సిఎల్పీ లీడర్‌గా ఎన్నికైన శశికళకు తమిళనాడు గవర్నర్ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై చాలానే విమర్శలు వస్తున్నాయి. బిజెపి నాయకుడైన విద్యాసాగర్‌రావు గవర్నర్ విధులను కూడా మోడీకి నచ్చినట్టుగా, మోడీ చెప్పినట్టుగా నిర్వహిస్తున్నాడా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. తమకు అవసరమైనప్పుడల్లా అభివృద్ధి భారతదేశం-అవినీతికి దూరం లాంటి స్టేట్మెంట్స్ని రాజకీయాల కోసం వాడుకునే బిజెపి నేతలు….ఇప్పుడు కూడా శశికళపైన ఉన్న కేసుల గురించి భారీగా ప్రచారం జరిగేలా చేస్తున్నారు. తోచినట్టుగా మాట్లాడుతున్నారు. శశికళ అవినీతిపరురాలు కాబట్టే….ఆమెకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండా చేస్తున్నట్టుగా బిజెపి నేతలు ఫోజులు కొడుతున్నారు. కానీ రెండున్నరేళ్ళ బిజెపి పాలనాశైలిని చూస్తే ఈ మాటలను మాత్రం ఎక్కువ మంది నమ్మే అవకాశం లేదు.
జయలలితకు హై కోర్టులో క్లీన్ చిట్ ఎలా వచ్చింది అనే విషయంపై బిజెపి మాట్లాడదు. ప్రధానమంత్రి అవకముందు నుంచి మోడీతో సన్నిహిత సంబంధాలున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నిర్దోషిగా బయటకు రావడానికి కారణం ఏంటి? అలాగే జగన్ కేసుల విషయంలో కూడా ఏదేదో చేస్తామని ఎన్నికల ప్రచారం సమయంలో బిజెపి, టిడిపిలు చెప్పాయి. జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకుని రుణమాఫీలు చేసేస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు. బిజెపి, టిడిపిలు కలిసే పోటీచేశాయి కాబట్టి చంద్రబాబు చెప్పిన మాటలకు బిజెపికి కూడా బాధ్యత ఉంటుంది. మరి జగన్ కేసుల విషయంలో ఎందుకు స్పీడ్ లేదు? ప్రత్యేక హోదాలాంటి విషయాల్లో కూడా మోడీని పల్లెత్తు మాట కూడా అనకుండా ఉంటున్నాడు కాబట్టా? అదే శశికళ కూడా మోడీ భక్తురాలు అయి ఉంటే పునీతురాలు అయిపోయేదిగా? అప్పుడు గవర్నర్ అపాయింట్ దొరకడమేంటి? శశికళ ప్రమాణ స్వీకారానికి మోడీవారు కూడా వేంచేసి ఉండేవారేమో? కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయాలు కూడా ఇవేగా? ప్రత్యర్థులను తొక్కడానికి మాత్రమే కేసులను వాడుకోవడం, తప్పులు చేసినప్పటికీ అనుయాయులకు మాత్రం శిక్షలు పడకుండా చేసి అందలమెక్కించడం. మరి అవినీతి విషయంలో కాంగ్రెస్‌ని ఈసడించుకునే బిజెపికి, కాంగ్రెస్‌కి తేడా ఏముంది? నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్‌తో సహా రాజకీయ నాయకుల అందరిపైన ఉన్న కేసులన్నింటి విషయంలో కూడా సత్వరమే విచారణ జరిగి….శిక్షలు పడేలా చేస్తే అప్పుడు బిజెపివారికి అవినీతి మకిలి అంటకుండా ఉంటుంది. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే అర్హత ఉంటుంది. అంతేగానీ పన్నీరు సెల్వం భక్తుడు అయిపోయాడు కదా అని చెప్పి….ఆయన ప్రత్యర్థి అయిన శశికళ అవినీతి కేసుల గురించి మాత్రమే మాట్లాడితే ……రాజకీయ స్వార్థం కోసం వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్న అపవాదు మాత్రమే మిగులుతుంది. కాంగ్రెస్‌కి, బిజెపికి తేడాలేదన్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది.