ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు ప్రత్యేకహోదా చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. ఏపీకి ప్రత్యేకహోదా కోసం.. కావాలంటే తాను ప్రధానమంత్రికి లేఖ రాస్తానని కూడా చెబుతున్నారు. కేసీఆర్ సాయంతో.. కేంద్రం నుంచి ప్రత్యేకహోదా కోసం ఒత్తిడి చేసేందుకు మరింత బలం పెరుగుతుందని… జగన్ కూడా చెబుతున్నారు. ఈ సందర్భంలో ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకహోదా ఎలాంటి కీలక మలుపులకు కారణం కాబోతోంది.
ఏపీలో ప్రత్యేకహోదా సెంటిమెంట్ ఏ స్థాయిలో ఉంది..?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకహోదా అంశం ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా కనిపిస్తోంది. 2018లో ఏపీలో జరిగిన రాజకీయాల్లో కీలక మార్పులకు ప్రత్యేకహోదా కారణం అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ అంటరాని పార్టీగా మారడానికి కూడా.. ప్రత్యేకహోదానే కారణం. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 2019కి ప్రత్యేకహోదా సెంటిమెంట్ క్యారీ అవుతుంది. 2019లో తెలంగాణ రాజకీయాల్లాగే.. ఏపీ రాజకీయాలు కూడా రసవత్తరంగా ఉండబోతున్నాయి. ప్రత్యేకహోదానే ప్రధానాంశం అయ్యే అవకాశం ఉంది.
బీజేపీ ముగిసిన అధ్యాయమని ఎందుకు చెబుతోంది..?
భారతీయ జనతా పార్టీ నేతలు ప్రత్యేకహోదా విషయం మీద భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రత్యేకహోదా గురించి ప్రజలు పట్టించుకోవడం లేదు కానీ.. జర్నలిస్టులు నాయకులే మాట్లాడుతున్నారని అంటున్నారు. ప్రత్యేకహోదా అనేది ముగిసిన అధ్యాయం అని వారు అంటున్నారు. నిజంగా వారు ఇదే వాదనతో.. ఎన్నికలకు వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధ్యాయం ముగిసిపోతుంది. ఎందుకంటే… ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేకహోదా సెంటిమెంట్ బలంగా ఉంది. నేను పది మందితో .. ప్రత్యేకహోదా సెంటిమెంట్ ఇష్యూనా కాదా.. అని మాట్లాడితే.. తొమ్మిది మంది ఇష్యూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ ఎలా ఉందో.. ఏపీలో ప్రత్యేకహోదా సెంటిమెంట్ అలా ఉంది. గత ఎన్నికల సమయంలో.. మోడీ మానియా ఉండి కూడా.. కనీస సీట్లు తెచ్చుకోలేకపోయారు కదా..! అలాగే.. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఏం సాధించింది. సిట్టింగ్ సీట్లు సాధించుకోలేకపోయింది. 119 కోట్ల పోటీ చేస్తే.. 103 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. నేను ఎన్నికల సమయంలోనే చెప్పాను.. బీజేపీకి ఒకటి, రెండు సీట్లు కూడా రావని అదే నిజం అయింది.
ప్రత్యేకహోదా అంశం ఉండకూడదని బీజేపీ కోరుకుంటోందా..?
తెలంగాణలోనే బీజేపీకి ఆ పరిస్థితి ఉంటే.. ఏపీలో ఎలా ఉంటుంది. ఏపీలో ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు హానెస్ట్‌గా ఉన్నారా లేదా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. చంద్రబాబు అనేక విధానాలు మార్చుకుని ఉండవచ్చు వీటిని సమర్థించేవారు ఉన్నారు.. సమర్థించని వారు కూడా ఉన్నారు. అలాగే మిగతా పార్టీలు కూడా. ఈ పద్దతిలోనే అన్ని పార్టీలు ప్రత్యేకహోదాను ఇష్యూగానే పరిగణిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ విషయంలో సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి.. ఇది ఓ ఇష్యూ ఉండకూడదని కోరుకుంటోంది.