ఉల్లి ధర మండిపోతుండటంతో ఫేకింగ్ న్యూస్ ఛానెల్ టీవి 999లో స్పెషల్ ఆనియన్ బులెటిన్ వస్తోంది…
యాంకర్ : స్పెషల్ ఆనియన్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు…
1. ఉల్లి కోసం బ్యాంక్ లోన్స్.. క్యూకడుతున్న జనం,
2. శివార్లలో వెలిసిన ఉల్లితల్లి ఆలయం,.. మహిళకు పూనకం
3. ఉల్లిబ్యాగ్ ల స్నాచింగ్..ఉల్లిని లాకర్లలోనే దాచుకోవాలంటున్న పోలీసులు
4. ఉల్లి ట్రక్కుల హైజాక్..ఉగ్రవాదుల హస్తం ఉందంటున్న అధికారులు…
ఇప్పుడు డిటైల్స్ లోకి వెళ్దాం…
ఉల్లి లోన్స్
ఆనియన్స్ ధరలు పెరిగిపోతుండటంతో సామాన్యులు, మధ్యతరగతివాళ్లు ఉల్లి కొనలేక కళ్లుతేలేస్తున్నారు. దీంతో బ్యాంకుసు ఈవేళ హైదరాబాద్ లో రుణమేళా నిర్వహిస్తున్నాయి. ఉల్లిపాయలు కొనుగోలు చేసేవారికి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడంతో బ్యాంకులవద్ద జనం బారులుతీరారు. ప్రైవేట్ రుణాలు ఇచ్చేవారివద్ద హెచ్చువడ్డీకి తీసుకుని అప్పులబాధతో ఆత్మహత్యలు చేసుకోకుండా స్వల్పవడ్డీకే ఉల్లి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో బ్యాంకులు ఈ అప్పులిస్తున్నాయని తెలిసింది.
తాకట్టుకి ఉల్లిపాయలు
తాజాగా మరో పథకం అమల్లోకి వచ్చింది. ఇంట్లో ఉన్న వస్తువులను తాకట్టు పెట్టి ఉల్లిపాయలు తీసుకోవచ్చంటూ రాష్ట్ర ఆనియన్ మర్చెంట్స్ అసోసియేషన్ తెలియజేసింది. ఇందుకు తగ్గట్టుగా ఈమధ్యనే ప్రత్యేక దుకాణాలు తెరిచారు. దీంతో జనం తమవద్ద ఉన్న విలువైన వస్తువులను తాకట్టుపెట్టి ఆనియన్స్ ను కొనుక్కుని వెళుతున్నారు. ఈ విషయంపై మా ప్రతినిధి జంబులింగం ఇలా తెలియజేస్తున్నారు.
రిపోర్టర్ జంబులింగం: `చూడు, నాగ్, నేను ఇక్కడ తార్నాక దగ్గరున్నాను. ఇక్కడో బోర్డ్ కనబడుతుంది, దానిమీద- `తాకట్టుపెట్టండీ, ఉల్లి తీసుకెళ్లండి ‘
అని రాసుంది. దీంతో తెల్లవారుఝామునుంచీ జనం ఇక్కడ బారులుతీరారు. ఉల్లికోసం తాకట్టు పెట్టడానికి అనేక వస్తువులు కూడా తెచ్చారు నాగ్.
యాంకర్ నాగ్ : తాకట్టు దుకాణాలవద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్టు కనబడుతోంది. కారణం ఏమిటి జంబులింగం?
జంబులింగం: ఆ విషయమై నేను దుకాణదారుడ్ని ఇప్పుడే అడిగాను నాగ్. అతను చెప్పేంది ఏమంటే, ఇప్పటి వరకూ ఇంట్లోఉన్న పాత్రలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువచ్చి తాకట్టుపెట్టి ఆనియన్స్ కొనుక్కుని వెళ్ళారు నాగ్. అయితే ఇవ్వాళ్టి నుంచీ బంగారం, వెండి తప్ప మిగతా వస్తువులు తాకట్టు పెట్టుకోమని దుకాణం దారులు మొండికేశారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది నాగ్.
ఉల్లిబ్యాగ్ స్నాచింగ్
టివీ 999కి స్వాగతం. ఇప్పుడో తాజావార్త. విజయవాడలో ఒక మహిళ ఎంతో కష్టపడి పదికిలోల ఉల్లిపాయలు కొనుక్కుని బ్యాగ్ లో వేసుకుని ఇంటికి వెళుతుండగా, మోటారు సైకిళ్లమీద వచ్చిన ఇద్దరు దుండగలు ఆ బ్యాగ్ ని స్నాచ్ చేశారు. ఈ విషయంపై మా ప్రతినిధి ప్రేమ్ ని అడిగి మరింత సమాచారం రాబడదాం. ప్రేమ్ చెప్పండి, ఉల్లి బ్యాగ్ స్నాచింగ్ ఎలా జరిగింది?
రిపోర్టర్ ప్రేమ్: ఇక్కడ గాంధీనగర్ సెంటర్ దగ్గర అంతా గుమిగూడారు నాగ్. చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఉల్లిపాయల సంచీని దుండగలు లాక్కెల్లిపోవడంపట్ల విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంపై వివరాలు చెప్పడానికి ఇన్ స్పెక్టర్ రవి అందుబాటులో ఉన్నారు. చెప్పండి రవిగారు…
ఇన్ స్పెక్టర్ రవి: మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. చెయిన్ స్నాచర్స్ పనేఇదని అనుకుంటున్నాము. నిన్నమొన్నటివరకు చెయిన్ స్నాచింగ్ చేసే ముఠానే ఇప్పుడు ఉల్లిపాయల బ్యాగ్ లను స్నాచ్ చేస్తున్నట్టు ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉల్లిపాయలు తీసుకువెళ్ళే అందరికీ భద్రత కల్పించడం కష్టం. బంగారంకంటే ఉల్లిపాయలు ప్రియంకావడంతో ఎవరికివారు జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వీలుగా ఉంటే ఉల్లిపాయల్ని మీ ఇంట్లో బీరువాల్లోగానీ లేదే బ్యాంక్ లాకర్లలోగాని దాచుకుంటే మంచిది. అలాగే ఉల్లి దుకాణాలదగ్గర ఆనియన్ స్నాచర్స్ ఉంటారు జాగ్రత్త అనిరాసిఉండే బోర్డులు పెడతాము. ఉల్లి స్నాచర్స్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.
ఉల్లితల్లి ఆలయం
నిరంతరాయంగా ఫేక్ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తున్న టివీ999 న్యూస్ ఛానెల్ ఇప్పుడు మరో తాజా వార్త మీకందించబోతున్నది.
హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నట్టుండి ఉల్లిమాత వెలిసింది. దీనిపై మా జంబులింగం రిపోర్ట్…
జంబులింగం ; ఇక్కడో వేపచెట్టుఉంది నాగ్. దీని క్రింద ఉన్నట్టుండి ఉల్లిమాత విగ్రహం బయటపడింది. దీంతో ఈ ఉదయం నుంచి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. త్వరలోనే ఉల్లిమాత ఆలయం కట్టిస్తామనీ, ప్రతిఏటా జాతర్లు జరిపిస్తామని అంటున్నారు నాగ్. ఇదిగో, ఇక్కడ ఓ మహిళ ఉన్నట్టుండి పూనకంతో ఊగిపోతోంది. ఆమె ఎం చెబుతుందో విందాం…
పూనకం వచ్చిన మహిళ: `ఓరేయ్, నేను ఉల్లితల్లినిరోయ్…నన్ను నిర్లక్ష్యంచేశార్రోయ్. అందుకనే నేను అటకెక్కి కూర్చున్నాన్రోయ్…నన్ను దింపాలంటే రోజూ పూజలు చేయండి… నాకు శాంతి కలిగించండి…ఊరూరా నా ఆలయాలు కట్టించాలి. పిల్లపాపల్ని చల్లగా చూస్తాన్రోయ్.. ‘
జంబులింగం : విన్నావుగా నాగ్. ఉల్లితల్లి చెప్పినట్లుగానే ప్రతిఊర్లో ఉల్లితల్లి ఆలయాలు కట్టిస్తామని ఈ ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు నాగ్.
ఉల్లి ట్రక్కుల హైజాక్
ఇప్పుడే అందిన వార్త. ఉల్లి లోడ్ తో మహారాష్ట్ర నుంచి వస్తున్న నాలుగు ఉల్లి లోడ్ ట్రక్కులను దుండగులు హైజాక్ చేసినట్టు తెలుస్తోంది. ఎవరు హైజాక్ చేశారో, వారి డిమాండ్స్ ఏమిటో ఇంకా తెలియాల్సిఉంది. ఉల్లి ట్రక్కుల హైజాక్ లో తీవ్రవాద, ఉగ్రవాదుల హస్తం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటనపై మాకు నాలుగు ముక్కల సమాచారం అందగానే గంటసేపు ప్రత్యేక కార్యక్రమం మీకందిస్తాము. చూస్తూనే ఉండండి ఫేక్ ఛానెల్ 999.
నందన బ్రదర్స్ శారీ హౌస్ ఆఫర్
తాజావార్తలను ఎప్పటికప్పుడు అందించే టీవీ 999 ఇప్పుడు మీకోసం మరో ఫేక్ న్యూస్ అందిస్తోంది. చిక్కడపల్లిలోని నందన బ్రదర్స్ శారీహౌస్ వాళ్లు కొత్త పథకం తీసుకువచ్చారు. పది కిలోల ఉల్లిపాయలను తీసుకువచ్చే కస్టమర్స్ కు ఒక పట్టుచీరకొంటే మరో పట్టుచీర ఉచితంగా ఇస్తున్నారు. దీంతో మహిళలు తమ వంటింట్లో ఉన్న ఉల్లిపాయలేకాకుండా అప్పుడే పులుసులో పడేసినవాటినికూడా బయటకుతీసి సంచీల్లో వేసుకుని పరుగులుపెడుతున్నట్టు వార్తలందుతున్నాయి. అయితే, ఇలాంటి మోసపు ప్రకటనలను నమ్మవద్దని మహిళాచైతన్యవేదిక అధ్యక్షురాలు ఉషారాణి తెలియజేస్తున్నారు.
ఉల్లికొనే స్తోమత ఉంటేనే పెళ్ళి
ఇది ఇలా ఉంటే మ్యారేజ్ బ్యూరోలపై కూడా ఆనియన్ ప్రభావం చాలా స్పష్టంగా పడుతోంది. ఆడపిల్లలకు సంబంధాలు చూసేవారు ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారు. పిల్లవాడు ఆనియన్స్ కొనుక్కునే స్తోమత ఉంటేనే తమ పిల్లను ఇస్తామని బాహాటంగా చెప్పడంతో మ్యారేజ్ బ్యూరోలు నడిపేవారు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని బయోడేటాలను సిద్ధంచేస్తున్నట్టు తెలుస్తోంది.
హెటల్ లో స్పెషల్ ఉల్లి మీల్
కాగా, ఇప్పటికే కొన్ని హోటళ్లలో ఉల్లిలేని భోజనం, ఉల్లి భోజనం అని వేరువేరుగా విక్రయిస్తున్నారు. ఉల్లి భోజనం ఖరీదు మామూలు మీల్స్ కి మూడురెట్లు ఎక్కువగా ఉండటంతో అనేక హోటళ్ల వద్ద ధర్నాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇప్పుడే అందిన వార్త….కరీంనగర్ లో…
ఇన్ని దారుణ వార్తలు చూడలేక టివీ పీక నొక్కేశాను.
– కణ్వస