నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగష్టు18న తైపేలో జరిగిన విమానప్రమాదంలో మృతి చెందిన మాట నిజమేనని ఆయన ఫైళ్లపై పనిచేస్తున్న బోస్‌ఫైల్స్.ఇన్ఫో అనే ఒక బ్రిటిష్ వెబ్సైట్ వెల్లడించింది. నేతాజీ మరణించలేదని తర్వాత రష్యాలోనూ ఇండియాలోనూ వున్నాడనీ చెప్పే మాటలు నిజం కాదని ఈ తాజాసమాచారం స్పష్టం చేస్తున్నది. ఇప్పటికైనా ఈ కథనాలు విరమిస్తే మంచిదని ఆ సంస్థ సూచించింది. ఆ రోజున విమానం వియత్నాంలోని ఒక స్థావరం నుంచి బయిలుదేరిన కొద్దిసేపటికే రన్‌వేనుంచి వందమీటర్ల దూరంలో ప్రమాదానికి గురి కావడం మంటలు రేగడం చూశామని అప్పటి ఇంజనీర్ కెప్టెన్ నకుమారాతో పాటు జపాన్ సైనికాధికారులు సాక్ష్యాలు ఇచ్చారు. నేతాజీ విమానం పెట్రోలు ట్యాంకరుకు దగ్గరగా కూచుని వున్నందువల్ల త్వరగా ఆయన దేహంకాలిపోయిందని వారు అభిప్రాయపడ్డారు. ఆయన వళ్లు కాలిపోతుంటే సహాయకులు కోటు తొలగించడం తాను చూశానని లెఫ్టినెంట్ కర్నల్ షిరో నొనోగోకి అనే కమాండర్ చెప్పారు. ఇలాగే కోనో, నకుమారలతో పాటు ఐఎన్ఎ కర్నల్ రహమాన్ కూడా తమ తమ సాక్ష్యాలు నమోదు చేశారు. అయితే ప్రమాదం జరిగిన 11 ఏళ్ల తర్వాత వారు చెప్పిన విషయాలలో కొన్ని తేడాలు వున్నా అది సహజమేనని కూడా నిపుణులు భావించారు. చివరి క్షణం వరకూ తాను దేశం కోసం పోరాడానని భారతీయులకు చెప్పవలసిందిగా ఆయన హిందీలో చివరి మాటలు చెప్పినట్టు కూడా వారు ధృవీకరించారు. ఒకటికి రెండుకమీషన్లు విచారణ జరిపిన తర్వాతనే ఆయన మరణించారని నిర్ధారణకు వచ్చారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ తన ఆహ్వానంపై విందుకు వచ్చిన నేతాజీ కుటుంబసభ్యులకు ఆయనకు సంబంధించిన ఫైళ్లు తొలివిడతగా అందజేశారు. 1991-1995 మధ్య భారత రష్యాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు అందులో వున్నాయి. ఆయన రష్యాకు రాలేదని ఆ దేశం తరపున రాసిన సమాచారం వుంది. చైనా కూడా ఈ మేరకు గతంలోనే వివరణ ఇచ్చింది. నేతాజీ మరణించలేదనే కథనం ఒకటైతే ఆయన చైనా రష్యాలలో చంపివేయబడినట్టు చెప్పేవి కూడా కట్టుకథలేనని కూడా ఈ ఫైళ్లు తేల్చివేస్తున్నాయి. వాస్తవానికి ఆ రోజుల్లో రష్యా చైనాలు బ్రిటన్‌కు చాలా వ్యతిరేంకగా వున్నాయి. కనుక నేతాజీని వ్యతిరేకించాల్సిన అవసరమే వాటికి లేదు. ఎవరో అమెరికా బ్రిటిష్ గూఢచారులు కథనాలుగానే ఇవన్నీ చలామణిలోకి వచ్చాయి. బహుశా అప్పట్లో ఇండియా మరీ ముఖ్యంగా నెహ్రూ, ఇందిరాగాంధీలు అప్పటి సోవియట్ యూనియన్‌కు దగ్గరగా వుండటం వల్లనే ఇలాటి కథనాలు ప్రచారంలో పెట్టి వుండొచ్చు. పైగా ప్రచ్చన్న యుద్ధ కాలంలో ప్రతిదీ ఒక వివాదంగా విభిన్న తరహా కథలు వినిపించేవని మర్చిపోరాదు. ఎవరో భారత సైనిక ఖైదీ తనకు మరెవరో రష్యన్ చెప్పినట్టు ఇచ్చిన వాంగ్మూలం మినహా ఈ కథనాలకు వేరే ఆధారం లేదు. దీనిపై విడుదల చేసిన ఫోటోల్లోనూ స్పష్టత లేదు. ఇక యుపిలో గుమ్నాం బాబాగా నేతాజీ చిరకాలం చాలాకాలం రహస్యంగా గడిపాడనే కథలను ఎవరూ తీవ్రంగా తీసుకోవడం లేదు.
