హైదరాబాద్ లో పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు రోజూ అమరావతికి వచ్చి పని చేసి వెళ్ళడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా ఒక ప్రత్యేక రైలునే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రైల్వే మంత్రి సురేష్ ప్రభు దానిని ప్రారంభిస్తారు. అది సికింద్రాబాద్-విజయవాడ మద్య నడుస్తుంది. అది రోజూ ఉదయం 5.30 గంటలకి సికింద్రాబాద్ లో బయలుదేరి గుంటూరు మీదుగా ఉదయం 11 గంటలకి విజయవాడ చేరుకొంటుంది. మళ్ళీ సాయంత్రం 5.30 గంటలకి విజయవాడలో బయలుదేరి గుంటూరు మీదుగా రాత్రి 11.10 గంటలకి సికింద్రాబాద్ చేరుకొంటుంది. ఆదివారం తప్ప మిగిలిన 6 రోజులు నడుస్తుంది.
అంటే జూన్ 27నాటికి ఉద్యోగులు అందరూ విజయవాడ తరలి రావడంలేదని స్పష్టం అవుతోంది. దీని వలన ఉద్యోగులకి, ప్రభుత్వానికి ఇద్దరికీ ఇబ్బంది ఉండదని అనిపిస్తున్నప్పటికీ, అందరికీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
హైదరాబాద్ జంట నగరాలలో ఎక్కడెక్కడో నివసిస్తున్న ఉద్యోగులు రోజూ ఉదయం 5.30 లోగా సికింద్రాబాద్ చేరుకోవడం, మళ్ళీ రాత్రి 11 గంటలకి స్టేషన్ నుంచి ఇంటికి చేరుకోవడం ఎంత కష్టమో ఊహించవచ్చు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఆ రాత్రి సమయంలో తమ ఇళ్ళకి చేరుకోవాలంటే ఎంత ప్రమాదమో ఊహించవచ్చు.
ఇక ఉద్యోగులు ఉదయం 11 గంటలకి విజయవాడ స్టేషన్ చేరుకొంటే, వారు తమ కార్యాలయాలకు చేరుకొని పని మొదలుపెట్టేసరికి మధ్యాహ్నం 12 లేదా ఒంటి గంట అయినా ఆశ్చర్యం లేదు. అప్పటికి భోజన విరామ సమయం మొదలవుతుంది. అదొక గంటసేపు కొనసాగుతుంది. మళ్ళీ 2గంటలకి పని మొదలుపెట్టినా సాయంత్రం 5.30 లోగా స్టేషన్ చేరుకోవలసి ఉంటుంది కనుక కనీసం 4 గంటలకే అన్నీ సర్దేసి కార్యాలయం నుంచి బయటపడవలసి ఉంటుంది. అంటే వారు కార్యాలయంలో పని చేసేది కేవలం 3-4గంటల కంటే మించదని స్పష్టం అవుతోంది. అది కూడా ఆ రైలు రోజూ టంచనుగా విజయవాడ చేరినట్లయితేనే! ఒకవేళ అది ఓ గంటో అరగంటో ఆలస్యంగా చేరుకొంటే ఆ మేరకు పని చేసే సమయం కూడా తగ్గిపోతుంటుంది. ఎంత అత్యవసరమైన పని ఉన్నా రైలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే!
ఉద్యోగులు తిరిగి రాత్రి సికింద్రాబాద్ చేరుకొనేసరికి అర్ధరాత్రి దాటుతుంది. ఒకవేళ అప్పుడు కూడా రైలు ఆలస్యంగా చేరినట్లయితే వాళ్ళు ఇంటికి చేరుకోనేసరికి ఏ ఒంటిగంటో రెండో అవుతుంది. మళ్ళీ తెల్లవారు జామున 5.30గంటలకల్లా వాళ్ళు సికింద్రాబాద్ చేరుకోవాలి. అంటే వారు కంటి నిండా నిద్రపోవడానికి కూడా అవకాశం ఉండదన్నమాట! ఇంత తీవ్రమైన ఒత్తిడితో ఉద్యోగులు సరిగ్గా పనిచేయగలరా? ఒకవేళ ఆ రైలు అందుకోలేకపోతే ఏమి చేస్తారు? విజయవాడ ఎలాగ వస్తారు?ఎప్పుడు వస్తారు? ఒకవేళ సాయంత్రం అత్యవసరమైన పని చేయవలసి వస్తే మరొక గంటో రెండు గంటలో ఆగాల్సి వస్తే అప్పుడు ఉద్యోగులు ఏమి చేస్తారు?
ఆలోచిస్తుంటే ఇలాగ అనేక సమస్యలు కళ్ళ ముందు కనబడుతాయి. మరి ఉద్యోగులకి, ప్రభుత్వానికి ఈ ఆలోచన ఏవిధంగా సమ్మతమయిందో తెలియదు.
వారానికి ఐదు రోజుల పనిదినాలని ముందే అనుకొన్నారు కనుక ఉద్యోగులందరికీ విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాలలో తాత్కాలిక వసతి సమకూర్చి ప్రతీ శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి సోమవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి ఈవిధంగా రైలు నడిపించి ఉంటే అందరికీ సుఖంగా ఉండేది. ఉద్యోగులపై ఒత్తిడి తగ్గేది. పని కూడా వేగంగా జరిగే అవకాశం ఉండేది కదా?
తాజా సమాచారం: ఉద్యోగులు అమరావతి తరలిరావడానికి ఆగస్ట్ 31 వరకు గడువు పొడిగించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారని ఏపీ ఎన్.జి.ఓ. సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు.