స్పైడర్ రూపకర్తల ఆలోచనలు మహేష్‌బాబు అభిమానుల్ని నిరుత్సాహంలో పడేస్తున్నాయి. ఫస్ట్ లుక్ కోసం, టైటిల్కోసం అభిమానుల్ని నెలల తరబడి ఎదురుచూసేలా చేసింది చిత్రబృందం. వేసవిలో విడుదల కావల్సిన స్పైడర్…. అనివార్య కారణాల వల్ల దసరా వరకూ విడుదలకు నోచుకోవడం లేదు. టీజర్ ఓకే అనిపించేలా ఉంది తప్ప… మహేష్ – మురుగదాస్ కాంబినేషన్‌కున్న హైప్‌ని అందుకొనేలా లేదు. ఇప్పటి వరకూ రెండు పాటలొచ్చాయి. ఈ రెండు పాటలూ తమిళవాసన కొట్టేస్తున్నాయని నాన్ మహేష్ ఫ్యాన్స్ ఎకసెక్కాలు చేసేస్తున్నారు. ఆ మాటా నిజమే. తమిళ పాటని తెలుగులో డబ్బింగ్ చేసిన సౌండింగ్… మహేష్ అభిమానులకు మింగుడు పడడం లేదు. ఇవి చాలవన్నట్టు… ఇప్పుడు స్పైడర్ ఆడియో ఫంక్షన్‌ని తమిళనాడుకి షిప్ట్ చేశారు. అక్కడ తమిళ పాటల్ని విడుదల చేసి, తెలుగులో మరో ఫంక్షన్ ఏర్పాటు చేస్తారనుకొంటే, తెలుగు, తమిళ పాటల్ని కంబైన్డ్‌గా అక్కడే రిలీజ్ చేసేస్తున్నారిప్పుడు. దాంతో ఇది తెలుగు సినిమా, లేదంటే తమిళంలో తీసి, తెలుగులో డబ్ చేస్తున్నారా..?? అనే కౌంటర్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు… మహేష్ అండ్ కో తెలుగుని వదిలేసి, తమిళ వెర్షన్ కే ఫోకస్ పెట్టారన్న వాదనలకు బలం చేకూరుతోంది. ఇప్పటికే టీజర్, పాటలు తమిళ వాసనలు కొడుతున్నాయని ముక్కు మూసుకొంటున్నారు సినీ అభిమానులు. ఇప్పుడు ఏకంగా తమిళనాటే మకాం పెట్టేస్తుంటే.. ఇంకేమంటారో???