తెలుగు రాష్ల్రాల్లో భాజపా విస్తరణ ప్రయత్నాలు మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్రాలో కూడా కొంతమంది టీడీపీ నేతలను భాజపా ఆకర్షిస్తుందనే అంచనాలూ ఉన్నాయి. అయితే, తెలంగాణలో ఆపరేషన్ కొంత వర్కౌట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీపరంగా చూసుకున్నా, కొన్ని ఎంపీ స్థానాలు భాజపా దక్కించుకుంది. చెప్పుకోవడానికి ఓటు బ్యాంకు కూడా భాజపాకి ఉంది. కానీ, ఆంధ్రాలో భాజపాకి ఆ సానుకూలతలు కనిపించడం లేదు. ఇక్కడా కొంతమంది టీడీపీ నేతల్ని ఆకర్షించినా… ఏపీ ప్రజల అభిమానం సాధించడం భాజపాకి ఈసారి కూడా అంత సులువేం కాదు.
గత ప్రభుత్వ హయాంలో ఏపీ విభజన హామీలు, ప్రత్యేక హోదా, రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్టు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాజధాని నిర్మాణ వ్యయం… ఇలా అన్నింటా ఆంధ్రాకి భాజపా అన్యాయం చేసిందనే బలమైన అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లింది. దాంతో గడచిన సార్వత్రిక ఎన్నికల్లో 2014లో దక్కిన ప్రజాభిమానం కూడా భాజపాకి దక్కకుండా పోయింది. దేశవ్యాప్తంగా మోడీ హవా ఎంతున్నా… ఆంధ్రాలో అస్సలు కనిపించలేదు. సరే… ఇప్పుడు ఆంధ్రాలో భాజపాకి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ కూడా అధికారంలో లేదు. అనుకూలమైన వైకాపా సర్కారే ఉంది. రాష్ట్రంలో భాజపా బలపడటానికి ఇదే సరైన సమయం అనుకోవచ్చు! ఇతర పార్టీల నుంచి కొంతమంది నాయకుల్ని చేర్చుకోవడం సమస్య కాదు. వ్యాపార నేపథ్యం ఉన్న కొంతమంది నాయకుల్ని నయానో భయానో భాజపాలోకి రప్పించుకోగలరు. కానీ, ప్రజల అభిమానం సాధించడమే అసలైన సవాల్.
ఏపీ ప్రత్యేక హోదా అంశం వచ్చే ఎన్నికల దాకా కొనసాగేట్టుగానే ఉంది. ఇదే అంశాన్ని నిన్నటి నీతీ ఆయోగ్ సమావేశాలో సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి లేవనెత్తారు. ఢిల్లీ వెళ్లిన ప్రతీసారీ ప్రధానికి అడుగుతూనే ఉంటానన్నారు. ఆయన మనసు మారాలని దేవుడిని కోరుకుంటున్నా అన్నారు. అంటే… ఆంధ్రాలో ప్రత్యేక హోదా సాధన అనే అంశం సజీవంగా ఉంటుంది. ఎలాగైనా సాధించి తెస్తామని ఏపీ ప్రజలకు ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు కాబట్టి, ఆ ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగించాల్సిన అవసరం వైకాపాకి ఉంది. హోదా అడిగిన ప్రతీసారీ… కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తిరుపతిలో చెప్పినట్టుగానే, అది సాధ్యం కాదూ… ఏపీకి ఇప్పటికే చాలా చేశామనే వాదననే వినిపించాల్సిన అవసరం భాజపాకి ఏర్పడుతూనే ఉంటుంది. ఏపీ ప్రజల్లో భాజపాపై వ్యతిరేకతకు కారణమే ఈ వాదన. దాన్ని పూర్తిగా చర్చల్లో లేకుండా చేసి, ఏపీ ప్రజల దృష్టిని మరల్చగలిగితేనే భాజపాపై కాస్తోకూస్తో సానుకూలతకు ఆస్కారం ఉంటుంది. హోదా ప్రయత్నాలు పక్కన పెట్టేయండని సీఎం జగన్ కు చెప్పేంత చొరవ ప్రధాని మోడీకి ఉండొచ్చు. కానీ, అదే పని చేస్తే ప్రతిపక్ష పార్టీ టీడీపీకి బలమైన విమర్శనాస్త్రాన్ని అందించినట్టు అవుతుంది. కాబట్టి, ప్రత్యేక హోదా సాధన ప్రయత్నం ఆగదని సీఎం జగన్ చెబుతున్నంత కాలం, ఏపీకి చాలా చేశామనే వాదనను కేంద్రం వినిపించాల్సిన అవసరమే ఉంటుంది. ఈ చర్చ పక్కకు వెళ్లనంత కాలం… ఆంధ్రాలో భాజపా సొంతంగా ఎదిగేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉండవనేది వాస్తవం.