ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు కోర్టు కేసుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇది మంత్రివర్గ శాఖ కాదు. వ్యవస్థ లాంటిది. ఏపీ ప్రభుత్వం కోర్టుల్లో లక్షా 94వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజుకు నాలుగు నుంచి ఐదు వందల పిటిషన్లు దాఖలవుతున్నాయి. వీటిని పర్యవేక్షించే వ్యవస్థ ఇప్పటి వరకూ లేకపోవడంతో కోర్టు ధిక్కార కేసులు పెరిగిపోతున్నాయి. ఎవరిపై పిటిషన్లు పడ్డాయో వారికి కౌంటర్లు వేయడానికి కూడా తీరిక ఉండటం లేదు. ఈ కారమంగా వివిధ శాఖలపై కోర్టుల్లో దాఖలయ్యే పిటిషన్లపై పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఆన్లైన్ లీగల్ కేస్ మానిటరింగ్ సిస్టం పేరుతో ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణియంచింది. ఈ మేరకు కార్యచరణ సైతం సిద్ధం చేసింది. పిటిషన్ల సత్వర పరిష్కారానికి ప్రతి విభాగంలో నోడల్ అధికారిని నియమిస్తారు. ఐఏఎస్ అధికారినే నియమించే అవకాశం ఉంది. అడ్వకేట్ జనరల్‌తో పాటు ప్రభుత్వ ప్లీడర్ల కార్యాలయాల్లో కూడా ఆటోమేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసి.. అన్ని కేసుల వివరాలు రియల్‌టైమ్ డ్యాష్ బోర్డులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వానికి ఇటీవల కోర్టు కేసుల చిక్కులు ఎక్కువయ్యాయి. అధికారులు ప్రతీ రోజు హైకోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే వాటిలో చాలా వరకూ సరైన సమాచారం ఇస్తే వీగిపోయే కేసులేనని భావిస్తున్నారు. కానీ అలాంటి సమాచారం హైకోర్టుకు ఇచ్చే వ్యవస్థ లేకనే సమస్యలు వస్తున్నాయని నిర్ణయించారు. ఇప్పుడు ఆ బాధలన్నీ తప్పించుకోవడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. జీవోలను రహస్యంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం .. ఈ కేసుల కోసం ప్రత్యేక లైవ్ డాష్ బోర్డును ఏర్పాటు చేయాలనుకోవడం కొసమెరుపు.