ఓటీటీ ప్రపంచాన్ని షేక్ చేసిన వెబ్ సిరిస్ స్క్విడ్ గేమ్. హ్వాంగ్ డాంగ్ – హ్యూక్ డైరెక్ట్ చేసిన ఈ కొరియన్ సర్వైవల్ డ్రామా ‘నెట్ఫ్లిక్స్’ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. కొరియాలో రూపొందిన ఈ సిరిస్ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ వున్నారు. తొలి సీజన్ ఓ పెను సంచలనం. చిన్నపిల్లల ఆటలా కనిపించే ఈ గేమ్ లో ఓడిపోతే ప్రాణాలు కోల్పోవడం తప్పితే మరో అవకాశం లేదు. ఈ గేమ్ థీమ్, సెటప్, యాంబియన్స్, అంతర్లీనంగా వుండే హ్యుమనిజం, క్యాపిటలిజం ఐడియాలజీ ఆడియన్స్ ని షాక్ కు గురి చేసింది. ఈ సిరిస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. సీజన్ 2 కోసం ఎంతగానో ఎదురుచూసిన ఆడియన్స్ నిరీక్షణకు తెరదించుతూ స్క్విడ్ గేమ్2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ కొత్త సీజన్ అంచనాలని అందుకుందా? ఆడియన్స్ ని మరోసారి సర్ ప్రైజ్ చేసిందా?
తొలి సీజన్ కథని గుర్తు చేసుకుంటూ వెళితే.. ఏవో వ్యాపారాలు, వ్యసనాలతో సర్వం కోల్పోయిన కొందరికి అనూహ్యంగా డబ్బు సంపాదించే అవకాశం వస్తుంది. ఓ ఆట ఆడటానికి ఆహ్వానం అందుతుంది. ఆట నిర్వాహకులు ఈ సమూహం అంతటిని బయట ప్రపంచానికి తెలియని ఓ దీవికి తరలించి ఆట మొదలుపెడతారు. అయితే అది మామూలు ఆట కాదని, ఈ ఆటలో ఓడిపోతే ప్రాణాలు మిగలవని తొలి గేమ్ లోనే అందరికీ తెలిసొస్తుంది. అయినప్పటికీ డబ్బుతో వారికుండే అవసరం, ఆశ చివరివరకూ ఆటని కొనసాగించేలా చేస్తుంది. ఈ లైఫ్ ఆర్ డెత్ గేమ్ లో ఒకే ఒక్కడు మిగులుతాడు. అతడే.. షియెంగ్ జీ హున్ (లీ జంగ్-జే). ఆటలో అన్ని దశలు దాటి 45.6 బిలియన్ కొరియన్ వన్లు గెలుచుకుంటాడు. డబ్బుతో బయటపడతాడే గానీ ఆ మృత్యుక్రీడ ఆడిస్తూ రాక్షసానందం పొందుతున్న వారిని పట్టుకొని, ఆ దీవిలో జరుగుతున్న మృత్యుక్రీడని బయటపెట్టి ఆటకు ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు. తాను సంపాదించిన ప్రైజ్ మనీ తో ఆయుధాలు సమకూర్చుకొని యుద్ధం చేయడానికి సిద్ధమౌతుంటాడు. అయితే ఆ ఆట నిర్వాకులు ఆచూకీ ఎంతకీ చిక్కదు. ఒకదశలో తానే ఎర రూపంలో మళ్ళీ ఆ గేమ్ లో అడుగపెడతాడు. తర్వాత ఏం జరిగింది? ఏ ధైర్యంతో జీ హున్ మళ్ళీ ఆ గేమ్ కి వెళ్ళాడు? ఈసారి ఎలాంటి సవాళ్ళు ఎదురుకున్నాడు? అనేది మిగతా కథ.
‘స్క్విడ్ గేమ్’ సంచలనం సాధించడానికి చాలా కారణాలు వున్నాయి. థీమ్ లో తాజాదనం, ప్రేక్షకుడిని లీనమైపోయేలా చేసే యాంబియన్స్, మనిషిని డబ్బు ఆడించే ఆట, ఆశ, అత్యాశ, దురాశ, ద్రోహం, చావు బ్రతుకుల నడుమ మనిషి నిజ స్వరూపం, సంపద సృష్టి ముందు చిన్నబోయే జీవితం, ఒకరి చావు మరొకరికి వినోదం.. ఇలా డైరెక్టర్ ఎంచుకున్న ప్రతి ఎలిమెంట్ ప్రేక్షకుడిని పట్టేసింది. అసలు ఇలాంటి ఒక గేమ్ ని ఎలా ఊహించగాలిగారనే ఆశ్చర్యాన్ని కలిగించింది. రెండో సీజన్ లోకి వచ్చేసరికి థీమ్, కాన్సెప్ట్ అదే కావడంతో షాకింగ్ అనుభూతి తగ్గినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆద్యంతం చూడగలిగేలా సిరిస్ నడిచింది.