నేతాజీ అంటే ఈ దేశంలో అత్యధికులకు అమిత గౌరవం. ఆరాధన.అయితే ప్రమాదంలో ఆయన మరణించివుంటారని నమ్మడానికి ఈ గౌరవం అడ్డంకి కాకూడదు. ఇంత ఆధునిక కాలంలోనూ దేశాల నేతలే విమాన ప్రమాదాల్లో మరణిస్తుంటే 70 ఏళ్ల కిందట రహస్య ప్రయాణం( అది కూడా జపాన్నియంతల అధీనంలోది) లో ప్రమాదం జరగడంలో ఆశ్చర్యమేమీ లేదు. మరో విధమైన ఆధారాలు కూడా ఎ వరిదగ్గర లేవు. కనుక నేతాజీ సృతిని అగౌరవ పరిచే ఈ నిరాధార చర్చకు తెరదింపితే మంచిది. అయితే ఆయన కుటుంబ సభ్యులపై నిఘా వేయడం నిస్పందేహంగా ఖండనార్హమే. భవిష్యత్తులో మరెవరిపైనా అలాటి నిఘాలు జరక్కుండా కట్టుదిట్టాలు తీసుకోవాల్సిందే. మరోవైపున తాము రాజకీయ కారణాలతో ప్రారంభించిన ఈ చర్చపై అధికారికంగా వివరణ ఇచ్చిముగించాల్సింది కూడా ప్రభుత్వమే. కాని పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు రానున్న దృష్ట్యా రాజకీయ పార్టీలు నేతాజీ చర్చ అప్పుడప్పుడే ఆపకపోవచ్చు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇప్పటికే దీన్నొక ఎన్నికల సమస్యగా చేసిలబ్డి పొందవచ్చనే ఆలోచనలో వున్నారు. ఆమె కూడా 1200 పేజీల రహస్య ఫైళ్లు విడుదల చేశారు గాని అందులో నిజంగా రహస్యాలేమీ లేవు. పత్రిక క్లిప్పింగులు ఉత్తరాలే వున్నాయి. ఆ పార్టీకే చెందిన ఎంపి నేతాజీ మనవరాలు కృష్ణబోస్ కూడా ఆయన మరణించాడనే నమ్ముతున్నారు. బెంగాల్లో మరో ప్రధాన పార్టీ అయిన సిపిఎం వామపక్ష ఫ్రంట్ ఈ భావాలను ఆమోదించకపోయినా సూటిగా ఖండించడం జరగదు. దీనిపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని వామపక్ష ప్రభుత్వం గతంలో శాసనసభ తీర్మానం ద్వారా కోరి వుంది. నెహ్రూ వారసత్వంపై దాడి చేసేందుకు సర్దార్‌పటేల్‌తో పాటు నేతాజీ కూడా ఉపయోగపడతారని భావిస్తున్న మోడీ ప్రభుత్వం ఎలాగూ ఈ వివాదాన్ని సజీవంగానే వుంచుతుంది. కనక వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకూ దీనిపై రకరకాల కథనాలు వస్తూనే వుంటాయి.