ఆమె మొన్నటి స్టార్ హీరోయిన్. తెలుగు, హిందీ సినిమాల్లో దుమ్ము లేపారు. తెరపై ఏకైక అందగత్తె అంటూ మృణాళ్‌సేన్ వంటి దర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కట్ చేస్తే… ఆమె నిన్నటి ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకురాలు. సమాజ్‌వాదీ పార్టీలో అమర్‌సింగ్ అండతో ఓ వెలుగు వెలిగారు. మరి నేడేమిటి? ఆమె ప్రస్థానం ఎటు వైపు? అరవై ఏళ్ల వయసులో… ఈ మాజీ స్టార్ హీరోయిన్ కమ్ పొలిటీషియన్ కొత్తగా పోషించబోతున్న పాత్ర ఎలాంటిది?
ప్రస్తుతానికి రాజకీయ ప్రణాళికలు ఏమీ లేవు. వీలైనన్ని మంచి సినిమాల్లో నటించడమే లక్ష్యం అని అంటున్నారు జయప్రద. తూర్పు గోదావరి జిల్లాలోని మందపల్లిలోని ఓ గుడిలో పూజలకు వచ్చిన ఆమె… మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా… తాను రాజకీయాలకు ప్రస్తుతం సమయం ఇవ్వడం లేదన్నారు. అయితే అంత మాత్రాన రాజకీయాలకు దూరం కాబోనని, ప్రస్తుతానికి మాత్రం సినిమా నటనకే తన ప్రాధాన్యం అని చెప్పారు. అంటే బహుశా వచ్చే ఎన్నికల ముందుగా ఆమె తన ప్రస్థానాన్ని నిర్ణయించుకోనున్నట్టు ఊహించవచ్చు. మరైతే ఆమె ఏ పార్టీలో చేరనున్నారు?
నిజానికి ఆమెకు ఉన్న ఇమేజ్ తో… తెలుగుదేశం లేదా వైసీపీ లేదా మరే పార్టీలోనైనా తేలికగానే చోటు దక్కించుకోవచ్చు. అయితే ఆమె మాత్రం ఈ విషయంలో ఇంకా సందిగ్థంలోనే ఉన్నట్టు కనిపించారు. చంద్రబాబు పాలన బాగుందని కితాబు ఇచ్చారామె. ఓహో అయితే తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుతున్నారన్నమాట అనుకోనివ్వకుండా… చంద్రబాబుకు ఏమాత్రం నచ్చని మాట అయిన… ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అవసరం అంటూ స్పష్టం చేశారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంతగానో నష్టపోయిందంటున్న జయప్రద… ప్రత్యేకహోదా ఇస్తేనే ఆ నష్టం పూడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదేమైనా… ఎన్నికల ముందు పరిస్థితిని, ఇచ్చే ప్రాధాన్యతలను చేరే బట్టి పార్టీని నిర్ణయించుకోవాలనే ఆలోచనలో జయప్రద ఉన్నట్టు కనపడుతోంది.