SPY movie review
తెలుగు360 రేటింగ్ : 2.5/5
నిఖిల్ కి కార్తికేయ2తో పాన్ ఇండియా విజయం దక్కింది. తను ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధించి పెట్టింది ఆ చిత్రం. అదే జోష్ లో పాన్ ఇండియా కంటెంట్ పై దృష్టి పెట్టిన నిఖిల్.. సుభాస్ చంద్ర బోస్ జీవిత రహస్యాలని ఆసక్తి రేకెత్తిస్తూ ‘స్పై’ సినిమా చేశాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఎడిటర్ గా చేసిన గ్యారీ బిహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. ప్రచార చిత్రాలు ఆసక్తిని కలిగించాయి. మరి ఆ ఆసక్తి సినిమాలో కొనసాగిందా ? నిఖిల్ కి మరో పాన్ ఇండియా విజయం దక్కిందా ?
ఖాదర్ ఖాన్ (నితిన్ మెహతా) ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. భారతదేశంపై న్యూక్లియర్ ఎటాక్ ని ప్లాన్ చేస్తాడు. ఈ మిషన్ ని అడ్డుకోవానికి రా ఏజెంట్ జై( నిఖిల్) రంగంలో దిగుతాడు. జై అన్నయ్య సుభాస్ (ఆర్యన్ రాకేశ్) కూడా రా ఏజెంట్. ఒక ఆపరేషన్ లో మిస్టీరియస్ గా ప్రాణాలు కోల్పోతాడు. ఖాదర్ ని పట్టుకోవానికి యాక్షన్ లోకి దిగిన నిఖిల్ అండ్ టీంకు మరో టాస్క్ వచ్చి పడుతుంది. ‘రా’ లో భద్రంగా ఉండాల్సిన నేతాజీ సుభాస్ చంద్ర బోస్ సీక్రెట్ ఫైల్స్.. ఖాదర్ చెజిక్కించుకుంటాడు. ఖాదర్ ఆ ఫైల్స్ తో ఏం ప్లాన్ చేశాడు ? జై అన్నయ్య ని చంపింది ఎవరు? న్యూక్లియర్ ఎటాక్ కి నేతాజీ ఫైల్స్ కి మధ్య వున్న సంబంధం ఏమిటి ? అనేది మిగతా కథ.
‘రా’ఏజెంట్స్ కథలన్నీ దాదాపు సింగిల్ లైన్ తోనే వుంటాయి. దేశానికి ఏదో ఆపద వస్తుంది. రంగంలో దిగిన ‘రా’ ఏజెంట్ దాన్ని అడ్డుకొని దేశాన్ని కాపాడుతాడు. ఈ ‘స్పై’ కథ కూడా ఇదే. కానీ దీనికి ఉపకథలు ఎక్కువైపోయి.. అసలు కథ దెబ్బకొట్టింది.
ఖాదర్ చావుతో ఈ కథ మొదలౌతుంది. ఐతే అదే పాత్రని మళ్ళీ తెరపైకి తెచ్చి ఆసక్తిని పెంచే ప్రయత్నం మొదట్లో బాగానే వుంటుంది. ఓ భారీ ఫైట్ తో ఎంట్రీ ఇస్తాడు నిఖిల్. తెరపై ఎదో జరుగుతుందనే ఫీలింగ్ తప్పితే ఆ ఫైట్ తో ప్రేక్షకుడికి ఎలాంటి ఎమోషన్ కనెక్షన్ వుండుదు. తర్వాత జై అన్నయ్య కథ ట్రాక్ లోకి వస్తుంది. అన్నయ్య చావుకి కారణం ఎవరు అనే మిషన్ నడుస్తుండగా .. అసలు కథ నేతాజీ ఫైల్స్ తెరపైకి వస్తుంది. ఐతే ఈ అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు వేసుకున్న సన్నివేశాల అల్లిక బలహీనంగా వుంటుంది.
ఈ కథ మూడ్ కి ఏ మాత్రం సంబంధం లేని ‘హ్యాపీ డేస్’లోని పాటతో ఒక ప్లాష్ బ్యాక్ పెట్టి హీరోయిన్ తెరపైకి తీసుకురావడం, తివిక్రమ్ స్టయిల్ డైలాగులతో పరిచయం, పాట.. ఇదంతా రొటీన్ గా వుంటుంది. హీరోయిన్ ‘రా’ ఏజెంట్ అని రివిల్ చేయడం ఆసక్తికరంగానే వుంటుంది కానీ ఈ క్రమంలో హీరో పాత్రని మరీ అయోమయంగా చూపించారు. తనొక రా ఏజెంట్. హానీ ట్రాప్ చేశానని చెబుతుంది హీరోయిన్. సదరు ట్రైనీ రా ఏజెంట్ అయిన హీరో.. అది విని కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ లా అలక, బుంగమూతి పెట్టుకున్నట్లు ప్రవర్తించడం క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన విధానంలో లోపం. ఇదే కాదు.. ఇందులో ‘రా’ ఏజంట్ గా జై పాత్రకు సరైన క్యారెక్టర్ ఆర్క్ రాసుకోలేదు. తన పాత్ర కొన్ని చోట్ల తెలివిగా ఇంకొన్ని చోట్ల అసలు ‘రా’కి స్పెలింగ్ తెలియని వాడిలా ప్రవర్తిస్తుంటుంది. ఈ కథకు కావాల్సిన ఇంటన్సిటీ ఐతే ఈ పాత్ర ఇవ్వలేకపోయింది.
