హైదరాబాద్: వంగవీటి మోహనరంగా హత్య వెనక చంద్రబాబు హస్తం ఉందన్న అంశంపై ఆంధ్రప్రదేశ్లోని కాపు సామాజికవర్గం అంతా అట్టుడుకుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రజ్యోతిని విమర్శిస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజికవర్గం అట్టుడుకుతుంటే ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఆంధ్రజ్యోతి, వారి ఛానల్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఈ ఆరోపణల సంగతిని పక్కన పెడితే, చేగోండి హరిరామజోగయ్య ఇటీవల రచించిన ఆత్మకథ నేపథ్యంలో రంగా హత్య మళ్ళీ చర్చనీయాంశమైనమాట మాత్రం వాస్తవమే. బీజేపీ రాష్ట్రంలో ఒక గణనీయమైన శక్తిగా ఎదగాలని, దానికి కాపుల మద్దతును కూడగట్టాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో, కాపులకు రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభంవంటి ఆ సామాజికవర్గ నాయకులు ఉద్యమిస్తున్న సమయంలో – జోగయ్య ఆత్మకథ మార్కెట్లోకి రావటం యాధృచ్ఛికమే అయినప్పటికీ, రాష్ట్ర రాజకీయాలలో ఒక కీలక మలుపుగా చెప్పొచ్చు. ఇది బీజేపీకి ఒకవిధంగా అనుకూలించే విషయంకూడా. ఇప్పటికే కాపు సామాజికవర్గంలోని నాయకుడికి ఎవరికైనా కీలక బాధ్యతలు అప్పజెప్పాలని బీజేపీ యోచిస్తోంది. 2014 ఎన్నికలలో తెలుగుదేశానికి మద్దతిచ్చి చంద్రబాబు విజయంలో కీలక పాత్ర పోషించిన కాపులను తమవైపుకు తిప్పుకోవటంద్వారా 2019 ఎన్నికలలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో – కాపులను గతంలో తెలుగుదేశం దెబ్బకొట్టిందన్న వాదనను జోగయ్య మళ్ళీ తెరమీదకు తేవటాన్ని తాముకూడా వాడుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. అందుకే కాపు సామాజికవర్గం అట్టుడుకుతోందని పెద్ద పెద్ద మాటలు చెబుతోంది. ఏది ఏమైనా కాపులు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కీలకంగా మారారు. తెలుగుదేశంపట్ల వారి ఆలోచనాధోరణి ఎలా ఉండబోతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.