ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నియోజక వర్గమయిన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఒక ప్రధాన కూడలిలో రోడ్డు పక్కన గల ఒక కాలువలో వందల సంఖ్యలో కల్తీ మద్యం సీసాలు, వాటిపై అంటించేందుకు ప్రముఖ మద్యం కంపెనీల లేబుళ్ళు, మూతలను సీల్ చేసే యంత్రం, ఇతర సామాగ్రిని స్థానిక ప్రజలు కనుగొని పోలీసులకి సమాచారం అందించారు. వారు ఎక్సయిజ్ శాఖ అధికారులకి ఆ విషయం తెలియజేయడంతో ఎక్సయిజ్ అధికారులు తక్షణమే అక్కడికి చేరుకొని వాటన్నిటినీ స్వాధీనం చేసుకొన్నారు. పోలీసులు పిర్యాదు నమోదు చేసుకొని అవి ఎక్కడి నుంచి వచ్చేయో ఆరా తీస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణుకి చెందిన స్వర్ణా బార్ అండ్ రెస్టారెంట్ లో కల్తీ మద్యం త్రాగి ఐదుగురు అక్కడికక్కడే మరణించడంతో ఎక్సయిజ్ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా తనికీలు నిర్వహిస్తున్నారు. బహుశః ఆ భయంతోనే కల్తీ మద్యం తయారు చేస్తున్నవారెవరో వీటన్నిటినీ బయటపడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు బయటపడిన ఈ కల్తీ మద్యం సీసాలు జిల్లాలో ఇంకా ఎక్కడో రహస్యంగా కల్తీ మద్యం తయారవుతున్నట్లు చాటిచెపుతోంది. విజయవాడలో కల్తీ మద్యం బయటపడింది కనుక ఎక్సయిజ్ అధికారులు కృష్ణా జిల్లాలో గట్టిగా తనికీలు చేపట్టగానే కల్తీ మధ్య తయారీదారులు వారంతటవారే కల్తీ మద్యం సీసాలు వగైరాలను బయటపడేశారు. అదేవిధంగా ఎక్సయిజ్ అధికారులు రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలో తనికీలు నిర్వహించి కల్తీ మద్యం తయారుచేయకుండా నివారించగలిగితే ప్రభుత్వానికి అప్రదిష్ట కలగకుండా నివారించగలుగుతారు.