రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించిన కాంగ్రస్ దుర్మార్గాన్ని మరికొంత కాలం తిట్టుకోవచ్చు! ఐదేళ్ళు కాదు పదేళ్ళు ప్రత్యేక హోదా అని నమ్మబలికి విభజనకు సహకరించడంద్వారా వెన్నపూసి గొంతుకోసిన బిజెపిని కాంగ్రెస్ కంటే కఠినంగా శిక్షించవచ్చు..అయితే ఇందులో తెలుగుదేశం వైఫల్యాన్ని విస్మరించలేము.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు 2014 జూన్ 2 న ఏర్పడ్డాయి. సరిగ్గా పదిరోజుల తరువాత జూన్ 12 న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని ప్లానింగ్ కమిషన్ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి పదవిలోక వచ్చి వారం కాకముందే ప్లానింగ్ కమీషన్ ఇచ్చిన స్పష్టీకరణద్వారా ప్రత్యేక హోదాలో అడ్డంకి చంద్రబాబు నాయుడు కి తెలుసు. కొత్త ప్రభుత్వం అధికారంలో సర్దుకోవడం, దైనందిన వ్యాపకాలను సెట్ చేసుకోవడం మొదలైన అంశాల వల్ల కొద్ది వారాలు లేదా నెలలు ప్రత్యేక హోదా విషయాన్ని తెలుగుదేశంపార్టీ, రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టేయడాన్ని అర్ధం చేసుకోవచ్చు.
మరోవైపు ఎపికి ప్రత్యేక ప్రతిపత్తి అసాధ్యమని నిర్ధారించిన ప్రణాళికా సంఘం రద్దయిపోయింది. దాని స్థానంలో అవతరించిన నీతి ఆయోగ్ కూడ ఆంధ్రప్రదేశ్‌కు ఖాళీ చేతులే చూపించింది. ప్రత్యేక ప్రతిపత్తి ఐదేళ్ళు చాలదు పదేళ్ళు కావాలని రాజ్యసభలో వాదించి విభజన బిల్లుని గెలిపించిన కేంద్ర మంత్రి ఎమ్.వెంకయ్యనాయుడు అది కుదిరేపని కాదని పార్టీ సమావేశంలో నిర్ధారించి కూడా ఏడాది గడిచింది!
విషయం లోతుని అర్ధం చేసుకున్న చంద్రబాబు ప్రత్యేక ఆర్థిక ప్రతిపత్తి ఇవ్వాలని, ఇవ్వలేకపోయినట్టయితే కనీసం ప్రత్యేక ఆర్థిక సహాయం భారీగా చేయాలని చంద్రబాబునాయుడు బహిరంగంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు…అంటే ప్రత్యేక ప్రతిపత్తి కోసం పట్టుపట్టబోమని ప్రత్యేక ఆర్థిక సహాయం చేస్తే చాలునని కేంద్రానికి అది పరోక్ష సూచనే అయ్యింది.
అధికార పార్టీ తోసహా అన్ని పార్టీలూ రాష్ట్రప్రయోజనాలను వొదిలిపెట్టి సొంత ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్నందువల్ల ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని వత్తిడి చేసే యంత్రాంగమే లేకుండా పోయింది. సమస్యలు వచ్చినపుడు రాజకీయ పార్టీలను కూడగట్టడానికి అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేసే అలవాటు చంద్రబాబు నాయుడుకి లేకుండా పోవడం రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోడానికి అవరోధమైంది.
కాంగ్రెస్ అభిమానులు సానుభూతి పరులు ఏకపక్ష విభజన పట్ల ఆగ్రహంతో వున్నారు. అది ఎన్నికల్లో చూపించారు. దాని అర్ధం కాంగ్రెస్ ను శిక్షించడం మాత్రమే అంతే తప్ప తమ విశ్వాసాన్ని బిజెపికో, తెలుగుదేశానికో శాశ్వతంగా మార్చేసుకున్నారని కాదు. అదీగాక విభజన హామీలను చట్టాన్ని అమలు చేయించ వలసిన బాధ్యత కూడా విభజించేసిన కాంగ్రెస్ మీద వుంది. అలాంటి కాంగ్రెస్ ని పిలిచి ఫిక్స్ చేసే పనిని తెలుగుదేశం విస్మరించింది.
ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయ ప్రక్రియలో ఒక భాగస్వామిగా ఎన్నడూ పరిగణించకపోవడం తెలుగుదేశం చేసిన మరో తప్పిదం. ఆపార్టీ ఎమ్మెల్యేలను తనలో కలిపేసుకునే చట్టవిరుద్దమైన, అనైతికమైన చర్యల వల్ల విషయాల ప్రాతిపదికగా నైనా జగన్ తో కలసి పనిచేసే అవకాశం చంద్రబాబుకి లేకుండా పోయింది. సిపిఐ, సిపిఎం సహా అఖిలపక్షాలను పిలిచి చర్చించే విషయం పక్కన పడేసినా, కేంద్రంలో రాష్ట్రంలో అధికార భాగస్వామి అయిన బిజెపి ఆంధ్రప్రదేశ్ శాఖ ను సంప్రదించి ప్రత్యేక హోదా గురించి ఏంచేయాలో కార్యాచరణ రూపొందించాలని అడిగే వివేకమైనా తెలుగుదేశానికి లేకుండా పోయింది.
అఖిలపక్షాన్ని పిలిచినంత మాత్రాన బిజెపితో మైత్రి తెంపేసుకోనవసరం లేదు. ఒకవేళ అది తెగిపోయే మైత్రే అయితే రాష్ట్రప్రయోజనాలకోసం తెంపేసుకున్నా మంచిదే! రాజకీయ ఏకాకితనం కంటే అదేనయం!!