నందమూరి నటసింహం బాలకృష్ణతో ‘చెన్నకేశవరెడ్డి’ తీశారు గాని ‘బాల కేశవ రెడ్డి’ తీయలేదే? అనుకుంటున్నారా.. అక్కడే వుంది రాజకీయం. ఈ మూడు పదాలను విడివిడిగా చూడాలి. బాల అంటే బాలయ్య. కేశవ అంటే పయ్యావుల కేశవ్. రెడ్డి అంటే పల్లె రఘునాథరెడ్డి. చంద్రబాబు నాయుడు మంత్రివర్గ మార్పుల్లో ఈ ముగ్గురి ఈక్వేషన్స్ పెద్ద సమస్యగా మారుతున్నాయి.
ఒక్కరోజైనా ముఖ్యమంత్రి కావాలనుకున్న బాలకృష్ణ కనీసం మంత్రి పదవైనా ఇవ్వకపోతే వూరుకోరని తేలిపోయింది. అదే జిల్లాలో కేశవ్ చాలా కాలంగా పదవీ నిరీక్షితుల జాబితాలో ప్రథములుగా వున్నారు. ఇప్పటికే ఆ జిల్లా నుంచి పరిటాల సునీత మంత్రిగా కొనసాగుతున్నారు. మరి ఒకే వర్గానికి చెందిన ముగ్గురికి పదవి నివ్వడం జరగదు. కనక ఈమెను తగ్గించడం లేదా కేశవ్‌ను పక్కనపెట్టడం ఏదో ఒకటి సంభవం.
ఆ తర్వాత రఘునాఘరెడ్డిని తగ్గిస్తే అసలే అంతంత మాత్రంగా వున్న ఆ వర్గానికి ప్రాతినిధ్యం తగ్గుతుంది. పోనీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఆరోగ్యం వయస్సు వంటి కారణాలతో తగ్గించవచ్చునా? అప్పుడు భూమా నాగిరెడ్డి వంటి వారినెవరినైనా తీసుకుంటే వైకాపానుంచి వచ్చేవారిని సంతృప్తిపరిచినట్టు వుంటుంది కదా.
మరి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వంటివారి మాటేమిటి? సునీతను తగ్గిస్తే పరిటాల సెంటిమెంటు…బాలయ్యను కాదంటే నందమూరి సెంటిమెంటు…
ఇది గాక ముస్లింను తీసుకుంటామన్నప్పుడు జలీల్ ఖాన్ అవుతారా లేక అనంతపూర్ ఎంఎల్‌సి షరీఫ్‌ను ఎంపిక చేస్తారా? ఉన్నదే ఇద్దరు గనక మరో మార్గం లేదు. షరీఫ్‌ను తీసుకుంటే అప్పుడు అనంతపురం కోటాలో చూపించి మిగిలిన సమస్యల నుంచి బయిటపడొచ్చా?
రావెల కిశోర్ బాబును తగ్గించి కొత్తవారికి అవకాశం ఇవ్వడం మంచిదే గాని ఆయన సుజనా చౌదరి మనిషి గనక ఎలా వుంటుందో. కాపులు తదితర తరగతులు నుంచి కూడా ప్రాతినిధ్యం పెంచాలి. ఈ తతంగానికి బాగానే సమయం పట్టొచ్చు. అప్పటి వరకూ వూహాగానాలే!