కరోనాను మార్కెట్ చేసుకునేందుకు మెడికల్ మాఫియానే కాదు… ఆధ్యాత్మిక వ్యాపారులూ చురుకుగా ఉన్నారు. ఇప్పటికే కరోన స్వస్థత సభలు అంటూ.. కొంత మంది క్రిస్టియన్ ప్రచారకులు పోస్టర్లు వేసుకున్నారు. ఈ విషయంలో తాను కూడా ఏ మాత్రం తీసిపోనని.. చిలుకూరి బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ నిరూపిస్తున్నారు. నిన్నామొన్నటి వరకూ ఆయన.. ఇండియాకు కరోన రాకపోవడానికి చిలుకూరు బాలాజీ ఆశీస్సులే కారణమని చెబుతూ వస్తున్నారు. ఆ మేరకు మీడియాలో వచ్చిన వార్తలు.. ఆయన చెప్పిన స్టేట్మెంట్ వైరల్ అయింది. ఇండియాలో కరోన కలకలం ప్రారంభమయ్యాక.. రంగరాజన్..మరో కొత్త ప్రక్రియ ప్రారంభించారు.
బాలాజీ దేవాలయంలో కరోనా వైరస్ రాకుండా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ సోకకుండా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థాన్ని అందరిపై చల్లామని.. వైరస్ ఎండిపోవాలని అలా చేశామని రంగరాజన్ చెప్పుకొచ్చారు. భయపడే జనాలను.. తామున్నామని మభ్యపెట్టి… వ్యాపారం చేసుకునే ఆధ్యాత్మిక వ్యాపారవేత్తల జాబితాలో… రంగరాజన్ లాంటి వాళ్లు కూడా చేరిపోతున్నారు. దేవుడిపై భక్తితో ఆలయాలకు వస్తారు.. ప్రశాంతత కోసం ఆలయాలకు వస్తారు కానీ.. ఇలా.. స్వస్థత చేస్తామంటూ.. నమ్మించేలా వ్యవహరించడం… భక్తుల్ని మోసం చేయడమే.
చిలుకూరు బాలాజీ ఆలయ నిర్వాహకులు తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. రాజకీయ అంశాలపై విపరీత వ్యాఖ్యలు చేయడమే కాదు.. ఆలయాన్ని గుప్పిట్లో ఉంచుకునేందుకు.. దేవాదాయశాఖ పరిధిలోకి రాకుండా… చేస్తున్నారు. హుండీ ఉంటే… దేవాదాయశాఖ పరిధిలోకి వెళ్తుందని చెప్పి.. ఆ ఏర్పాటు లేకుండా చేశారు. ఆలయాన్ని సొంత వ్యవహారంలా నడుపుకుంటూ.. కరోనా ఎండిపోవడానికి తీర్థాలు చల్లుతున్నామంటూ ప్రచారం చేస్తున్నారు.