మహారాష్ట్ర రాజకీయాలను బీజేపీ ఊహించని మలుపులు తిప్పుతోంది. ఇప్పటికే శివసేనను పూర్తిగా చీలిపోయేలా .. ఆ వర్గపు నేతను ముఖ్యమంత్రిని చేసేసిన బీజేపీ…. ఎన్సీపీ సంగతి తేల్చింది. శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ … పార్టీని చీల్చేశారు. 29 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వంలో చేరిపోయారు. ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. విషయం బయటకు తెలిసే సరికి మొత్తం కథ అయిపోయింది. అజిత్ పవార్ తో పాటు మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వీరిలో సగం మందికిపైగా ఫిరాయించారు. అయితే వీరిపై అనర్హతా వేటు చట్టం వర్తిస్తుంది. కానీ స్పీకర్ అధికార పార్టీ వారే కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటారన్నది కీలకం. అజిత్ పవార్ పై కొంత కాలంగా తిరుగుబాటు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయనకు పార్టీలో ఏ పదవులు లేకుండా తీసేశారు. పవార్ కుమార్తె సుప్రియా సూలేకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇచ్చారు. అయితే పవార్ అదను చూసి దెబ్బకొట్టారు. మరో చాయిస్.. డ్రామాకు తేడా లేకుండా నేరుగా వెళ్లి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదంతా బీజేపీ ఆడిస్తున్న ఆట అని స్ఫష్టంగా తెలుస్తూనే ఉంది. అయితే ఇందులో బీజేపీ మాత్రం వెనుకే ఉంటోంది. ముందుగా శివసేన, ఎన్సీపీలను చీల్చింది. వారితో ప్రభుత్వాలను నడిపిస్తోంది. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ ఉన్నారు. ఆయనే ప్రభుత్వాన్ని అనధికారికంగా నడుపుతున్నప్పటికీ ఆయన పాత్ర పరిమితంగానే ఉంది. ఇప్పుడు మహారాష్ట్రకు ఇద్దరు డిప్యూటీ సీఎంలు అవుతారు. రేపు చేపట్టబోయే కేంద్రమంత్రి వర్గ విస్తరణలో ఫడ్నవీస్ ను కేంద్రమంత్రిని చేసినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.