ఆధ్యాత్మిక సంస్ధల ఆస్ధుల్ని ఆక్రమించిన మాఫియాలకు అధికారంలో వున్న రాజకీయపార్టీల వత్తాసు తోడైతే దారుణాలే కాదు యుద్ధాలు కూడాజరుగుతాయని మథుర హింసా కాండ దేశమంతటినీ హెచ్చరిస్తున్నది.
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో పోలీసులకూ, స్థలం ఆక్రమణదారులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులతో సహా 29 మంది మరణించిన విషాదం ఆశ్చర్యాన్ని ఆందోళననూ మిగులుస్తున్నది.
కృష్ణుడి జన్మభూమి అయిన మధురలోనూ ఇంకా ఉత్తరప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లోనూ తులసీదాస్ మహారాజ్ అనే ఆత్యాత్మిక గురువుకి వేలఎకరాల భూములు వున్నాయి. విలాసవంతమైన ఆ బాబా రియల్ ఎస్టేట్, ఇతర ఆస్ధుల విలువ 12 వేల కోట్ల రూపాయలు. ఆయన ముఖ్యశిష్యుడైన రామ్ వృక్ష్ యాదవ్ ది విపరీతమైన ప్రవర్తన. దాన్ని భరించలేక యాదవ్ తో బాబా పదేళ్ళక్రితమే తెగతెంపులు చేసుకున్నాడు. 2012 లో బాబా మరణించారు. దీంతో బాబా ఆస్ధుల్లో హెచ్చుభాగం యాదవ్ వశమైపోయాయి.
అంతటితో ఆగకుండా యాదవ్ ‘ఆజాద్ భారత విధిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’ అనే సంస్ధను స్ధాపించాడు. నేతాజీ సుభాస్ చంద్రబోస్‌కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బహిర్గతం చేయడం, రాష్ట్రపతి ప్రధాని ఎన్నికలను రద్దుచేయడం, ఆజాద్ హిందూ ఫౌజ్ కరెన్సీని దేశ కరెన్సీగా గుర్తించడం, ప్రతి వ్యక్తికీ 60 లీటర్ల పెట్రోల్, 40 లీటర్ల డీజిల్‌ను చెరో రూపాయికే ఇవ్వడం, దేశ శాంతిభద్రతలకూ, పౌరుల పౌరసత్వానికి సంబంధించిన డాక్యుమెంట్లను బహిర్గతం చేయడం మొదలైనవి ఈ సంస్ధ డిమాండ్లు. వీటిసాధన కోసం డిల్లీలో ధర్నాచేయడానికి రెండేళ్ళక్రితం బయలుదేరిన సత్యాగ్రహులను మథురలో పోలీసులు నిలిపి వేశారు. వారంతా అక్కడ 260 ఎకరాల పార్కులో తిష్టవేశారు. తాత్కాలిక నివాసాలు కట్టుకున్నారు. రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటూ అక్కడే నివశిస్తున్నారు.
హైకోర్టు ఆదేశాల ప్రకారం వారిని ఖాళీ చేయించడానికి సివిల్ అధికారులు పోలీసు బలగాలతో గురువారం అక్కడికి వెళ్ళినపుడు వారు ప్రతిఘటించి దాదాపు యుద్ధమే జరిగింది. కత్తులు, తుపాకులు, బాంబులతో పోలీసులపై వారు తిరగబడి ఒక ఎస్పీ స్థాయి వ్యక్తిని కూడా బలితీసుకున్న వైనం మధుర ప్రాంతంలోని బాబాలు, భూ కబ్జాదారుల దాష్టీకానికి అద్దం పడుతున్నది. హైకోర్టు ఆదేశాల మేరకు జవహర్‌బాగ్ వద్ద ఆక్రమణదారుల గుప్పిట్లో ఉన్న 260 ఎకరాల పార్కు స్థలాన్ని విడిపించడానికి వెళ్ళిన పోలీసులు ఇంతటి భయానకమైన ప్రతిదాడిని చవిచూస్తే, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా వారినే విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఆక్రమణదారుల దగ్గర మారణాయుధాలు, గ్రెనేడ్లు, ఇంత భారీస్థాయి పేలుడు పదార్థాలు ఉన్నాయని తనకు తెలియదని ముఖ్యమంత్రి అంటున్నారు. మాకు తెలుసు కానీ, మాపైనే ఇంతకు తెగిస్తారని అనుకోలేదని పోలీసులు అంటున్నారు.
ఈ స్థాయిలో కాకున్నా, రెండేళ్ళుగా సాగుతున్న వివాదమే ఇది. న్యాయస్థానాలు హెచ్చరిస్తున్నప్పుడల్లా అత్యంత ఖరీదైన ఆ ప్రాంతాన్ని విముక్తం చేయడానికి పోలీసులు పోతూ, వారు ప్రతిఘటించగానే తిరిగి వచ్చేయడం జరుగుతూనే ఉన్నది. ధర్నా పేరుతో మూడువేల మంది, ప్రధానంగా యాదవులు, ఈ పార్కులో తాత్కాలిక నిర్మాణాల్లో తిష్ఠవేశారు. ‘ఆజాద్ భారత విధిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’, ‘స్వాధీన భారత్ సుభాష్ సేన’ పేర్లతో రెండు గ్రూపులు ఈ పార్కును ధర్నా పేరిట ఆక్రమించుకున్నాయి.
ఇక్కడ పేరుకు రెండు గ్రూపులున్నా పోలీసులు చెబుతున్న ప్రకారం వారి నాయకుడు రామ్‌వృక్ష్ యాదవ్ ఒక్కడే! ఈ నాయకుడు తన అంగరక్షకులతో పాటు పారిపోయాడు. ఇతను బాబా నుంచి విడిపోయాక మరింత బలంగా నిలదొక్కుకోవడానికి ములాయం సింగ్ తమ్మడి అండదండలే సమృద్ధిగా సహకరించాయని అంటున్నారు. యాదవ్ పారిపోలేదని ఘర్షణల్లో చనిపోయాడని పోలీసులు తాజాగా ప్రకటించారు.
ప్రస్తుత రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చివేయాలంటూ రామ్‌వృక్ష్ యాదవ్ స్థానిక యువకులకు ఆయుధ శిక్షణ ఇస్తున్నాడు. వెయ్యిమంది పోలీసులు పార్కును చుట్టుముట్టినప్పుడు చెట్లకొమ్మల్లో దాక్కుని అతని అనుచరులు వారిపై కాల్పులు జరపడం, బాంబులు విసరడం, చివరకు గ్యాస్ సిలండర్లను కూడా మారణాయుధాలుగా ఉపయోగించడం ఈ సత్యాగ్రహుల హింసాత్మక ఆలోచనా విధానానికి అద్దంపడుతున్నది.
ఎన్నికలు సమీపిస్తున్న ఉత్తరప్రదేశలో ఈ దారుణ హింస ప్రభావం కాదనలేనిది. ఇప్పటికే పలు సంఘటనలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ అఖిలేష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బిజెపికి, ప్రతిపక్షాలకు ఇది తగిన సమయంలో అందివచ్చిన మరో ఆయుధం.