తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు గమనించినప్పుడు… ఆశ్చర్యం కలుగుతుంది. సాధారణంగా ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉన్న పార్టీ, ఏదో ఒక నాటికి ఈ రాష్ట్రంలో తాము మళ్లీ గద్దె మీదికి రావాలని కలలు కంటున్న రాజకీయ పార్టీ.. ప్రస్తుతం ఏ చిన్న అవకాశం దక్కినా పాలకపక్షాన్ని ఇరుకున పెట్టడానికే ప్రయత్నిస్తుందని ఎవరైనా ఊహిస్తారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. కేసీఆర్ సర్కారుకు అనుకూలంగా ఉండే విధంగా వీరు నిర్ణయాలు తీసుకుంటున్నారేమో అనే చర్చ జరుగుతోంది. ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలంటే.. కేసీఆర్ కోవర్టులు టీ కాంగ్రెస్ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
తాజాగా తెలంగాణ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా గీతారెడ్డి ని నియమించిన వ్యవహారమే ఇలాంటి అనుమానాలకు తావిస్తోంది. పీఏసీ ఛైర్మన్ పదవి అనేది ప్రభుత్వంలో మంత్రుల తర్వాత ప్రతిపక్షానికి దక్కే అతి పెద్ద పదవి కింద చెప్పుకోవాలి. ఎందుకంటే.. పీఏసీ ఛైర్మన్‌గా ప్రభుత్వం చేపట్టే అన్ని పనులను, పథకాలను పరిశీలించి.. వాటిని సమీక్షించి.. లోపాలను గుర్తిస్తే.. ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా వీరికి హక్కు ఉంటుంది. ఈ పదవిలో ఉన్న సీనియర్ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణానికి గురికావడంతో.. ఖాళీ అయిన స్థానంలో తాజాగా జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డిని నియమించారు. గీతారెడ్డి చాలా సీనియర్ నాయకురాలు. 1989నుంచి ఎమ్మల్యేగా ఉన్నారు. వైఎస్, రోశయ్య, కిరణ్ ల హయాంలో మంత్రిగా ఉన్నారు. డాక్టర్ అయిన గీతారెడ్డి ప్రస్తుతం పీఏసీ ఛైర్మన్ అయిన తొలి మహిళగా రికార్డుల్లోకి ఎక్కారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ సర్కారు మీద గట్టిగా పోరాడగల, కేసీఆర్ సర్కారును దుమ్మెత్తిపోయగల సీరియస్ నాయకులకు ఈ పదవిని ఇవ్వలేదనే ప్రచారం టీ కాంగ్రెస్‌లో జరుగుతున్నది. గీతారెడ్డి ప్రభుత్వం మీద ప్రతిసారీ సాఫ్ట్ టోన్‌తోనే ఉన్నారు తప్ప.. నిర్దిష్టంగా విమర్శలు ఎక్కుపెట్టింది లేదు. అదే ప్రభుత్వ వైఫల్యాలపై ఇంతకంటె తీవ్రస్థాయిలో గళం విప్పుతున్న వారు ఎందరో పార్టీలో ఉన్నారు. వారినందరినీ పక్కన పెట్టి మహిళా కోటా, దళిత కోటా అంటూ మాయమాటలు చెప్పి ఆ పదవిలోకి ఆమెను ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది.
ఇదంతా కూడా కేసీఆర్ స్కెచ్ ప్రకారం వారి కోవర్టులుగా పనిచేస్తున్న టీకాంగ్రెస్ కీలక నాయకుల నిర్ణయాల ప్రకారం జరిగిందనేది పార్టీలో ఇప్పుడు తాజా చర్చ. నిజానికి ప్రభుత్వంతో పోరాడడానికి వీలైన ఈ పదవికోసం జీవన్‌రెడ్డి వంటి సీనియర్లు కూడా ప్రయత్నించారు. అయితే ఆయనను ఫ్లోర్ లీడర్ జానారెడ్డి బుజ్జగించి పోటీనుంచి విరమింపజేసినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. జీవన్‌రెడ్డి కాకపోయినా.. ప్రభుత్వం మీద గట్టిగా పోరాడగల కోమటిరెడ్డి, డికె అరుణ వంటి వారు కూడా ఉన్నప్పటికీ.. వారినందరినీ పక్కన పెట్టి.. సాఫ్ట్ ముద్ర ఉన్న గీతారెడ్డి ఎంపిక కేసీఆర్ సూచన మేరకే జరిగిందా… అని అంతా అనుకుంటున్నారు. కేసీఆర్ తాను సీఎంగా ఉంటూ.. ప్రతిపక్షం కీలక నిర్ణయాలను కూడా తానే నిర్దేశిస్తున్నారేమోనని రాజకీయ వర్గాల్లో జోకులేసుకుంటున్నారు.