వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్ బ్యాటింగ్ చాలా చాలా స్పెషల్‌గా ఉంటుంది. మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ ఫేస్ చేయడానికి కూడాఇష్టపడని కఠినమైన బౌలింగ్‌ని కూడా లక్ష్మణ్ చాలా క్యాజువల్‌గా ఆడేస్తూ ఉంటాడు. మోరోవర్ శరీరాన్ని కూడా పెద్దగా కదిలించకుండానే కేవలం మణికట్టుతోనే మాయచేసేయగలడు. అన్నింటికీ మించి నిస్వార్థపరుడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయే స్థాయి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ పేరు కోసం, పబ్లిసిటీ కోసం పాకులాడింది చాలా తక్కువ. అలాగే లక్ష్మణ్ ప్రవర్తన కూడా చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది. లక్ష్మణ్ బర్త్ డే సందర్భంగా సచిన్ టెండూల్కర్‌తో సహా చాలా మంది అంతర్జాతీయ క్రికెటర్స్, సెలబ్రిటీస్ అందరూ లక్ష్మణ్‌ని ఎన్నో విధాలుగా ప్రశంసించారు. అయితే ఒక ప్రత్యేకమైన గొప్పతనాన్ని మాత్రం మర్చిపోయారు. అది మరే ఇతర సినిమా, క్రికెట్ సెలబ్రిటీలలో లేనిది, లక్ష్మణ్ ఒక్కడిలో మాత్రమే ఉన్నది.
కాస్తంత పేరు వచ్చిన వెంటనే క్రికెటర్స్ అయినా, సానియా మీర్జా, సింధులాంటి వాళ్ళయినా, మహేష్‌బాబు, అమీర్ ఖాన్‌లాంటి సినిమా సెలబ్రిటీస్ అయినా సరే……..అందరూ కూడా ఎన్ని ఎక్కువ యాడ్స్‌లో యాక్ట్ చేద్దాం, బ్రాండ్ వ్యాల్యూని ఎలా పెంచుకుందాం? ఎన్ని రకాలుగా వచ్చిన పేరుని క్యాష్ చేసుకుందాం? అని ఆలోచించేవాళ్ళే. కానీ మన వంగివరపు వెంకటసాయి లక్ష్మణుడు మాత్రం ఆ విషయంలో కూడా చాలా చాలా ప్రత్యేకం. కూల్ డ్రింక్స్‌ని ప్రచారం చేయమని చెప్పి భారీ ఆఫర్ తన దగ్గరకు వచ్చినప్పుడు, కోట్లాది రూపాయలకు ఆశపడకుండా, కూల్ డ్రింక్స్‌ని ప్రచారం చేయడానికి నిరాకరించాడు మన లక్ష్మణ్. వ్యక్తిగతంగా కూల్ డ్రింక్స్‌ని నేను తాగనని, నేను తాగని వాటిని తాగమని చెప్పి నా అభిమానులకు చెప్పడానికి నా మనసు అంగీకరించదని చెప్పాడు. ఎన్నో మెస్సేజ్‌లు ఇచ్చే పవన్ కళ్యాణ్‌తో సహా కూల్ డ్రింక్స్ యాడ్స్‌కి ప్రచారం చేసిన సెలబ్రిటీస్ ఎందరో. నిజాయితీగా చెప్పుకోవాలంటే ఈ సెలబ్రిటీస్ అందరికీ కూడా ఆరోగ్యంపైన శ్రద్ధ చాలా ఎక్కువ. వాళ్ళలో ఏ ఒక్కరూ కూడా కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడరు. తాగరు కూడా. అయితే అభిమానులను మాత్రం కూల్ డ్రింక్స్ తాగమని ఎంకరేజ్ చేస్తూ….వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేస్తూ….వీళ్ళు మాత్రం కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ ఉంటారు. మళ్ళీ అభిమానులే మా ప్రాణం, అభిమానులను ఎంటర్టైన్ చేయడమే మా జీవితాశయం అనే రేంజ్లో పచ్చిగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. నూటికి తొంభైశాతం మంది ఇలాంటి సెలబ్రిటీస్ ఉన్న మన భారతదేశంలో లక్ష్మణ్‌లాంటి గొప్ప నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు, మానవత్వం ఉన్న సెలబ్రిటీ ఉండడం నిజంగా చాలా చాలా స్పెషల్. అందుకే మన లక్ష్మణుడి ఆ వెరీ వెరీ స్పెషల్ లక్షణాన్ని కూడా మనందరం అభినందించాల్సిందే.