ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజి పై పరిశీలనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచన ప్రకారం ఒక కమిటీ ఏర్పాటైంది. అయితే ఇంకా ఆకమిటీ సమావేశమే కాలేదు. మోదీ ప్రశ్నకు సమాధానంగా ముగ్గురి కమిటీలో సభ్యుడైన వెంకయ్యనాయుడు ఈ సంగతి చెప్పారని డిల్లీ వార్తలు వెల్లడిస్తున్నాయి.
ఎపికి హోదా ఇవ్వడం సాధ్యం కానందున స్పెషల్ పేకేజి ఇవ్వాలని గతంలోనే వెంకయ్య సూచించగా ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, వెంకయ్యనాయుడు కలిసి ఆ విషయం పరిశీలించాలని ప్రధాని మోదీ సలహా ఇచ్చారు.
రాజ్యసభలో జైట్లీ ప్రకటన అనంతర పరిణామాలను, తెలుగుదేశంలో మొదలైన నిరసనను పార్లమెంటు ఆవరణలో సోమవారం సాయంత్రం వెంకయ్యనాయుడు ప్రధానికి వివరించగా ”మీ కమిటీ ఏమి చెప్పింది” అని అడిగారనీ, దానిపై ఇంకా సమావేశం జరగలేదని వెంకయ్య బదులిచ్చారని సమాచారం.
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటంపై నీతి ఆయోగ్ కొన్ని ప్రతిపాదనలు సిద్ధంచేసి ఆర్థిక శాఖకు పంపిందని, ప్రస్తుతం ఆ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ పరిశీలనలోనే ఉన్నాయని వెంకయ్య ప్రధానికి వివరించినట్టు తెలిసింది. దీనిపై ప్రధాని స్పందిస్తూ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అంశంపై వెంటనే అరుణ్ జైట్లీతో సమావేశమై తదపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మోదీ ఆదేశం మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని వెంకయ్యనాయుడు, తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనాచౌదరి పార్లమెంటు ఆవరణలోని ఆయన కార్యాలయంలోనే రెండుసార్లు సమావేశమై సమాలోచనలు జరిపారు. ఏపీకి ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలనేది నిర్ణయించేందుకు తనకు మరింత సమయం కావాలని జైట్లీ సూచించటంతో సమావేశం ఎలాంటి ఆలోచనకూ రాకుండానే ముగిసింది. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీపై స్పష్టతకు వచ్చిన తరువాత, బిజెపి నేతలు చంద్రబాబుతో సమావేశమవుతారు.