తెలుగు వారికి సంక్రాంతి అంటే పెద్ద పండుగ. సమాజంలో చదువు తక్కువగా ఉన్నప్పుడు చైతన్యం ఎక్కువగా ఉండేది. కానీ చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్లుగా చదువుకున్న వారు పెరిగిపోయిన తర్వాత సంక్రాంతి ఆంధ్రాలో పెద్ద పండుగ… తెలంగాణలో కాదు అని…విభజించేసుకుని పరిమితం చేసేసుకున్నాం. పండగ పెద్దదా చిన్నదా అని కాదు.. పండుగ అంటేనే వేడుక చేసుకోవడం. ఎవరి స్థాయిలో వారు వేడుక చేసుకుంటారు. దానికి ప్రాంతాలు, కులాలు, మతాలు అవసరం లేదు. కానీ రాను రాను కుల, మత , ప్రాంత జాడ్యం పండగులపై ఎక్కువగా పడిపోతోంది.
సంక్రాంతి అనేది పంటలు చేతికి వస్తున్న సమయంలో రైతులు .. రైతు కుటుంబాలు ఆనందంగా చేసుకునే పండుగ. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి రైతు, భూమితో అనుబంధం ఉంటుంది. అంటే ఇది ప్రతి ఒక్కరి పండుగ. ఎవరి స్థాయిలో వారు చేసుకుంటారు.. చేసుకోవాలి. అంతే కానీ.. కులపోడి సినిమా హిట్టయిందని .. వేరే వాళ్లను కించ పర్చడం.. పండగ కాదు. అది దండగ. అలాంటివి ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. పండగ అంటే.. మనం ఆనందంగా ఉండటం.. ఇతరుల్ని ఆనందింపచేయడం. అలా చేయకపోతే కనీసం బాధపెట్టకుండా ఉండాలి.
ఈ సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో జూదమే కనిపిస్తోంది. సంక్రాంతి అంటే జూదమే అన్నట్లుగా మార్చేస్తున్నారు కొందరు. పెద్దగా పండగ సందడి కనిపించడం లేదు. క్లాత్ మార్కెట్లు బోసిపోయాయి. ప్రజల జీవన ప్రమాణాలు దిగజారడం.. నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా పెరిగిపోవడంతో పండగ సంబరాల మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు జీవన ప్రమాణాలను ఎలా మెరుగుపర్చుకోవాలని ప్రజలందరూ ఆలోచించాల్సిన సమయం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాల్సిన సమయం.
సినిమాలు వస్తాయి వెళ్తాయి. అవి చూసి ఆనందించడానికే. రాజకీయ పార్టీలు ఎప్పుడూ ఉంటాయి. కానీ ప్రజలకు వాటి అవసరం ఓట్లు వేసేంత వరకే. వాటి కోసం గొడవలు పెట్టుకునేందుకు కాదు. రాజకీయాలు కూడా అంతే. వాటి కోసం వాదనలు పెట్టుకోవడం దండగ. అలాగే ప్రతీ ఒక్కరికి కులం ఉంటుంది.. ఒక్కరికీ కులం ఆప్షన్ కాదు. ఎంచుకోలేరు. అందుకే ఎవరి కులం తక్కువ కాదు.. ఎక్కువ కాదు. దాన్ని మదిలోనుంచి తీసేయాలి. మతం .. ప్రాంతం కూడా అంతే. వీటన్నింటికీ అతీతంగా మనసును ప్రక్షాళన చేసుకోవడమే.. అసలైన పండుగ.
హ్యాపీ సంక్రాంతి