“ఏపికి ప్రత్యేక హోదాకి ఇస్తారా లేదా?” అని రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకి కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ “ఇవ్వము” అని సూటిగా సమాధానం చెప్పకుండా 14వ ఆర్ధిక సంఘం, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు, హోదా కోసం డిమాండ్లు, హోదా పొందడానికి ఉండవలసిన అర్హతలు, హోదా ఉన్నందున, లేకపోతే కలిగే లాభనష్టాలు వగైరా గణాంకాలు వివరించి, ఏపికి ప్రత్యేక హోదా వల్ల లభించే ప్రయోజనాల కంటే చాలా ఎక్కువగానే ఇస్తున్నామని చెప్పారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం నుంచి వివిధ పద్దులు క్రింద సుమారు లక్ష కోట్లు పైన వచ్చేదని, కానీ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కి సుమారు రూ.2 లక్షల కోట్లు పైనే ఇస్తున్నామని చెప్పారు. “ప్రత్యేక హోదా కంటే ఎక్కువగానే ఇస్తున్నప్పుడు హోదాయే కావాలని పట్టుబట్టి నష్టపోతారా?” అని ప్రశ్నించారు. అనేక కారణాల చేత ఈ అంశం ఒక సెంటిమెంటుగా మారిందని, దానిపై రాజకీయలు చేయడం తగదని హితవు పలికారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హమీలని అమలుచేస్తామని, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు వంటి కొన్ని హమీలని ఇప్పటికే అమలు చేశామని మిగిలినవి కూడా వరుసగా అమలుచేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం చేయడానికి తమ ప్రభుత్వం ఎటువంటి పరిమితులు పెట్టుకోలేదని, అది పూర్తిగా కోలుకోనేవరకు చేతనైన సహాయం చేస్తూనే ఉంటామని జైట్లీ చెప్పారు.
జైట్లీ సమాధానంతో తృప్తి చెందని కాంగ్రెస్ పార్టీ వాక్ అవుట్ చేసింది. రాజధాని నిర్మాణం కోసం రూ.2,800 కోట్లు ఇచ్చామని చెప్పినప్పుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి దానిలో రూ.1,000 కోట్లు గుంటూరు డ్రైనేజి వ్యవస్థ ఆధునీకరణకి కేటాయించినందున, దానిని రాజధాని పద్దులో చేర్చవద్దని కోరారు.
సిపిఎం సభ్యుడు సీతారం ఏచూరి కూడా జైట్లే సమాధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆనాడు ఇచ్చిన హామీలని అమలుచేయకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.
దేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ పార్టీల సభ్యులు ఏపికి ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీలని అమలుచేయాలని కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా కోరినప్పటికీ కేంద్రప్రభుత్వం వైఖరిలో ఎటువంటి మార్పు కనబడలేదు. కనీసం పునరాలోచన చేసే ఉద్దేశ్యం కూడా లేదని స్పష్టం అయింది.