ కబ్జా అయ్యాయన్నదానిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. కర్నూలు జిల్లాలో గ్రీన్ కో నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును పరిశీలించిన తరవాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అటవీ మంత్రిగా.. కడపలో వైసీపీ నేతలు కబ్జా చేసిన రిజర్వ్ ఫారెస్ట్ అంశంపై స్పందించారు.
కడపలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం పెద్ద ఎత్తున రిజర్వ్ ఫారెస్ట్ ను ఆక్రమిచిందన్న ఆరోపణలు వస్తున్నాయి. వాటిపై నివేదిక అడిగారు . అయితే సజ్జల కుటుంబీకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తమ భూముల జోలికి రాకుండా చూడాలని కోరారు. అవి రెవిన్యూ భూములని తాము రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేశామని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే వైసీపీ నేతల చేతిలో అధికారం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా రికార్డులు ట్యాంపరింగ్ చేశారు. అటవీ భూముల్ని కబ్జా చేశారు.
ఒక్క సజ్జల మాత్రమే కాదు ఇలా భూముల్ని కొట్టేసిన వారు లెక్కలేనంత మంది ఉన్నారు. వారందరి లెక్కలు పవన్ కల్యాణ్ పండగ తర్వాత తేల్చే అవకాశం ఉంది. స్వయంగా పర్యటించి సమీక్ష చేసి.. కబ్జా అయిన అటవీ భూముల్ని ఆయన పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కడప వైసీపీ నేతలకు గడ్డు పరిస్థితే అనుకోవచ్చు.