సారూ.. స్టారూ.. మాస్టారూ
– ఇలా పిలిపించుకోవడానికి ఇండ్రస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఉంటారు.
మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్.. ఇలా రోజుకొకరు పుట్టుకొస్తారు.
కానీ `గురువుగారూ.` అని నోరారా పిలుచుకునే అవకాశం, అధికారం, అభిమానం ఎవరికీ దక్కదు.
ఒక్క దాసరి నారాయణరావుకి తప్ప.
చిత్రసీమ ఎంతోమంది దర్శకుల్ని చూసింది. చూస్తూనే వుంది. కానీ వాళ్లెవరూ దాసరిలా గురువు కాలేకపోయారు.
ఏంటట దాసరిలో ఉన్న ప్రత్యేకత?
హీరోల డామినేషన్లో దర్శకుడి స్టామినా చూపించిన దర్శకుడు దాసరి.
పోస్టరుపై హీరోల బొమ్మలతో పాటు.. దర్శకుడి బొమ్మ కూడా వేసిచూపించిన ధీశాలి దాసరి.
హీరో ఎవరైతే ఏంటి? ఇది దాసరి సినిమా అంటూ జనాలు పోటెత్తేలా చేసుకున్న నేర్పరి దాసరి.
ఇంకేం కావాలి?
కానీ ఇంకా చాలా ఉన్నాయ్.
తాను ఒక్కడే ఉండిపోలేదు. ఓ శిష్యగణం సంపాదించుకున్నాడు. దర్శకుల ఫ్యాక్టరీలా మారాడు. దాసరి ఓ సినిమా చేస్తున్నాడంటే..ఆ సినిమా నుంచి కనీసం ఒక్క దర్శకుడైనా తయారయ్యేవాడు. దాసరి ఇచ్చినంత మంది దర్శకుల్ని.. ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇవ్వబోడు. అదీ.. దాసరి ప్రత్యేకత.
శిష్యుల్ని తయారు చేసి అలా గాలికి వదిలేయలేదు. తాను వెనకుండి నడిపించాడు. తన శిష్యుల కోసం తాను సినిమాలు తీశాడు. చాలాసార్లు చేతులు కాల్చుకున్నాడు. బ్యాంకు బాలెన్సులు తగ్గించుకున్నాడు. కానీ మనసులో వాళ్లపై ఉన్న ప్రేమమాత్రం తగ్గలేదు. అందుకే.. `గురువు` స్థానం సంపాదించుకోగలిగాడు.
దాసరి దగ్గర పనిచేసిన వాళ్లు మాత్రమే శిష్యులు కాదు.
ఆయన సినిమాలు చూసి కూడా శిష్యులు తయారయ్యారు.
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలు, దర్శకత్వం – ఇలా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు దాసరి. యేడాదికి ఓ సినిమా తీయడానికే ఇప్పటి దర్శకులు ఆపపోపాలు పడిపోతున్నారు. అలాంటిది.. ఒకేరోజు… నాలుగు ఫ్లోర్లలో.. నాలుగు షూటింగులు చేసి – ఎవ్వరికీ దక్కని రికార్డు దాసరి సొంతం చేసుకున్నారు. సెట్లో కూర్చుని వేడి వేడిగా డైలాగులు రాసి, స్టార్లతో చెప్పించారు. కార్ వాన్ లో కూర్చుని ఓ సినిమా తాలుకూ స్క్రీన్ ప్లే రాసిన స్పీడు.. దాసరి. ఇంకేం చెప్పాలి? ఇంకెన్ని చెప్పాలి?
పరిశ్రమకు కష్టం వస్తే… ముందు గుర్తొచ్చే పేరు దాసరి నే.
దర్శకులందరికీ గురువైనా.. నిర్మాతల పక్షపాతిగా దాసరి పేరు తెచ్చుకున్నారు. ఎన్నోసార్లు కార్మికులకు అండగా నిలిచారు. చినికి చినికి గాలివానగా మారే సమస్యల్ని.. అంత దూరం వెళ్లకుండా కాపు కాశారు. దిన పత్రిక నడిపారు. వార పత్రిక రుచేంటో చూపించారు. అన్నిటా.. అన్ని చోట్లా… సాహసోపేతమైన నిర్ణయాలే. అందుకే… దర్శకుల్లో దాసరి వేరయ్యారు.
ఇప్పుడు దాసరి మన మధ్య లేరు.
ఆయన గురు స్థానం అలానే ఖాళీగా ఉంది.
చిత్రసీమకు పెద్ద దిక్కుగా నిలవడానికి ఒకరిద్దరు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వాళ్లు పెద్ద దిక్కుగా నిలవొచ్చు కూడా.
కానీ… గురువు అనే కుర్చీ మాత్రం ఖాళీగా ఉంటుంది.
దాన్ని ఎప్పటికీ.. ఎవరూ భర్తీ చేయలేరు.
ఎందుకంటే అది దాసరిది.
(ఈరోజు దాసరి జయంతి సందర్భంగా)