రాయలసీమ మాండలికంలో విలనిజం… కామెడీ కూడా చేయగలిగిన నటుడు జయప్రకాష్ రెడ్డి … హఠాన్మరణం చెందారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని శిరివెళ్లకు చెందిన ఆయనకు మొదటి నుంచి నాటకాలపై ఎంతో ఇష్టం. బాగా చదువుకుని టీచర్ అయిన.. గుంటూరులో పని చేసినప్పటికీ.. ఆయన నాటకాలు.. నటపై మాత్రం ఎప్పుడూ ఆసక్తి తగ్గించుకోలేదు. సురేష్ ప్రొడక్షన్స్‌లో ఆయన క్రూర పోలీసు పాత్రల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బ్రహ్మపుత్రుడు దగ్గర్నుంచి ప్రేమఖైదీ వరకు చాలా సినిమాల్లో నటించారు. కానీ గుర్తింపు వచ్చేంత పెద్ద పాత్రలు కావు అవి. దాంతో ఆయన .. ప్రభుత్వ ఉద్యోగిగా.. గుంటూరులో స్థిరపడే ప్రయత్నం చేశారు. కానీ అనూహ్యంగా మళ్లీ… రామానాయుడే పిలిచి గుర్తింపు వచ్చే పాత్ర ఇచ్చారు.
సినిమా వేషాలు తగ్గి టీచర్‌గా పని చేసుకుంటున్న సమయంలో.. ఓ సారి మిత్రుడ్ని పరామర్శించడానికి హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ సినిమాల్లో చేసి ఉండటం వల్ల రామానాయుడు బాగా పరిచయం. ఆ ఆస్పత్రికి ఏదో పని మీద వచ్చిన రామానాయుడు జయప్రకాష్‌ను గుర్తు పట్టి పిలిచి… ప్రేమించుకుందాం రాలో.. విలన్ పాత్రకు ఎంపిక చేశారు. అప్పట్నుంచి జేపీ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఉద్యోగం చేయలేనంత బిజీ అవడంతో… న్యాయం చేయలేనని చెప్పి రాజీనామా చేశారు. ఆ తర్వాత తన జీవితం మొత్తం నటనకే అంకితం చేశారు. ఎక్కడా సినీ ఇండస్ట్రీ కానీ.. బయట కానీ రాజకీయాల జోలికి వెళ్లలేదు. దర్శకులందరితో మంచిగా ఉండి.. వారికి కావాల్సిన అవుట్‌పుట్ ఇచ్చేందుకు కష్టించేవారు.
ఇటీవలి కాలంలో సినిమాల్లో వేషాలు తగ్గినా ఆయన నిరాశపడలేదు. ఊహించిన దాని కంటే.. ఎక్కువే కళా రంగం ఇచ్చిందని భావించి.. సొంత ఖర్చుతో నాటకాలు వేయడం ప్రారంభించారు. అలెగ్జాండర్ అనే నాటకాన్ని ఆయన ఊరూరా ప్రదర్శించారు. నాటకాలకు ఆదరణ తగ్గిపోవడం ఆయనను బాధించేది. మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఆయన అంటూ ఉండేవారు. ఆ పూర్వ వైభవాన్నిచూడకుడానే ఆయన కన్నుమూశారు. జయప్రకాష్ రెడ్డి చాలా ప్రాక్టికల్ భావాలున్న మనిషి. కళారంగానికి డబ్బు కోసం ఎవరూ రాకూడని ఆయన అనుకుంటారు. అందుకే.. తన వారసుల్ని ఆయన సినిమా ఇండస్ట్రీ వైపు రానీయలేదు. వారికి ఆసక్తి ఉన్నరంగాల్లోనే ప్రోత్సహించారు.
టీచర్‌గా ఉన్న ఆయన విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. ప్రభుత్వ టీచర్నే కదా అని విద్యార్థులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేసేవారు కాదు. ఆయన మాటలు కఠినంగానే ఉంటాయి. తొడపాశాలు పెట్టొచ్చు .. కానీ అలా చేయడం వల్ల బాగుపడిన విద్యార్థులు ఉన్నారు కానీ భయపడిన వారులేరు. అందుకే.. ఆయన అటు విద్యారంగంలో అయినా.. ఇటు నటనా రంగంలో అయినా… తనకంట ఓ పేజీని సృష్టించుకున్న మచ్చలేని వ్యక్తి.