సీజన్ 2 లో మొత్తం ఏడు ఎపిసోడ్లు వున్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ నిడివి యావరేజ్ గా గంట. తొలి రెండు ఎపిసోడ్స్ లో సన్నివేశాలు నిదానంగా సాగుతాయి. షియెంగ్ జీ హున్, డిటెక్టివ్ జున్ హో ట్రాకులు విడివిడిగా మొదలై.. ఇద్దరూ ఆ దీవిలో జరుగుతున్న దురాగతాన్ని బట్టబయలు చేసే దిశగా జరిపే ప్రయత్నాలు అంత ఉత్సకతని రేకెత్తించేలా వుండవు. ఎప్పుడైతే షియెంగ్ జీ హున్ మళ్ళీ గేమ్ లోకి అడుగుపెడతాడో అక్కడ నుంచి సన్నివేశాలు రక్తికడతాయి. తర్వాత వచ్చే ఐదు ఎపిసోడ్లు పరుగులు పెడతాయి.
తొలి ఆట పాతదే అయినప్పటికీ అందులోనుంచి పుట్టే మలుపు కొత్తగా ఉంటుంది. రెండో ఆట పూర్తిగా కొత్తది. ఒకే ఆటలో ఐదు దశలు దాటడం అక్కడ నెలకొనే టెన్షన్ బాగా కుదిరింది. మింగిల్ అనే మూడో ఆటలో గ్రిప్పింగ్ గా సాగుతుతుంది. ఈ సీజన్ లో బెస్ట్ గేమ్ ఇది. ఇక్కడ ప్లేయర్స్ కి ఎదురైన మానసిక సంఘర్షణ కనిపిస్తుంది. చివరి ఎపిసోడ్ ని పూర్తిగా యాక్షన్ గా మార్చేశారు. బుల్లెట్ల మోత మోగిపోయే ఎపిసోడ్ ఇది. చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే సీజన్ 2కి ఎండ్ కార్డ్ పడుతుంది. అసలు జరగాల్సిన ఆట, జీ హున్ లక్ష్యం.. ఇదంతా సీజన్ 3కి పరిమితం చేశారు.
సీజన్ 2 కొన్ని లోటుపాట్లు కూడా కనిపిస్తాయి. సీజన్ 1లో వున్న ప్లాట్ లైనే కొత్త సీజన్ లోనూ రావడం రిపీట్ అనిపిస్తుంది. ఆటలో షాక్ వాల్యు తగ్గిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ సీజన్ తో పోల్చుకుంటే కథనంలో వేగం తగ్గడంతో పాటు ప్రతి ఆట తర్వాత ఓటింగ్ పేరుతో సాగదీత ఎక్కువైయింది. పైగా ఇందులో సర్ ప్రైజ్ లు అంత థ్రిల్ పంచవు. ప్లేయర్ 001 క్యారెక్టర్ తో వచ్చే ట్విస్ట్ ని ఆడియన్ ముందుగానే ఊహిస్తాడు. అయితే అతడి అసలు పాత్ర ఏమిటనేది సీజన్ 3లో కీలకం. ఈ సీజన్ లో తల్లీ కొడుకులు, గర్భిణి అమ్మాయి, ట్రాన్స్జెండర్, క్రిప్టో కరెన్సీలో మోసపోయిన యువకుడు, ఇద్దరు ప్రేమికులు, డ్రగ్ ఎడిక్ట్ రాప్ సింగర్, షియెంగ్ జీ హున్ ఫ్రెండ్ .. ఇలా చాలా పాత్రల బ్యాక్ స్టోరీలు ఎక్కువైపోయాయి. ఈ సీజన్ వరకూ ఆ పాత్రలకు సరైన న్యాయం జరగలేదు.
షియెంగ్గా లీ జంగ్-జే మరోసారి ఆకట్టుకున్నాడు. ఓ ప్లాన్ తో అక్కడికి అడుగుపెట్టిన షియెంగ్ అది బెడిసికొట్టడంతో షాక్ అయిపోతాడు. అది ఎంత ప్రమాదకరమైన ఆటో అతడికి తెలుసు. వీలైనంత మందిని ప్రాణాలతో బయటపడేయాలని సిరిస్ ఆద్యంతం ప్రయత్నించే అతని ఆరాటంతో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. తొలి సీజన్ విన్నర్ అయినప్పటికీ ఆ డెడ్లీ గేమ్ నుంచి బయటపడటం అంత ఈజీ కాదన్నట్లుగానే ఆ పాత్రని తీర్చిదిద్దిన తీరు బావుంది. 001 క్యారెక్టర్ చేసిన నటుడు కూడా అదరగొట్టాడు. డిటెక్టివ్ పాత్రలో చేసిన నటుడితో పాటు గేమ్ లో కనిపించి దాదాపు నటులు నటన పరంగా ఆకట్టుకుంటారు. టెక్నికల్ సిరిస్ సాలిడ్ గా వుంది. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం,సెట్స్ డిజైన్స్ అన్నీ రిచ్ గా వున్నాయి. తొలి సీజన్ తో పోల్చుకుంటే షాక్ వాల్యు తగ్గినప్పటికీ ఆద్యంతం ఆసక్తిగా చూడగలిగేలా ఉంటుంది స్క్విడ్ గేమ్2.