భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి తిరుమలలో హోదా సెగ తగిలింది. కర్ణాటక ప్రచారం ముగించుకుని, తిరుమల స్వామివారి దర్శనార్థం ఆయన ఈరోజు వచ్చారు. అయితే, ఆయన అలిపిరి చేరుకునేసరికే… ‘అమిత్ షా గో బ్యాక్ గో బ్యాక్’ అంటూ కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. వియ్ వాంట్ స్పెషల్ స్టేటస్ అంటూ నినాదాలు చేశారు. తిరుమలలో దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఉండగా, అమిత్ షా కాన్వాయ్ ని అడ్డుకునేందుకు కూడా కొంతమంది ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు వారించారు. ఈ క్రమంలో ఒక కారు అద్దం పగిలినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి, ఇలాంటి వైఖరి సరైంది కాదంటూ ఖండించారు.
ఇక, భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందిస్తూ.. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయించిన దాడి అంటూ విమర్శలు చేస్తున్నారు. ఆయన వైఖరికి ఇది నిదర్శనమన్నారు. రాష్ట్రంలో భాజపా ఎదుగుతోందనీ, దాన్ని చూసి ఓర్వలేక, తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిపై చేసిన దాడిగా ఆయన అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా సెగ అనేదే లేదనీ, ప్రజల్లో ఎలాంటి సెంటిమెంట్లూ లేవనీ, ఇది భాజపాపై టీడీపీ చేస్తున్న కుట్రలో భాగంగా చోటు చేసుకున్న ఘటన అంటూ ఆయన విమర్శలు గుప్పించేశారు. ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందనీ, ఆందోళనకు దిగిన కార్యకర్తల్ని అరెస్ట్ చేశారనీ, ఆ తరువాత వారిని ఎక్కడికి తరలించారని ప్రశ్నించారు..? చేయాల్సిన పని చేయించేసి, ఆ తరువాత ఖండిస్తున్నామని చంద్రబాబు చెబితే సరిపోతుందా అన్నారు.
అమిత్ షాకి వ్యతిరేకంగా నినాదాలు అనేవి ప్రస్తుతం ఆపార్టీకి కాస్త ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే, నిన్ననే కర్ణాటకలో ప్రచారం ముగిసింది. ఇలాంటి సమయంలో అమిత్ షా గో బ్యాక్ గో బ్యాక్ అంటూ పక్క రాష్ట్రంలోనే భాజపాపై వ్యతిరేకత వ్యక్తమైతే దాని ప్రభావం ఉండే అవకాశాలుంటాయి కదా! ఇక, సోము వీర్రాజు వ్యాఖ్యల విషయానికొస్తే… ఆంధ్రాలో హోదా సెంటిమెంట్ అనేదే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదొక్కటి తప్ప ఇప్పుడు వేరే రాజకీయాంశం లేదనేది బహుశా ఆయన గుర్తించడం లేదేమో! అమిత్ షా కాన్వాయ్ పై దాడి యత్నాన్ని ఎవ్వరూ హర్షించరు. కానీ, ఈ సందర్భంగా ‘వియ్ వాంట్ స్పెషల్ స్టేటస్, అమిత్ షా గో బ్యాక్’ అనే నినాదాల ద్వారా ఆంధ్రుల్లో భాజపా పట్ల ఉన్న వ్యతిరేకతకు ఈ నిరసన అద్దం పడుతోంది.