ఆ చర్చకు ఫుల్ పడిపోయినట్టే ఉంటుంది. కానీ, కొన్నాళ్లు గడిచేసరికి తేలేది ఏంటంటే.. పడింది ఫుల్ స్టాప్ కాదు, కామా మార్కు మాత్రమే అని! తెరాసలో వారసత్వ చర్చ అనేది ఎప్పటికప్పుడు తెరమీదికి వస్తూనే ఉంటుంది. ఇక, ఇప్పుడు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలవైపు వెళ్తున్నారు కదా! దీంతో తెరాసలో మరోసారి వారసత్వ చర్చ మొదలైందని తెలుస్తోంది. నిజానికి, ‘కేసీఆర్ రాజకీయ వారసుడు మంత్రి కేటీఆర్’ అనేది గడచిన ఏడాది కాలంగా అన్యాపదేశంగా ఎస్టాబ్లిష్ అవుతున్న అభిప్రాయం..! బ్రాండ్ హైదరాబాద్ ను ప్రమోట్ చేయడంలోగానీ, మెట్రో రైలు ప్రారంభ కార్యక్రమంలోగానీ, అంతర్జాతీయ సదస్సుల్లోగానీ, ఇవాంకా ట్రంప్ ఇక్కడికి వచ్చినప్పుడుగానీ… ఇలా ప్రముఖ సందర్భాలన్నింటిలోనూ మంత్రి కేటీఆర్ కు చాలా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. సో.. కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే, కాబోయే సీఎం కేటీఆర్ అనే అభిప్రాయం ఇప్పుడు తెరమీదికి ప్రముఖంగానే వస్తోంది.
అయితే, ఇదే క్రమంలో గమనించాల్సిన మరో అంశం ఏంటంటే… కేటీఆర్ ఎంత త్వరగా అయితే ప్రమోట్ అవుతూ తెరమీదికి వచ్చారో, అంతే వేగంగా మరో మంత్రి హరీష్ రావు కూడా తెరవెనక్కి నెట్టబడ్డట్టుగా కనిపిస్తున్నారని చెప్పక తప్పదు..! కేసీఆర్ వారసులు ఎవరూ అంటే కేటీఆర్ కు సమానంగా హరీష్ రావు పేరు వినిపించేది. నిజానికి, కేసీఆర్ వ్యూహకర్త అయితే… ఆ వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత హరీష్ మీద ఉండేది. కానీ, గడచిన కొంతకాలంగా ఆయన ప్రముఖంగా కనిపించడం లేదు..! ఆ మధ్య హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రారంభోత్సవం జరుగుతుంటే… హరీష్ ఢిల్లీలో ఉన్నారు. తాజాగా, ప్రధాని మోడీపై కేసీఆర్ విమర్శలు చేశారని రచ్చ జరుగుతుంటే.. ఈ అంశంపై హరీష్ స్పందించిన దాఖలాలు లేవు. అంతెందుకు, ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన కేసీఆర్ మూడో ఫ్రెంట్ గురించి కూడా హరీష్ స్పందించిందీ లేదు..!
దీంతో ఇప్పుడు హరీష్ రావుపై తెరాస వర్గాల్లో చాలా చర్చే జరుగుతోందట..! వచ్చే ఎన్నికల్లో హరీష్ ఎక్కడ్నుంచీ పోటీ చేస్తారనే అంశంపై కూడా తీవ్ర అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందనే తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సిద్ధిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేసీఆర్ మళ్లీ సిద్ధిపేట్ వచ్చి పోటీ చేస్తారనీ, లేదూ.. నల్గొండ నుంచి పోటీ చెయ్యొచ్చనీ కూడా కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, కేసీఆర్ ఢిల్లీకి వెళ్తూవెళ్తూ తనతోపాటు కొంతమంది కీలక నేతల్ని వెంట తీసుకెళ్లేందుకు అనుకూలంగా, వారికి ఎంపీ టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారమూ జరుగుతోంది. ఆ జాబితాలో హరీష్ రావు పేరు ప్రస్తుతానికైతే లేదనే చెబుతున్నారు. సో.. రాబోయే రోజుల్లో తెరాసలో కేటీఆర్ పాత్ర ఏంటనేది దాదాపు స్పష్టంగానే ఉందనీ, హరీష్ సంగతే ఇంకా స్పష్టత రావాల్సి ఉందనే అభిప్రాయం తెరాస వర్గాల్లో వినిపిస్తోంది.