నంద్యాల ఉప ఎన్నిక తెలుగుదేశం, వైకాపాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఉప ఎన్నికలో టీడీపీని ఓడించడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని నిరూపించే ప్రయత్నంలో వైకాపా ఉంది. వైకాపా స్థానమైన నంద్యాలలో టీడీపీ గెలిస్తే.. మరోసారి ప్రజలు తమనే కోరుకుంటున్నారు అని రాష్ట్రమంతా ప్రచారం చేసుకునేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. అందుకే, ప్రచారం విషయంలో ఎవ్వరూ తగ్గడం లేదు. వైకాపా నుంచి పోటీకి దిగుతున్న శిల్పా మోహన్ రెడ్డి అంతా తానై ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ, తెలుగుదేశం మాత్రం సర్వశక్తులూ మోహరిస్తోంది. నిజానికి, నంద్యాల ఉప ఎన్నిక బాధ్యత మొత్తం భూమా అఖిల ప్రియ భుజానికి వేసుకున్నారు. బ్రహ్మానంద రెడ్డిని గెలిపిస్తాననే పట్టుదలతో ఉన్నారు. దీంతో టీడీపీ నేతలందరి సాయం ఆమె తీసుకుంటున్నారు. ఎవీ సుబ్బారెడ్డి, మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ శాసన సభ సభ్యుడు మహ్మద్ ఫరూఖ్ లు ప్రచారంలోకి దిగారు. వీరితోపాటు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి రంగంలోకి దిగడం విశేషం!
ఎందుకంటే, గత కొంతకాలంగా ఎంపీ ఎస్పీవై రెడ్డి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కోలుకునే అవకాశం లేదని కూడా ఆ మధ్య కథనాలు వచ్చాయి. అయితే, ఆయన ప్రస్తుతం అనారోగ్యం నుంచి నెమ్మదిగా కోలుకున్నారు. ఆరోగ్యం కుదుట పడుతున్నా కూడా ఆయన్ని ఇప్పుడు గుర్తుపట్టడం కష్టం అన్నట్టుగా మారిపోయారు. ప్రస్తుతం వీల్ చైర్ కి మాత్రమే పరిమితమై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా నంద్యాలలో ప్రచారం చేయడానికి రావడం ఆసక్తికరంగా మారింది. చక్రాల కుర్చీలో నంద్యాలలో ఆయన ప్రచారానికి దిగారు. వీధుల్లో తిరుగుతూ.. ఇంటింటికీ ఆ చక్రాల కుర్చీ మీదనే వెళ్తూ ప్రజలను కలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యాలంటూ ఆయన కోరుతున్నారు. దీంతో ఆయన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎస్పీవై రెడ్డి పరిస్థితి చూసి చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు.
నిజానికి, వైకాపా టిక్కెట్ పై ఎస్పీవై రెడ్డి లోక్ సభ స్థానానికి గెలుపొందారు. అయితే, గడచిన ఎన్నికల దగ్గర్నుంచే జగన్ తో విభేదాలు ఏర్పడ్డాయి. టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఆయన వైకాపాకి దూరమయ్యారు. టీడీపీలో చేరిపోయారు. భూమా నాగిరెడ్డి మరణం తరువాత నంద్యాల ఉప ఎన్నికల్లో తన అల్లుడికి టిక్కెట్ ఇప్పించుకునేందుకు కొన్ని ప్రయత్నాలు చేశారు. కానీ, భూమా కుటుంబానికే టిక్కెట్ కేటాయిస్తున్నట్టు చంద్రబాబు డిసైడ్ చెయ్యడంతో.. పార్టీ ఆదేశాల మేరకు ప్రచారం చేస్తున్నారు. కదల్లేని పరిస్థితిలో ఆయన ఉన్నా.. చంద్రబాబు కోరిక మేరకే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చారని తెలుస్తోంది. మరి, ఈ పెద్దాయన శ్రమ ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.