నిజానికి ఈ సినిమా అసలు కథ నేతాజీ ఫైల్స్ దాని చుట్టూ వున్న నేపధ్యం. సినిమా ఆరంభమే ఆ కోణం నుంచి కథ నడుపుంటే ఇందులో ఎమోషన్ పండేది. జై అన్నయ్య కథని అసలు కథగా నడిపిస్తూ విరామం ముందు నేతాజీ ఫైల్స్ ఎపిసోడ్ ని తెరపైకి తీసుకొస్తారు. ఐతే నేతాజీ జీవితానికి సంబధించిన నేపధ్యం పెట్టుకొని దానిపై ద్రుష్టి పెట్టకుండా.. రొటీన్ టెంప్లెట్ లో ఫస్ట్ హాఫ్ నడపటం మైనస్ గా మారింది.
సెకండ్ హాఫ్ లో కూడా మెరపులు వుండవు. జై ని ‘రా’ నుంచి తొలగించడం, తన ఇద్దరి టీం మెంబర్స్ తో సోలోగా మళ్ళీ మిషన్ లోకి రావడం, ఖాదర్ ని వెతికే ప్రయత్నాలు.. అంతగా ఆకట్టుకోవు. అబ్దుల్ రెహమన్ గా జిషు సేన్‌గుప్తా పాత్రలో ఒక మలుపు వస్తుంది. ఐతే అది శ్రుతిమించిన సినిమా లిబర్టీ. రవితేజ రావణాసుర సినిమాలో ముఖానికి కి మాస్ పెట్టుకుంటే బాడీ కూడా మారిపోయినట్లు ఏడుగురు నకళ్ళు సృష్టించి రా సంస్థలని తప్పు దోవ పట్టించే ఆ ట్రాక్ ఏమంత ఆకట్టుకోదు. పైగా ట్రాక్ హాట్ స్టార్ లో ప్రసారమైన ‘స్పెషల్ ఓపీఎస్’ వెబ్ సిరిస్ ని గుర్తు తెస్తుంది. లేని ఒక క్యారెక్టర్ ని సృష్టించి ‘రా’ ని రాంగ్ ట్రాక్ పట్టిస్తుంటారు అందులో. స్పై లో కూడా అదే వ్యవహారం కనిపిస్తుంది.
నిజానికి స్పై లో నేతాజీకీ సంబధించిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు వున్నాయి. ‘నాగాలాండ్‌లో నేతాజీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ’, కోహిమ బాటిల్.. లాంటి చారిత్రాత్మక కథనాలు వెలుగులో వున్నాయి. స్పై కథ ఆలోచన కూడా కొహిమ బాటిల్ నుంచే పుట్టింటుంది. ఐతే ఈ కథ ని తెరపై చెప్పడానికి దర్శక, రచయితలు పెద్ద కసరత్తు చేయలేదనే చెప్పాలి. స్పై లో నేతాజీ, కొహిమ నేపధ్యం రివిల్ చేసిన విధానం … అంత ఉత్సుకతని రేకెత్తించదు. చరిత్ర చదువుకున్న వాళ్ళు కూడా తికమక పడిపోయేటంత హడావిడిగా, ఎవరో తరుముతున్నట్లు గజిబిజిగా ఆ కథ చెప్పారు. పాత్రలు డైలాగులు చెప్పి వూగిపోవడం తప్పితే ఆ డైలాగుల్లో వున్న ఎమోషన్ ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. అది గాని కనెక్ట్ చేసివుంటే స్పై ఎంతలో కొంత మెరుగ్గా వుండేది.
