మహేష్ బాబు సినిమా అనగానే.. అందులో నమ్రత శిరోద్కర్ ఇన్వాల్వ్మెంట్ ఏదో ఓ రూపంలో ఉండడం ఖాయం. మరీ ముఖ్యంగా ప్రమోషన్ల పరంగా నమ్రత చాలా కేర్ తీసుకొంటోందీ మధ్య. ‘స్పైడర్’ మహేష్ కెరీర్లో కీలకమైన సినిమా. ‘బ్రహ్మోత్సవం’ ఫ్లాప్ తో కాస్త వెనకడుగు వేసిన మహేష్ – స్పైడర్‌తో కోలుకోవాలనుకొంటున్నాడు. పైగా తమిళంలో ఈ సినిమాని ఓ స్ట్రయిట్ సినిమాలానే భావించి విడుదల చేస్తున్నారు. అటు తమిళం, ఇటు తెలుగు రెండు చోట్లా ప్రమోషన్లు చూసుకోవాలి. తెలుగు వెర్షన్ వరకూ ప్రమోషన్ల బాధ్యత నమ్రత తీసుకొందని సమాచారం. యాడ్లు మినహాయించి… అన్ని రకాల ప్రమోషన్ వ్యవహారాలు నమ్రత డైరక్షన్లోనే నడుస్తున్నాయని టాక్. ఇప్పటికే నమ్రత ఇంటర్వ్యూల టైమ్ టేబుల్ ని ఫిక్స్ చేసేసిందట. ఈనెల 23 వరకూ ‘భరత్ అను నేను’ సినిమా షూటింగ్లో మహేష్ బిజీగా ఉంటాడు. ఆ తరవాత పది రోజులు ‘స్పైడర్’ ప్రమోషన్‌కే కేటాయించాడు మహేష్. ఈ ప్రమోషన్లు ఎలా చేయాలి? ఏయే రోజు ఎవరెవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాలి? అనే విషయంలో నమ్రత ఇప్పటికే గైడెన్స్ జారీ చేసేసిందట. ఈనెల 24 నుంచి స్పైడర్ ప్రమోషన్లు ప్రారంభం అవ్వబోతున్నాయి. తమిళ వెర్షన్‌కి సంబంధించిన ప్రమోషన్లు మురుగదాస్ నేతృత్వంలోనే నిర్వహిస్తున్నారు. మొత్తానికి.. స్పైడర్ విషయంలో నమ్రత జోక్యం మొదలైపోయినట్టే.