హైదరాబాద్: మునికోటి ఆత్మాహుతితో వేడెక్కిన ప్రత్యేకహోదా ఉద్యమం, ఇవాళ్టి బంద్‌తో తీవ్రరూపు దాల్చింది. ప్రత్యేకహోదాకోసం సీపీఐ ఇచ్చిన పిలుపుకు కాంగ్రెస్, వైసీపీకూడా మద్దతు తెలపటంతో బంద్ సంపూర్ణంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పెట్రోల్ బంకులు, విద్య, వాణిజ్య సంస్థలను మూసేశారు. పలుచోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బంద్‌కు రాష్ట్ర లారీయజమానుల సంఘంకూడా మద్దతు తెలిపింది. మునికోటి మృతిపై నిన్న బంద్ పాటించిన తిరుపతి పట్టణానికి బంద్ మినహాయింపు ఇచ్చారు. అయితే చిత్తూరుజిల్లాలోమాత్రం బంద్ కొనసాగింది. విజయనగరంజిల్లావంటి కొద్దిచోట్ల మినహాయిస్తే, గ్రామాలనుండి పట్టణాలవరకు రాష్ట్రంలోని అత్యధికప్రాంతాలలో బంద్ సంపూర్ణంగా జరిగింది.
విజయవాడలో ఆర్టీసీ బస్టాండ్ ముందు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తదితర నేతలు బైఠాయించి ధర్నా చేశారు. ఒంగోలు పట్టణంలో వైసీపీ, సీపీఐ, సీపీఎమ్ పార్టీలు ప్రత్యేకహోదాకోసం రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించాయి. గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్ వద్ద నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సీపీఐ నాయకులు ర్యాలీని నిర్వహించారు. కాకినాడలో నిర్వహించిన ఆందోళనలో కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు పాల్గొన్నారు. అనంతపురంలో సీపీఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు.
మరోవైపు తెలుగుదేశం ఎంపీలు ఇవాళ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అయ్యారు. ప్రత్యేకహోదాపై నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్రానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. హోమ్ మంత్రి రాజ్నాథ్నుకూడా వారు కలుస్తారు. ప్రధానమంత్రి మోడి అపాయింట్మెంట్ కోరారు. రేపుగానీ, ఎల్లుండిగానీ అపాయింట్మెంట్ లభించే అవకాశం ఉంది. చంద్రబాబునాయుడుకూడా ఢిల్లీవచ్చి మోడిని కలిసే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ జేడీ శీలం ఇవాళ రాజ్యసభలో ప్రత్యేకహోదాపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. దీనికోసం తిరుపతిలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని, రాష్ట్రంలో తీవ్ర అలజడి చెలరేగిందని చెప్పారు. ప్రధాని, ఆర్థికమంత్రి ప్రత్యేకహోదాపై పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధి అనంతపురం వచ్చివెళ్ళిన తర్వాత జగన్ ప్రత్యేక హోదాకోసం కదిలాడని, అప్పటిదాకా ఏమైపోయాడని జేడీ శీలం అన్నారు. ఇప్పుడుకూడా కేవలం తెలుగుదేశాన్నే నిందిస్తున్నాడని, కేసులభయంతో బీజేపీని పల్లెత్తుమాట అనటంలేదని విమర్శించారు. జగన్ తిరుపతి వెళ్ళి మునికోటి కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, మునికోటి కుటుంబానికి రు.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం, చంద్రబాబు మెడలు వంచి హోదా సాధిద్దామని అన్నారు. కాకినాడలో బంద్‌లో పాల్గొన్న కేంద్రమాజీ మంత్రి పల్లంరాజు, వెంకయ్యనాయుడు, మోడిలపై ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేకహోదా ఐదేళ్ళుకాదు పదేళ్ళు ఇవ్వాలన్న వెంకయ్య, మోడి ఏమయ్యారని ప్రశ్నించారు. అటు మాలమహానాడు నేత కారెం శివాజి పవన్‌పై ఫైర్ అయ్యారు. పవన్ బీజేపీపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
మొత్తంమీదచూస్తే ప్రత్యేకహోదా ఉద్యమం కాక కేంద్రానికి తగిలేటట్లుగానే ఉంది. మరి కేంద్రం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. కేంద్రం సానుకూలంగా స్పందిస్తేమాత్రం రాష్ట్రాన్ని విభజింపజేసిన కేసీఆర్, తద్వారా ఏపీనెత్తిన పాలుపోసినట్లే అనుకోవాలి.