భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని దేశం మొత్తం ఘనంగా స్మరించుకుంటోంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అందరూ ఆయన గొప్పతనాన్ని ప్రశంసిస్తూనే ఉన్నారు. రాజకీయ పార్టీలు అయితే అన్నీ తాము అంబేద్కర్ సిద్ధాంతాల్లోనే నడుస్తున్నామని చెబుతూ ఉంటాయి. ఇతర విషయాల్లో పక్కన పెట్టినా కనీసం దేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా ఆయన నేతృత్వంలో సిద్ధం అయిన అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అయినా రాజకీయం గౌరవిస్తోందా?. అంటే ఆలోచించాల్సిన అంశమే.
రాజ్యాంగ వ్యవస్థల్ని బలహీనం చేస్తున్న రాజకీయం
భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యానికి గట్టి పునాది వేసేందుకు అనేక వ్యవస్థల్ని సిద్దం చేశారు. ఆ వ్యవస్థలు.. పాలకులకు తలొగ్గకూడదు. అందుకే వాటి నియామకం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇప్పుడేం జరుగుతోంది..?. ఎన్నికలు అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం నిర్ణయాల్లోనే పక్షపాతం కనిపిస్తోంది. చివరికి నియామక ప్రక్రియ కూడా మార్చేశారు. ఇక విశ్వసనీయ ఎన్నికల వ్యవస్థ ఎక్కడ ఉంటుంది. ఇది అంబేద్కర్ ను గౌరవించడమా ? అవమానించడమా ?. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే.. ఎన్నో రాజ్యాంగ వ్యవస్థలు ఇప్పుడు పాలకుల చేతుల్లో ఉన్నాయి. ఎన్నో కాదు..దాదాపు అన్నీ. స్వతంత్రంగా వ్యవహరించే రాజ్యాంగబద్ధ సంస్థ కనిపించడం లేదు.
రాజ్యాంగాన్ని బలోపేతం చేస్తే అంబేద్కర్ ను గౌరవించినట్లే !
భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించింది. చట్టం, న్యాయం అందరికీ సమానమే. కానీ ఆచరణలో అది జరగడం లేదు. ఇప్పటికిప్పుడు న్యాయం కోసం ఓ పేదవాడు ప్రయత్నించలేడు. తప్పుడు కేసు పెడితే తన కోసం వాదించుకునే స్థోమత ఉండదు. కానీ ఓ పెద్దవాడు ఎంత పెద్ద నేరం చేసినా చట్టాల్లోని లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని జైలుకు పోకుండా బతికేయగలడు. దోచుకున్న డబ్బుతో ఒక్క శాతం లాయర్లకు వెదజల్లి తాను కాలు మీద కాలు వేసుకుంటాడు. కానీ ఓ చిన్న దొంగతనం కేసులో పట్టుబడిన వాడు ..జైల్లో మగ్గిపోవాలి. ఇలాంటి అసమానతల లోపం రాజ్యాంగంలో లేదు.. వాటిని అమలు చేస్తున్న వారిలోనే ఉంది. రాజ్యాంగంలో ఉన్నట్లు అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం ఉన్నప్పుడే అంబేద్కర్ ను గౌరవించినట్లు.
పూలదండలు వేయడం కాదు.. ఆదర్శాలు పాటించాలి!
అంబేద్కర్ జయంతి రోజున ప్రసంగాలు ఇచ్చి, పూలదండలు వేస్తే గౌరవించినట్లు కాదు. అతిపెద్ద విగ్రహాలు పెట్టినా అంతే. అసలు రాజ్యాంగ నిర్మాత విగ్రహాలకు వ్యతిరేకం. కానీ ఆయనను రాజకీయంగా వాడుకునేందుకు విగ్రహాలు పెట్టేస్తున్నారు. ఆయన దేశానికి ఇచ్చిన రాజ్యాంగాన్ని ఎంత పకడ్బందీగా అమలుచేస్తారో.. ఆయనను అంత ఉన్నత స్థానంలో నిలబెట్టినట్లు లెక్క. ఇప్పటి వరకూ జరుగుతున్న పరిణామాలను చూస్తే అంబేద్కర్ ను పైకి గౌరవిస్తున్నారు కానీ.. ఆచరణలో మాత్రం అవమానిస్తున్నారు. కనీసం మార్పు ప్రారంభం కావాలని కోరుకుందాం.