‘సలార్’తో మరో సూపర్ హిట్టు కొట్టాడు ప్రభాస్. ఇప్పుడు తన దృష్టంతా క’ల్కి’, ‘రాజాసాబ్’లపై ఉంది. రెండింటికీ తన కాల్షీట్లు పంచుతున్నాడు. రాజాసాబ్ చిన్న చిన్న షెడ్యూల్స్‌తో మెల్లగా పుంజుకొంటోంది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ఈరోజు నుంచి హైదరాబాద్ లో ప్రారంభమైంది. హీరోయిన్లు, కమెడియన్లతో కొన్ని సరదా సన్నివేశాల్ని లాగించేస్తున్నాడు మారుతి. రెండు మూడు రోజుల్లో ప్రభాస్ కూడా ఈ సెట్లో అడుగు పెట్టబోతున్నాడు.
మారుతి సినిమాలన్నీ సరదాగా సాగిపోతుంటాయి. చిన్న చిన్న ఎమోషన్స్‌ని ఆయన బాగా హ్యాండిల్ చేస్తారు. అయితే… రాజా సాబ్ లో మాత్రం ట్విస్టులు, టర్న్‌లు అదిరిపోనున్నాయని టాక్. ముఖ్యంగా సెకండాఫ్ ని మారుతి చాలా బాగా తీర్చిదిద్దాడట. ఇటీవల ప్రభాస్‌కి సెకండాఫ్ మరోసారి నేరేట్ చేస్తే… ప్రభాస్ స్పెల్ బౌండ్ అయిపోయాడని టాక్. క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతోందని, ప్రభాస్ నయా అవతార్ అభిమానుల్ని సైతం సర్ప్రైజ్ చేస్తుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా మారుతిపై ఎంటర్టైన్మెంట్ ముద్ర గట్టిగా పడిపోయింది. ఈ సినిమాలో అది అందిస్తూనే ఓ కొత్త ఇమేజ్‌ని సంపాదించుకోవడానికి మారుతి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అది వర్కవుట్ అయితే, దానికి ప్రభాస్ ఇమేజ్, స్టార్ డమ్ కలిసొస్తే.. ‘రాజాసాబ్’ లెక్క వేరేలా ఉంటుంది. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే సన్నాహాల్లో ఉంది నిర్మాణ సంస్థ.