భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రుల ఎంపిక సాఫీగా సాగుతుంది. ఎంత మంది సీనియర్లు పోటీ పడినా వారందర్నీ కూల్ చేసేసి.. మోదీ, అమిత్ షా ఎవరికి పీఠం అప్పగించాలని అనుకుంటారో వారికి అప్పగించేస్తారు. ఢిల్లీలో తాజాగా రేఖా గుప్తాకు సీఎం చాన్స్ ఇచ్చారు. ఢిల్లీ పీఠం కోసం వారసులు చాలా మంది పోటీ పడ్డారు. సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.. కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మతో పాటు సుష్మస్వరాజ్ కూతురు..ఇతరులు పోటీ పడ్డారు. అయితే కౌన్సిలర్ స్థాయి నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా ఎదిగిన రేఖా గుప్తాకు చాన్సిచ్చారు.
అంతకు ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా వంటి చోట్ల కూడా మోదీ, షా ఇదే పద్దతి పాటించారు. మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ను కాదని మోహన్ యాదవ్ ను ఎంపిక చేశారు. చౌహాన్ కు మధ్యప్రదేశ్ లో ఉన్న ఇమేజ్ సామాన్యమైనది కాదు. అయినా సరే ఆయనను కేంద్రానికి పరిమితం చేశారు. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించారు. రాజస్థాన్ వసుంధర రాజే వంటి వారు గట్టిగా ఒత్తిడి చేసినా సరే భజన్ లాల్ శర్మకు అవకాశం ఇచ్చారు. మహారాష్ట్రలో ఫడ్నవీస్ కు చాన్సివ్వడానికి ఆయన సీఎంగా చేసి.. డిప్యూటీ సీఎంగా ఉండటానికి ఏ మాత్రం సంకోచించకపోవడమే కారణం. హర్యానాలో నూ నాయబ్ సింగ్ సైనీకి అవకాశం కల్పించారు.
మోదీ, షాల స్ట్రాటజీ వెనుక పార్టీ బలోపేతం అవ్వాలి కానీ నాయకులకు వ్యక్తిగత ఇమేజ్ .. పెరగకూడదన్న కారణం ఉందని అనుకోవచ్చు. బీజేపీ ముఖ్యమంత్రులంతా ఇప్పుడు ఓ రకంగా పలుకుబడి లేనివారే. ఒక్క ఆదిత్యనాథ్ మాత్రమే ఇమేజ్ ఉన్న సీఎం. పార్టీ కన్నా ఎక్కువగా ఏ నేతా బీజేపీలో పాతుకుపోకూడదన్నది బీజేపీ అగ్రనేతల వ్యూహం కావొచ్చు.