ఆంధ్రప్రదేశ్ లో వాహన కొనుగోలుదార్లకు శుభవార్త. డీలర్ల వద్దే కొత్త వాహనాలకి ఆన్-లైన్ ద్వారా శాశ్విత రిజిస్ట్రేషన్ చేయించుకొనే వెసులుబాటు రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుండి అమలులోకిరాబోతోంది. మొదట ప్రయోగాత్మకంగా ఈ ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని విశాఖలో అమలుచేసి పరిశీలించి చూస్తారు. అది విజయవంతం అయితే వెంటనే రాష్ట్రంలో అన్ని జిల్లాలలోను అదే విధానాన్ని అమలుచేస్తామని రాష్ట్ర రవాణాశాఖ కమీషనర్ ఎన్.బాలసుబ్రమణ్యం మీడియాకి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రజలకు సౌకర్యవంతంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇంతవరకు డీలర్ల వద్దే కొత్త వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు శ్వాసిత రిజిస్ట్రేషన్ కూడా చేయగలిగితే వాహన యజమానులు రవాణాశాఖ కార్యాలయం చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రేపు ఈ నూతన విధానాన్ని ప్రారంభించే అవకాశం ఉందని కమీషనర్ బాలసుబ్రమణ్యం చెప్పారు. డ్రైవింగ్ లైసెన్సుల పొందేందుకు నిర్వహించే పరీక్షల కోసం త్వరలో కియోస్క్ లను ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించే ట్రాక్ ల వద్ద రవాణాశాఖ అధికారి అభ్యర్ధుల తప్పొప్పులను పరీక్షిస్తుంటారు. దాని కోసం డ్రైవింగ్ ట్రాక్ ల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ విధానాన్ని మొదట విజయవాడలో ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు.