‘పాచిపోయిన లడ్డులు’… ప్రత్యేక హోదాకి బదులుగా ప్యాకేజీని ఆంధ్రాకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పిన పోలిక ఇది..! ‘ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటా. బలిదానాలు అవసరమైతే పవన్ చేస్తాడు. ఆంధ్రుడి ఆత్మగౌరవం ఎలా ఉంటుందో కేంద్రానికి చూపుదాం. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని మరచిపోలేదు’… జనసేన ఆవిర్భావ సభలో పవన్ ఆవేశం ఇది. ‘ ఆప్ కుచ్ బీ నేమ్ లగావ్ .. ఆప్ కుచ్ బీ నేమ్ లగావ్ .. లేకిన్ ఫండ్స్ కి జరూరత్ హై. ఎక్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కా జరూరత్ హై’ (పేరేదైనా పెట్టండి, నిధులు మాత్రం ఇవ్వండి)… ఇదీ న్యూస్ 18 ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ మాట.
ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ యూ టర్న్ తీసుకున్నారని అనడానికి ఇంతకంటే ఇంకేం కావాలి..? పోనీ, పవన్ వ్యాఖ్యలకు మీడియా వక్రభాష్యం చెప్పందీ అనుకుంటే.. ఆ ఇంటర్వ్యూలో పాత్రికేయుడు అడిగిన ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది. ‘మీరు ఏదైతే ప్రత్యేక హోదా ఆంధ్రాకి అవసరం అని చెబుతున్నారో, దానిపై మోడీ సర్కారు చాలా స్పష్టంగా చెప్పేసిందీ.. అలాంటిది కుదరదని. ప్యాకేజీ ఇస్తాంగానీ, ప్రత్యేక హోదా మాత్రం లేదని అంటున్నారు కదా..’ అని పూర్తి చేసేలోగానే పవన్ స్పందిస్తూ… ‘పేరు ఏదైనా పెట్టుకోండి, నిధులు ఇవ్వండి చాలు’ అన్నారు. అంతేకాదు, తాను ఇటీవల ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదికలో కూడా రాష్ట్ర అవసరాలను పేర్కొన్నామనీ, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కేంద్రాన్ని కోరామనీ, ఏ పేరు పెట్టుకున్నా మీ ఇష్టం అని పవన్ అన్నారు. ఈ ఇంటర్వ్యూపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. ప్రత్యేక హోదా కోసం పోరాటం అని గర్జించిన పవన్, ఇప్పుడు ప్యాకేజీ అయినా ఫర్వాలేదని ఎందుకు మాట మార్చారనే చర్చ మొదలైంది. దీంతో, తన వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించిందని ఖండించే ప్రయత్నమూ ట్విట్టర్ ద్వారా పవన్ చేశారు.
హోదాకి బదులు ప్యాకేజీ ఇస్తాం అని కేంద్రం చెబితే… పేరేదైనా సరే నిధులు ఇవ్వండి అనే కదా ఆనాడు సీఎం చంద్రబాబు ఒప్పుకున్నది. నాలుగేళ్లు గడుస్తున్నా ఏ పేరుతోనూ నిధులను కేంద్రం ఇవ్వడం లేదన్న ఆవేదనతోనే కదా ఇప్పుడు కేంద్రంపై పోరాటానికి దిగింది. ‘మా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత కారణాల వల్ల కేంద్రాన్ని అడగడానికి భయపడుతున్నారేమో. కానీ, నాకు కేంద్రం అంటే భయం లేదు’ అని పార్టీ ఆవిర్భావ సభలో పవన్ ఆవేశంగా మాట్లాడారే… మరి, ఇప్పుడు పేరేదైనా నిధులు కావాలని అంటారేంటీ..? హోదాకి బదులు ప్యాకేజీ అయినా ఓకే అంటారేంటీ..? హోదా అంటే ఆంధ్రుల సెంటిమెంట్ అని చెప్పిన పవనే.. ఇప్పుడు పేరేదైనా చల్తా అంటారేంటీ..? ఇది వ్యక్తిగత కారణాల వల్ల పవన్ లో కేంద్రమంటే కలిగిన భయానికి నిదర్శనమా..? లేదా, దీన్ని కూడా రాజకీయ అపరిపక్వత కిందకే జమేసుకోవాలా..?