చంద్రబాబునాయుడు వర్కింగ్ స్టైల్ భిన్నంగా ఉంటుంది. ఒకప్పుడు ఎన్నికలు వేరు.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు వేరు. అన్ని విధాలుగా సిద్ధం కావాలి. అందుకే చంద్రబాబు అభ్యర్థులకు నాలుగు విభాగాల్లో మేనేజర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఇప్పుడు వారితో పాటు అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులకు ఈ నెల 23న విజయవాడలో ప్రత్యేక వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. ఏ1 కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం జరుగుతుంది. అభ్యర్థులతో పాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వారు ఇప్పటికే నియమించుకున్న అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, పొలిటికల్ మేనేజర్, మీడియా మేనేజర్, సోషల్ మీడియా మేనేజర్లను వర్క్ షాప్‌నకు పిలిచారు. టీడీపీ అభ్యర్థులు ఒక్కొకరు నలుగురు మేనేజర్లను ఏర్పాటు చేసుకోవాలని అధిష్టానం ఇప్పటికే సూచించింది. అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, పొలిటికల్ మేనేజర్, మీడియా మేనేజర్, సోషల్ మీడియా మేనేజర్లను ఏర్పాటు చేసుకోవాలని నిరంతరం వారి నుంచి పార్టీ కార్యాలయం ఫీడ్ బ్యాక్ తీసుకుంటుందని గతంలోనే చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆదేశాల మేరకు వారందర్నీ నియమించుకున్నారు అభ్యర్థులు. ఇప్పుడు అభ్యర్థుల్ని వారి మేనేజర్లందర్నీ వర్క్ షాప్ కి పిలుస్తున్నారు. రాబోయే 2 నెలల ఎన్నికల కార్యాచరణ, పోల్ మేనేజ్మెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ వర్క్‌షాప్‌లో వారికి అవగాహన కల్పిస్తారు. వైసీపీ అభ్యర్థులకు సంబంధించిన ప్రతీ విషయం ఐ ప్యాక్ బృందం చూసుకుంటూ ఉంటుంది. ఎం మాట్లాడాలో .. కూడా వారే చెబుతారు. టీడీపీ దీనికి భిన్నమైన మార్గంలో వెళ్తోంది.