‘రా’ ఏజంట్ గా కనిపించడం నిఖిల్ కు ఇదే తొలిసారి. తనవరకూ బాగానే చేసిన .. ఈ కథకు వున్న ఇంటర్ నేషనల్ సెటప్ కి ఆ పాత్రని తీర్చిదిద్దిన తీరు సరిపోలేదు. యాక్షన్ సీన్స్ కోసం కష్టపడ్డాడు. హెవీ డైలాగులు చెప్పడం కూడా నిఖిల్ కొత్తే. ఇందులో తన ఇమేజ్ కి మించిన డైలాగులు కొన్ని వున్నాయి. అలాగే కొన్ని డైలాగ్స్ చెప్పినపుడు రోల్ అవుతున్నాయి. అది కొంచెం చూసుకోవాలి. ఐశ్వర మీనన్ అందంగా వుంది కానీ రా ఏజంట్ బాడీ లాంజ్వేజ్ మాత్రం లేదు. అభినవ్ గోమఠం కు ఫుల్ లెంత్ రోల్ దొరికింది. చేసిన పాత్ర రా ఏజెంట్ అయినప్పటికీ ‘ఈనగరానికి ఏమైయింది’ సినిమా నుంచి ఇంకా బయటికి రాలేదనిపిస్తుంది. ఈ కథ మూడ్ కి ఆయన చెప్పే డైలాగులు నాన్ సింకు లో వుంటాయి. బహుసా దర్శకుడు అలాంటి కామెడీనే కావాలని కోరుంటారేమో. ఇందులో ఓ పాత్రని ఉద్దేశించి దూల్ పేట్ మోడల్ అంటాడు అభినవ్. రా ఏజెంట్ గా అభినవ్ ని చూస్తునపుడు కూడా అదే డైలాగ్ అనాలనిపిస్తుంది. మకరంద్ దేశ్ పాండే చేయదగ్గ క్యారెక్టర్ కాదది. నిలబడి బేస్ వాయిస్ లో డైలాగులు చెప్పే పాత్ర. పైగా హీరోని ఉద్దేశించి ‘దేశ చరిత్ర నీ చేతుల్లో వుంది’ అని చెప్పే డైలాగులు కాస్త అతిగా అనిపిస్తాయి. దిని కారణం కథలో అంత ఎమోషన్ లేకపోవడం. ఆర్యన్ రాజేష్ చాలా కాలం తర్వాత తెరపై కనిపించారు. ఐతే అది చిన్న పాత్రే. తనికెళ్ళ భరణి రెండు డైలాగులకు పరిమితమైన పాత్ర. జీషు షేన్ గుప్తా, నితిన్ మెహతా పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. అన్నట్టు సినిమాలో రానా వున్నారు. హెలీ క్యాప్టర్ లో లిఫ్ట్ ఇచ్చే గెస్ట్ రోల్. ఆయన భేస్ వాయిస్ లో కొహిమ నేపధ్యం చెప్పడం.. ఎఫెక్టివ్ వాయిస్ ఓవర్ అనిపిస్తుంది. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
టెక్నికల్ గా సినిమా మరీ అంత గొప్పగా లేదు. భారీ యాక్షన్ సీన్లు తీశారు కానీ అందులో నిలకడ లేదు. కొన్ని సీన్లు చూస్తున్నపుడు కొత్త దర్శకుడి సినిమా అని అర్ధమైపొతుంటుంది. ఒక సీన్ తీసినప్పుడు ఈ సీన్ ద్వారా ఏ ఎమోషన్ ని ప్రేక్షకులకి చెబుతున్నాం, కథలో కోర్ ఎమోషన్ కనెక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోలేదనిపిస్తుంది. నేతాజీ జీవితానికి సంబంధించిన సినిమా ఇది. ఆయన పేరు రివిల్ చేసినప్పుడు ఒక ఎలివేషన్ వుండాలి. దానికి దర్శకుడు ఎంచుకున్న సీను అపరిపక్వంగా వుంటుంది. ఒక రా ఆఫీస్ లో గొప్ప నాయకుల విగ్రహాలు వుంటాయి. అందులో నేతాజీ విగ్రహన్ని రివిల్ చేసినట్లుగా పై అధికారి ఎలివేషన్ ఇవ్వడం చూస్తే .. రా ఆఫీస్ లో విగ్రహాలు కూడా స్టోర్ చేసి ఉంచుతారా ? అనే అనుమానం కలుగుతుంది. టేకింగ్ పరంగా యావరేజ్ మార్కులే పడతాయి. శ్రీచరణ్ పాకాల అవసరం ఉన్న లేకపోయినా బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ బాదుతునే వున్నాడు. కెమరాపనితనం డీసెంట్ గా వుంది. చాలా సనివేశాల్లో సీజీ సరిగ్గా కుదరలేదు. స్పై కోసం పాన్ ఇండియా పాయింట్ నే పట్టుకున్నారు. కానీ దాన్ని తెరపైకి తీసుకొచ్చే విధానం మాత్రం తేలిపోయింది.
తెలుగు360 రేటింగ్ : 2.5/5