వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో చేరేందుకు రంగం సిద్దమయిందా..? రెండు రోజులుగా.. బీజేపీ వర్గాలతో.. తీరిక లేకుండా జరుగుతున్న చర్చల సారాంశం ఓ కొలిక్కి వచ్చిందా..? అమిత్ షాతో భేటీ తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారా..? అంటే.. అవుననే అంటున్నాయి… ఢిల్లీ బీజేపీ వర్గాలు. ఎన్డీఏలో చేరిక కోసమే.. వైఎస్ జగన్కు… మోడీ అపాయింట్మెంట్ ఖరారు చేసి..ఢిల్లీకి పిలిపించారని.. అక్కడ.. మోడీ ఆహ్వానాన్ని జగన్ మన్నించారని…తెలుస్తోంది. అమిత్ షాను కలిసి మిగతా విషయాలు చర్చించాలని మోడీ సూచించడంతో.. ాయన శుక్రవారం.. ఢిల్లీకి వెళ్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకు.. అమిత్ షాతో భేటీలో.. ఎన్డీఏలో వైసీపీ చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
త్వరలో కేంద్రమంత్రివర్గాన్ని విస్తరించాలని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుకుంటున్నారు. కొన్ని ఖాళీల భర్తీతో పాటు.. కొంత మంది మంత్రులకు ఉద్వాసన చెప్పాలనుకుంటున్నారు. అదే సమయంలో… దేశంలో.. కేంద్రమంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఒకే ఒక్క రాష్ట్రం ఏపీ. ఏపీకి కూడా… కేంద్రమంత్రి పదవిని ఇవ్వాలనుకుంటున్నారు. అదే సమయంలో.. ఎన్డీఏను మరింత బలోపేతం చేయాలనుకుంటున్నారు. ముఫ్పై ఏళ్లుగా నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న శివసేన.. ఎన్డీఏ నుంచి వెళ్లిపోయింది. దాంతో.. బీజేపీ తర్వాత మరో బలమైన పార్టీ లేకుండా పోయింది. జేడీయూ మినహాయిస్తే అన్నీ చిన్నా చితకా పార్టీలే. వైసీపీని కలుపుకుంటే.. అటు రాజ్యసభలోనూ.. కలసి వస్తుందని… ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాల జాబితాలో మరొకటి చేరుతుందని… దక్షిణాదిలో పాగా వేయడానికి ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని.. అందులో.. వైసీపీ చేరుతుందని ఢిల్లీ వర్గాలు ఖరారు చేస్తున్నాయి.
అందుకే.. వైసీపీని కేంద్రమంత్రివర్గంలో చేర్చుకోవాలనుకున్నట్లుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి చాలా కాలంగా బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయన లక్ష్యం కేంద్రమంత్రి పదవి అని కూడా… చెబుతున్నారు. కొన్నాళ్లుగా జరుగుతున్న వ్యవహారాలను పరిశీలిస్తే.. ఎన్డీఏలో వైసీపీ చేరాలని.. మోడీ, అమిత్ షా ఆహ్వానిస్తే… తిరస్కరించే పరిస్థితి జగన్, విజయసాయిరెడ్డిలకు ఉండదు.